ఎంబీబీఎస్ ఫీజు పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: ఈ విద్యా సంవత్సరానికి యాజమాన్యపు కోటా (సి- కేటగిరీ) కింద భర్తీ చేసే ఎంబీబీఎస్ సీట్ల ఫీజును పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను హైకోర్టు బుధవారం విచారణకు స్వీకరించింది. ప్రభుత్వంతో పాటు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ), పలు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు ఈ నోటీసులు జారీ చేసింది. ప్రవేశాల సమయంలో ఇంటర్ మార్కులతో పాటు మౌఖిక పరీక్షకు 15 శాతం మార్కులు కేటాయించే వెలుసుబాటును యాజమాన్యాలకు కల్పించడంపై హైకోర్టు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలాంటి నిబంధనను రూపొందించడానికి ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నించింది. నిబంధనలకు సవరణలు చేసి మరీ 15 శాతం వెయిటేజీ నిబంధనను చేర్చారని తెలుసుకున్న ధర్మాసనం, ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామంది.
న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో 9ను సవాలు చేస్తూ తెలంగాణ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు బాలరాజు, హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి చరణ్ కౌశిక్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.