డాక్టర్ నిరుద్యోగి...!
సాక్షి, హైదరాబాద్: మెడిసిన్‌లో సీటొస్తే చాలు జీవితంలో స్థిరపడినట్లేనని ఇన్నాళ్లూ భావించిన వారంతా ఇప్పుడు ఆందోళనలో పడ్డారు. నాలుగేళ్ల వైద్యవిద్య, ఏడాది హౌస్ సర్జన్ శిక్షణ పూర్తి చేసుకొని మార్కెట్‌లోకి వస్తే ప్రస్తుతం కార్పొరేట్ ఆస్పత్రుల్లో నర్సు ఉద్యోగం చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. పీజీ ఉంటే తప్ప గుర్తింపు లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బీఏ, బీకాం, బీఎస్సీ పట్టాలు పుచ్చుకున్న వారికి రాష్ట్రంలో ఎలాగూ ఉద్యోగాలు లేవు. ఇంజనీరింగ్, ఎంటెక్ పట్టభద్రులు కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎంబీబీఎస్ పట్టాలు తీసుకున్న వైద్యులూ ఉద్యోగాల కోసం వెంపర్లాడుతున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ అంచనా ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్ల ఎంబీబీఎస్ చదివిన నిరుద్యోగుల సంఖ్య 15వేలకు చేరింది. వారిసంఖ్య ఏటా 3వేలు పెరుగుతోంది. ప్రభుత్వ విభాగంలో నోటిఫికేషన్లు రాకపోవడం, ప్రైవేటు ఆస్పత్రుల్లో పరిస్థితులు బాగోలేకపోవడంతో ఎంబీబీఎస్ వైద్యులు నిరాశలో పడిపోయారు.
అడ్డంగా వాడేసుకుంటున్న కార్పొరేట్ ఆస్పత్రులు
సరిగ్గా మూడేళ్ల కిందట.. అంటే 2013 సెప్టెంబర్ 3న ఎంబీబీఎస్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పట్లో 1,200 కుపైగా పోస్టులకు దరఖాస్తులు పిలిస్తే.. ఒక్కో పోస్టుకు 25 మందిపైనే దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయడానికి మాత్రమే నోటిఫికేషన్ ఇస్తుండడంతో ఎంబీబీఎస్ చదివిన వారు స్పందించడం లేదు. 2013 తర్వాత ఇప్పటివరకూ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషనే ఇవ్వలేదు. దీంతో ఎక్కడైనా కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తామని వెళుతున్నా ఎంబీబీఎస్ వైద్యులను దారుణంగా వాడుకుంటున్నారు.
క్యాజువాలిటీ లేదా ఎమర్జెన్సీ వార్డుల్లో రక్తపోటు, మధుమేహం, పల్స్ రేటు చూడటం వంటివి మినహా వాళ్లకు మరేమీ చెప్పరు. పైగా ఇలాంటి వాళ్లకు నైట్ డ్యూటీలు తప్ప పగలు ఏదైనా వైద్యం నేర్చుకునే పని చెప్పరు. రూ. 40వేలకు మించి జీతం ఇవ్వరు. దీంతో పీజీ సీట్లు రాని వేలమంది వైద్యులు తమ ఊర్లలోనే క్లినిక్‌లు నడుపుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల వేలాదిమంది లక్షలు చెల్లించి రష్యా, చైనా, ఫిలిప్పీన్స్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాల్లో ఎంబీబీఎస్ చదివి వచ్చారు. వాళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
పీజీ లేకుండా ఎంబీబీఎస్ దండగ..!
పీజీ లేకుండా ఎంబీబీఎస్ చదవడం దండగ అని వేల మంది ఎంబీబీఎస్ పట్టభద్రులు అభిప్రాయపడుతున్నారు. ప్రైవేటు కళాశాలల్లో లక్షలు చెల్లించి చదివిన వారు మరింతగా బాధపడుతున్నారు. ఎంబీబీఎస్ పూర్తయ్యాక రెండేళ్ల లోపు పీజీ సీటు రాకపోతే పోటీ పెరిగి తర్వాత పీజీ సీటు రావడం లేదని, పీజీ సీటుకు రెండు కోట్లు చెల్లించి ఎంతమంది చదవగలరని వాపోతున్నారు.
ఇదిలా ఉండగా ఆరు నెలల కిందట సర్కారు పీజీ చదివిన వైద్యులు కావాలని వైద్యవిధానపరిషత్‌లో నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 255 పోస్టులు ఉండగా.. దరఖాస్తులు 200 మాత్రమే వచ్చాయి. అందులో ఉద్యోగంలో చేరింది కేవలం 58 మందే. కాంట్రాక్టు ఉద్యోగాలంటే ఎంబీబీఎస్ వైద్యులే రాకపోతే, పీజీ వైద్యులకు కాంట్రాక్టులో నోటిఫికేషన్ ఇస్తే రారనేది అందరికీ తెలిసిందే. అందుకే రాష్ట్రంలో స్పెషాలిటీ డాక్టర్ల కొరత వందలు కాదు వేలలో ఉంది.