ఎంబీబీఎస్‌ సిలబస్ మారుతోంది..‌! | Changes In MBBS Syllabus Likely From 2019 | Sakshi
Sakshi News home page

ఎంబీబీఎస్‌ సిలబస్ మారుతోంది..‌!

Published Mon, Jun 11 2018 8:30 AM | Last Updated on Tue, Oct 16 2018 2:57 PM

Changes In MBBS Syllabus Likely From 2019 - Sakshi

ఎంబీబీఎస్‌.. పరిచయం అక్కర్లేని కోర్సు! వేలమంది అభ్యసిస్తున్న ప్రోగ్రామ్‌! లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్‌ తీసుకుని.. ప్రవేశ పరీక్షలో ర్యాంకు సాధించి.. ఎంబీబీఎస్‌లో చేరుతున్నారు. కానీ, ఆ తర్వాత కోర్సు అభ్యసనం పరంగా ఆశించిన స్థాయిలో నైపుణ్యాలు సాధించట్లేదనే వాదన ఉంది. సిలబస్‌ను అప్‌డేట్‌ చేయకపోవడం దీనికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాంతో ఎంబీబీఎస్‌ సిలబస్‌ను మార్చే దిశగా ఏడాదిన్నర క్రితమే కసరత్తు ప్రారంభమైంది. భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) ఆధ్వర్యంలో రూపొందిన ముసాయిదా సిలబస్‌ ఇటీవల డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్‌ఎస్‌)కు చేరింది. 2019 నుంచే కొత్త సిలబస్‌ అమల్లోకి రానుందనే వార్తల నేపథ్యంలో ఎంబీబీఎస్‌ కొత్త సిలబస్‌లో ప్రధాన మార్పులు, విద్యార్థులకు కలిగే ప్రయోజనాలపై విశ్లేషణ..

‘ప్రస్తుతం బోధిస్తున్న ఎంబీబీఎస్‌ సిలబస్‌ దాదాపు రెండు దశాబ్దాల క్రితం అంటే 1997లో రూపొందించింది. ప్రస్తుతం కమ్యూనిటీ హెల్త్‌ పరంగా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి నేటి పరిస్థితులకు అనుగుణంగా  మార్పులుతేవాలి. ప్రస్తుత రోగాలు, అవసరాలకు తగ్గట్లు ఎంబీబీఎస్‌ సిలబస్‌లో మార్పులు చేస్తేనే విద్యార్థులకు, సమాజానికి ప్రయోజనం ఉంటుంది’ 
– గత కొంత కాలంగా విద్యావేత్తలు, వైద్య రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలివి.

వీటిని పరిగణనలోకి తీసుకున్న డీజీహెచ్‌ఎస్‌.. ఎంబీబీఎస్‌ కోర్సుకు కొత్త సిలబస్‌ రూపొందించాలని ఎంసీఐ అకడమిక్‌ కమిటీకి సూచించింది. దీనికి అనుగుణంగా దాదాపు ఏడాదిన్నరపాటు కసరత్తు చేసిన కమిటీ పలు కొత్త మార్పులతో సిలబస్‌ రూపొందించింది. ముసాయిదా ప్రతిని ఇటీవల డీజీహెచ్‌ఎస్‌కు అందించింది. ఇది ఆమోదం పొందితే 2019–20 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్‌లో అడుగుపెట్టే విద్యార్థులకు కొత్త సిలబస్‌ స్వాగతం పలికే అవకాశముంది.

ప్రాక్టికల్‌ అప్రోచ్‌కు ప్రాధాన్యం
ఎంసీఐ రూపొందించిన కొత్త సిలబస్‌ విద్యార్థుల్లో ప్రాక్టికల్‌ అప్రోచ్‌ను పెంచేలా ఉంది. ఇప్పటివరకు అయిదున్నరేళ్ల ఎంబీబీఎస్‌ కోర్సులో అధిక శాతం థియరీ సబ్జెక్ట్‌లే. దీంతో విద్యార్థులు కంపల్సరీ రొటేటరీ ఇంటర్న్‌షిప్‌ సమయంలో సరైన పనితీరు కనబర్చ లేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మొదటి సంవత్సరం నుంచే క్లినికల్, నాన్‌–క్లినికల్‌ సబ్జెక్టుల్లో థియరీతోపాటు ప్రాక్టికల్స్‌కు కూడా ప్రాధాన్యమిచ్చేలా కొత్త సిలబస్‌ను ఎంసీఐ అకడమిక్‌ కమిటీ రూపొందించింది. దాంతోపాటు కొత్త కరిక్యులంలో థియరీ, ప్రాక్టీస్‌ మధ్య అంతరా (గ్యాప్‌)న్ని తగ్గించనున్నారు. అదే విధంగా మొదటి సంవత్సరంలోనే బేసిక్, లేబొరేటరీ సైన్స్‌లకు ప్రాధాన్యం పెంచనున్నారు. కోర్సు రెండు, మూడు సంవత్సరాల్లో క్లినికల్‌ మెడిసిన్‌ అంశాలకు ప్రాధాన్యం పెంచేలా కరిక్యులంలో మార్పు చేశారు.

ఫౌండేషన్‌ కోర్సు
ఎంబీబీఎస్‌ కొత్త కరిక్యులంలో ప్రధానంగా పేర్కొనాల్సిన అంశం.. ఫౌండేషన్‌ కోర్సు పేరుతో ఓరియెంటేషన్‌ ప్రోగ్రామ్‌ను రూపొందించడం. మొదటి సంవత్సరంలో తొలి రెండు నెలలు ఫౌండేషన్‌ కోర్సు ఉంటుంది. దీని ప్రధాన ఉద్దేశం విద్యార్థుల్లో సామాజిక సేవా దృక్పథాన్ని కూడా పెంచడం.  ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో వైద్యులు అనుసరించాల్సిన విధానాలు, ప్రజారోగ్యం, వైద్య రంగంలో నైతిక విలువల ప్రాధాన్యత, హెల్త్‌ ఎకనామిక్స్, లెర్నింగ్‌ స్కిల్స్, కమ్యూనికేషన్‌ స్కిల్స్, కంప్యూటర్‌ స్కిల్స్, లైఫ్‌ సపోర్ట్, సోషియాలజీ అండ్‌ డెమోగ్రాఫిక్స్, బయోహజార్డ్‌ సేఫ్టీ, పర్యావరణ అంశాలు, సామాజిక దృక్పథం తదితర అంశాలను ఫౌండేషన్‌ కోర్సులో భాగంగా బోధిస్తారు. ఫలితంగా ఎంబీబీఎస్‌ కోర్సు ఆవశ్యకత, ఈ కోర్సుకున్న సామాజిక బాధ్యత గురించి విద్యార్థులకు అవగాహన వస్తుంది. ఫౌండేషన్‌ కోర్సు పూర్తి చేసుకున్నాకే.. పూర్తిస్థాయిలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం కోర్‌ సబ్జెక్టుల బోధన ప్రారంభమవుతుంది.

రియల్‌ కేస్‌ స్టడీస్‌
ఎంబీబీఎస్‌ విద్యార్థులకు క్లినికల్‌ ట్రైనింగ్‌లో నైపుణ్యం ఎంతో అవసరం. మొదటి సంవత్సరం నుంచే ఈ దిశగా అడుగులు వేసేలా కొత్త కరిక్యులంలో కొన్ని అంశాలు పొందుపర్చారు. ఈ మేరకు బేసిక్స్‌ను, లేబొరేటరీ సైన్సెస్‌ను అనుసంధానం చేయనున్నారు. దీంతోపాటు వాస్తవ పరిస్థితుల్లోని ‘కేస్‌’లను క్లాస్‌రూంలో చెప్పి.. విద్యార్థుల మధ్య వాటిపై గ్రూప్‌ డిస్కషన్స్‌ నిర్వహించడం, అదే విధంగా కేస్‌ బేస్డ్‌ లెర్నింగ్‌కు మొదటి సంవత్సరంలోనే ప్రాధాన్యమిచ్చేలా కరిక్యులంలో మార్పులు చేశారు.

ఎలక్టివ్స్‌ విధానం
కొత్త కరిక్యులంలో మరో ముఖ్య మార్పు ఎలక్టివ్స్‌ విధానాన్ని సిఫార్సు చేయడం. తద్వారా విద్యార్థుల్లో ఫ్లెక్సిబుల్‌ లెర్నింగ్‌ దృక్పథం పెరగనుంది. ఈ ఎలక్టివ్స్‌లో భాగంగా క్లినికల్‌ ఎలక్టివ్స్, లేబొరేటరీ పోస్టింగ్స్, కమ్యూనిటీ ఎక్స్‌పోజర్స్‌ను ప్రధానంగా పేర్కొన్నారు. ప్రస్తుత విధానంలో ఈ అంశాలపై విద్యార్థులు చాలా తక్కువగా దృష్టిసారిస్తున్నారు. అయితే తప్పనిసరి ఎలక్టివ్స్‌ విధానం ఫలితంగా నిర్దేశిత ఎలక్టివ్స్‌ వల్ల స్వీయ శిక్షణ నైపుణ్యాలు, క్రిటికల్‌ థింకింగ్, రీసెర్చ్‌ సామర్థ్యాలు పెరుగుతాయనే ఉద్దేశంతో వీటిని రూపొందించారు.

ఫోరెన్సిక్‌ సైన్స్‌పై అవగాహన
ఎంబీబీఎస్‌ నూతన కరిక్యులంలో పేర్కొనాల్సిన మరో ప్రధాన అంశం.. ఫోరెన్సిక్‌ సైన్స్‌ అంశంపై పూర్తి అవగాహన కల్పించనుండటం. ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌లో ఫోరెన్సిక్‌ సైన్స్‌లో రెండు పేపర్లను (క్లినికల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్, మెడికో–లీగల్‌ కేస్‌లపై ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌) రూపొందించాలని నిర్ణయించారు. 

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌
ఎంబీబీఎస్‌లో కొత్త కరిక్యులంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ విధానానికి రూపకల్పన చేశారు. ఎంబీబీఎస్‌ లైసెన్స్‌ పొందడానికి ముందే సదరు స్కిల్స్‌లో సర్టిఫికెట్‌ పొందడం తప్పనిసరి అని ఎంసీఐ అకడమిక్‌ కమిటీ స్పష్టం చేసింది. వీటితోపాటు ప్రతి మెడికల్‌ కళాశాల.. అక్కడి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్స్, హాస్పిటల్స్‌తో అనుసంధానమై విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని సూచించింది. నేటి పరిస్థితులకు అనుగుణంగా స్కిల్‌ ల్యాబ్, ఈ–లెర్నింగ్, సిమ్యులేషన్‌ వంటి నైపుణ్యాలు సైతం అందించేలా సిలబస్‌లో మార్పులు చేయనుంది.

మరిన్ని మార్పులు
క్లినికల్‌ ట్రైనింగ్‌లో స్టూడెంట్‌–డాక్టర్‌ విధానం పేరుతో కొత్త విధానానికి రూపకల్పన చేశారు. దీని ప్రకారం విద్యార్థులకు కొన్ని ప్రధాన అంశాల్లో నైపుణ్యాలు అందించనున్నారు. అవి..

  • అవుట్‌ పేషెంట్, ఎమర్జెన్సీ విభాగాల్లో సాధారణంగా ఎదురయ్యే సమస్యలపైఅవగాహన కల్పించడం.
  • రోగుల సేవలో, వ్యాధుల నిర్ధారణలో పాల్పంచుకోవడం, రోగికి చికిత్స అందించే క్రమంలో ప్రాథమిక విధానాలపై అవగాహన కల్పించడం.
  • ఫ్యామిలీ మెడిసిన్‌ శిక్షణను తప్పనిసరి చేయడం.
  • క్లినికల్‌ ట్రైనింగ్‌ విధానంలో మార్పులు చేయడం. ‘కోర్‌’ అంశాల ఆవశ్యకతతోపాటు ఎలక్టివ్స్‌ను పేర్కొనడం.

కాంపిటెన్సీ బేస్డ్‌ లెర్నింగ్‌
ఎంబీబీఎస్‌ కరిక్యులంలో కాంపిటెన్సీ బేస్డ్‌ లెర్నింగ్‌ విధానాన్ని రూపొందించాలని కూడా ఎంసీఐ సిఫార్సు చేసింది. ఫలితంగా వాస్తవ పరిస్థితుల్లో అవసరమైన అంశాలపై అవగాహన, సునిశిత పరిశీలన నైపుణ్యాలు లభిస్తాయని పేర్కొంది.

ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌
వైద్య విద్యలో ఎదురవుతున్న మరో ప్రధాన సమస్య ఫ్యాకల్టీ. అదే విధంగా ఇప్పటికే ఉన్న ఫ్యాకల్టీ విషయంలో కొత్త నైపుణ్యాలపై అవగాహన తక్కువగా ఉండటం. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. నిరంతరం ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహించేందుకు రీజనల్‌ లెర్నింగ్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎంసీఐ సిఫార్సు చేసింది.

ఎగ్జిట్‌ ఎగ్జామ్‌పై సందిగ్ధం
గత కొంత కాలంగా ఎంబీబీఎస్‌ విద్యార్థులను ఆందోళకు గురిచేస్తున్న వార్త.. ‘ఎంబీబీఎస్‌ పూర్తిచేసుకున్న విద్యార్థులు ఎగ్జిట్‌ ఎగ్జామ్‌ పేరుతో నిర్వహించే మరో పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అప్పుడే లైసెన్స్‌ పొందేందుకు అర్హత లభిస్తుంది’. దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో కొత్త కరిక్యులంకు సంబంధించి రూపొందించిన ముసాయిదాలో ఎగ్జిట్‌ ఎగ్జామ్‌ విషయంలో ‘స్టేటస్‌ కో టు బి మెయిన్‌టెయిన్డ్‌’ అని ఎంసీఐ పేర్కొంది.

విద్యార్థులకు ప్రయోజనాలు..

  • నూతన అభ్యసన నైపుణ్యాలు.
  • ఎర్లీ క్లినికల్‌ ఎక్స్‌పోజర్‌
  • బోధనను ప్రాక్టికల్‌గా అనుసంధానం.
  • ఫ్యామిలీ మెడిసిన్‌ సిద్ధాంతాలపై సమగ్ర అవగాహన.
  • కాంపిటెన్సీ బేస్డ్‌ లెర్నింగ్‌.
  • స్వీయ నిర్దేశిత అభ్యసన నైపుణ్యం.
  • నైతిక విలువలు, వ్యక్తిగత దృక్పథం, వృత్తి నైపుణ్యాలను సమీకృతం చేసుకునే నైపుణ్యం.

ఎంబీబీఎస్‌లో కొత్త కరిక్యులం ప్రధాన ఉద్దేశాలు..

  • క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్‌
  • కెపాసిటీ బిల్డింగ్‌ 
  • ఇన్సెంటివ్స్‌ 

ఆహ్వానించదగ్గ పరిణామం

1997 తర్వాత అంటే 20 ఏళ్ల తర్వాత ఎంబీబీఎస్‌ సిలబస్‌లో మార్పుల దిశగా అడుగులు వేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ సిలబస్‌లో పేర్కొన్న ప్రాక్టికల్‌ అప్రోచ్‌ అంశాల కోణంలో బోధనాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు పెంచేలా కృషిచేస్తే కొత్త కరిక్యులంతో విద్యార్థులకు మరింత మేలు జరుగుతుంది. ఫౌండేషన్‌ కోర్సు బోధించాలనే ఉద్దేశం వల్ల విద్యార్థులకు వైద్య విద్య గురించి తెలియడమేకాకుండా.. సామాజిక ఆరోగ్య పరిస్థితులపైనా అవగాహన ఏర్పడి.. భవిష్యత్తులో వారు సేవా దృక్పథంతో, నైతిక విలువలు పాటించేలా వ్యవహరించగలుగుతారు. – డాక్టర్‌ శ్రీనాథ్‌ రెడ్డి, ప్రెసిడెంట్, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement