లక్షకు చేరువలో రిజిస్టర్డ్ వైద్యులు
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో రిజిస్టర్డ్ డాక్టర్ల సంఖ్య లక్షకు చేరువవుతోంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్‌లో పేర్లు నమోదు చేసుకున్న వైద్యుల సంఖ్య ఆధారంగా ఇప్పటివరకూ 90 వేలకు చేరింది. మరో ఏడాదిలోనే ఆ సంఖ్య లక్షకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ ఉమ్మడిగానే ఉంది. కొద్ది రోజుల్లోనే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు కానుంది. ప్రస్తుతం రిజిస్టర్ చేసుకున్న వైద్యుల్లో 60 వేల మంది ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారుండగా.. 30 వేల మంది పీజీ పూర్తి చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏటా 6 వేల మంది ఎంబీబీఎస్ పట్టాలు తీసుకుంటున్నారు.
వెయ్యి మంది పీజీ పట్టాలు అందుకుంటున్నారు. రిజిస్టర్ వైద్యులు లక్షకు చేరువవుతున్నా.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో దాదాపు 15 వేల మంది వైద్యులు పనిచేయాల్సి ఉంటే ప్రస్తుతం 7 వేల మంది మాత్రమే ఉన్నారు. గత కొన్నేళ్లుగా నియామకాలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి అని చెబుతున్నారు.
ఎంబీబీఎస్‌తో ఉద్యోగాలు లేవు..
ఉభయరాష్ట్రాల్లో పీజీ సీట్లు తక్కువగా ఉండటం వల్ల ఎంబీబీఎస్ చేసిన అందరికీ పీజీ పూర్తి చేయడం సాధ్యం కావడం లేదు. కేవలం ఎంబీబీఎస్‌తో అటు ప్రభుత్వంలోనూ ఇటు ప్రైవేటులోనూ ఉద్యోగావకాశాలు ఉండటంలేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారు 15 వేల మందికి పైగా ఎంబీబీఎస్ నిరుద్యోగులున్నట్టు అంచనా. ఎంసీఐలో ప్రతి ఐదేళ్లకోసారి రెన్యువల్‌కు వస్తున్న వివరాల ప్రకారం సుమారు 20 వేల మంది వైద్యులు విదేశాల్లో స్థిరపడినట్టు అంచనా.
వీళ్లలో మెజారిటీ వైద్యులు పీజీ పూర్తి చేసిన వారే. అయితే ఇటీవల కాలంలో విదేశాలకు వెళ్లడం కొంచెం తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశీయంగానే కార్పొరేట్ ఆస్పత్రులు పెరగడం, పీజీ వైద్యులకు అవకాశాలు వస్తుండటంతో ఇక్కడే స్థిరపడుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఎంబీబీఎస్ చదివిన వారి పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. ఎంబీబీఎస్ పూర్తిచేసి కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరితే నైట్ డ్యూటీ డాక్టర్లుగా వేస్తున్నారు. సొంతంగా క్లినిక్‌లు పెట్టాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో పాటు.. ఇప్పుడు మండల కేంద్రాల్లో కూడా స్పెషాలిటీ డాక్టర్లు క్లినిక్‌లు తెరుస్తున్నారు. దీంతో ఎంబీబీఎస్‌ల పరిస్థితి ఘోరంగా ఉంది.
అయినా... తక్కువే
మెడికల్ కౌన్సిల్‌లో వైద్యుల నమోదు గణనీయంగా ఉన్నా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో) నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక డాక్టరు ఉండాలి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 5 వేల మందికి కూడా ఒక డాక్టరు ఉండటంలేదు. పీజీ చేసిన వైద్యులు ఓ స్థాయి పట్టణ ప్రాంతాలకే పరిమితం కావడం, ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడానికి మొగ్గుచూపకపోవడం దీనికి కారణంగా విశ్లేషిస్తున్నారు.