
ఏబీకేకు పురస్కారాన్ని అందజేస్తున్న దేవులపల్లి అమర్, రామచంద్రమూర్తి
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: సీనియర్ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్‌కు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవన సాఫల్య పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ ప్రదానం చేశారు. ఏబీకేను శాలువాతో సత్కరించి రూ.10 లక్షల చెక్కు, వైఎస్సార్ జ్ఞాపికను అందజేశారు. శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్‌లో పురస్కార ప్రదాన కార్యక్రమం జరిగింది.
గత నవంబర్ 1న విజయవాడలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన డాక్టర్ వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం ప్రదాన కార్యక్రమానికి అనివార్య కారణాల వల్ల ఏబీకే హాజరుకాలేకపోయారు. అయినప్పటికీ ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీచేసి తనకు ఈ పురస్కారాన్ని అందజేయడంపట్ల ఏబీకే సంతోషం వ్యక్తం చేశారు. ఇది పత్రికారంగంలో పనిచేసిన, చేస్తున్న తన సహచరులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.
ఈ పురస్కారం తన చేతుల మీదుగా ఏబీకేకు అందించడం అదృష్టంగా భావిస్తున్నట్టు అమర్ అన్నారు. ఆయన కాలమ్స్ పాఠకులను ఆలోచింపజేస్తున్నాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు రామచంద్రమూర్తి, మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు, విశాలాంధ్ర సంపాదకుడు ఆర్వీ రామారావు, చరిత్ర పరిశోధకుడు శివనాగిరెడ్డి, పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment