మానవ తప్పిదాలతోనే పెను విపత్తులు
కొంప ముంచుతున్న పర్యావరణ మార్పులు
తీవ్ర వర్షాభావం, ఎండిపోయిన అడవులు
లాస్ ఏంజెలెస్‌లో మంటలకు అవే కారణం
లాస్ ఏంజెలెస్‌కు కార్చిచ్చుకు కారణం ఏమిటన్నది చర్చనీయంగా మారింది. ఇలాంటి విపత్తులకు ప్రకృతి కంటే మానవ తప్పిదాలే ఎక్కువగా కారణమవుతుంటాయి. అడవుల్లో సాధారణంగా పిడుగుపాటు వల్ల కార్చిచ్చులు రగులుతుంటాయి. కరెంటు స్తంభాలు నేలకొరిగినప్పుడు చెలరేగే మంటలూ కార్చిచ్చుగా మారుతుంటాయి. ఇవిగాక మనుషుల నిర్లక్ష్యం కూడా ఈ ఉత్పాతానికి దారితీస్తుంటుంది. కాల్చిపడేసిన సిగరెట్ సైతం పెనువిపత్తుగా మారొచ్చు.
తాజాగా లాస్ ఏంజెలెస్‌ను బుగ్గిపాలు చేస్తున్న కార్చిచ్చు సైంటిస్టులనే నిర్ఘాంతపరుస్తోంది. మంటలు ఇంత వేగంగా వ్యాప్తించడం మునుపెప్పుడూ చూడలేదని అగ్నిమాపక అధికారులు అంటున్నారు. వాతావరణ పరిస్థితులూ ఇందుకు దోహదం చేశాయని చెబుతున్నారు. లాస్ ఏంజెలెస్‌లో చాలా రోజులుగా వానలే లేవు. దాంతో చెట్లు చేమలతోపాటు కొండల దిగువ ప్రాంతాల్లో గడ్డి పూర్తిగా ఎండిపోయింది. కనుకనే మంటలు సులభంగా అంటుకుని వ్యాపించాయి.
బలమైన ఈదురు గాలులతో పరిస్థితి మరింత విషమించింది. ఏటా ఇదే సీజన్‌లో ‘శాంటా అనా’ గాలులు వీస్తుంటాయి. వీటి వేగం గంటకు 129 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అగ్నికి ఆజ్యంలా కార్చిచ్చుకు ఈ గాలులు జతకలిశాయి. వాటి ధాటికి విమానాలు, హెలికాప్టర్లు ఎగిరే పరిస్థితి లేకపోవడంతో ఆకాశం నుంచి నీరు, అగ్నిమాపక రసాయనాలు చల్లే వీల్లేకుండాపోయింది. దాంతో మంటలను అదుపులోకి తేవడం మరింత కష్టసాధ్యంగా మారింది.
మానవ తప్పిదాలతో భారీ మూల్యం
లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు వంటివాటి రూపంలో వాతావరణ మార్పుల దు్రష్పభావాన్ని స్పష్టంగా చూస్తున్నామని నిపుణులు చెబుతున్నారు. ‘‘మానవ తప్పిదాల వల్ల మున్ముందు ఇలాంటి విపత్తుల ముప్పు మరింత పెరుగుతుంది. అవి వ్యాప్తి చెందే వేగమూ పెరుగుతుంది’’ అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టకపోతే ప్రకృతి విపత్తులు మరింతగా విరుచుకుపడడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
‘‘కార్చిచ్చు అమెరికాకు పరిమితమైంది. కాదు. నేడు ప్రపంచమంతా ఈ ముప్పు ముంగిట ఉంది’’ అని తేల్చిచెబుతున్నారు. చిన్న మంటగా మొదలయ్యే కార్చిచ్చులు క్షణాల్లోనే విస్తరించి నియంత్రించలేని స్థాయికి చేరుకుంటాయి. మానవ కార్యకలాపాల పుణ్యమా అని విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పరిస్థితిని మరింతగా దిగజారుస్తున్నాయి.
→ లాస్ ఏంజెలెస్‌లో 2022, 2023లో వరుసగా రెండేళ్లు భారీగా వర్షాలు కురిశాయి. ఏకంగా 133 సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో చెట్లు బాగా పెరిగాయి. పచ్చదనం పరుచుకుంది. 2024లో పరిస్థితి ఒక్క సారిగా తారుమారైంది. వర్షాల్లేక కరువు తాండవించింది. చెట్లు ఎండిపోయాయి. దక్షిణ కాలిఫోర్నియా మొత్తం కరువు ఛాయలే! కార్చిచ్చు ఊహాతీత వేగంతో వ్యాపించడానికి ఇదే ప్రధాన కారణమని సైంటిస్టు మాట్ జోన్స్ విశ్లేషించారు.
→ కాలిఫోరి్నయా వంటి నగరాల్లో జనాభా అధికం. ప్రకృతి విపత్తులు పొంచి ఉన్న ఇ లాంటి నగరాల్లో నివసించడం క్షేమమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
→ ఇటీవలి కాలంలో బీమా సంస్థలు కూడా అప్రమత్తమయ్యాయి. లాస్ ఏంజెలెస్, పరిసర నివాసాలకు బీమా రక్షణ కలి్పంచేందుకు కొంతకాలంగా నిరాకరిస్తూ వస్తున్నాయి. ప్రమాదాలు జరిగితే భారీ మొత్తంలో బీమా సొమ్ము చెల్లించాల్సి ఉండటమే ఇందుకు కారణం.
→ లాస్‌ఏంజెలెస్‌లో ధ్వంసమైన ఇళ్ల స్థానంలో కొత్తవి నిర్మించబోతున్నారు. అందుకు ప్రభుత్వం సాయం అందించబోతోంది. కార్చిచ్చులను దృష్టిలో పెట్టుకొని వాటి నిర్మాణంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment