లాస్ ఏంజెలెస్‌లో ఆరని అగ్ని కీలలు
కొనసాగుతున్న కార్చిచ్చు..
16కు చేరిన మృతుల సంఖ్య
రూ.12.92 లక్షల కోట్లకుపైగా ఆస్తి నష్టం
అదృశ్యమైన వారి కోసం అధికారుల గాలింపు చర్యలు
లాస్ ఏంజెలెస్: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో రగిలిన కార్చిచ్చు ఇళ్లు, చెట్లు, పుట్టలను కబళిస్తూ విలయతాండవం చేస్తోంది. అత్యంత ఖరీదైన గృహాలు బూడిద కుప్పలుగా మారిపోతున్నాయి. మనుషులతోపాటు పక్షులు, జంతువులు మంటల్లో పడి కాలిపోతున్నాయి. కార్చిచ్చులో మృతుల సంఖ్య 16కు చేరుకున్నట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. ఈటాన్ ఫైర్‌లో 11 మంది, పసిఫిక్ పాలిసేడ్స్ ఫైర్‌లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.
అగ్నికీలలు ఇప్పటికిప్పుడు ఆరిపోయే పరిస్థితి లేకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. కార్చిచ్చు మొదలైన తర్వాత కొందరు కనిపించకుండాపోయారు. వారి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. బూడిద కుప్పల్లో అన్వేషిస్తున్నారు. ఇందుకోసం జాగిలాల సాయం తీసుకుంటున్నారు. మరోవైపు అదృశ్యమైన తమవారి కోసం బాధితులు అధికారులను సంప్రదిస్తున్నారు.
అధికారులు పాసాడెనాలో ఫ్యామిలీ అసిస్టెన్స్ సెంటర్ ఏర్పాటు చేశారు. కార్చిచ్చును అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నప్పటికీ మంటలు మరికొన్ని ప్రాంతాలకు వ్యాపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. జె.పాల్ గెట్టీ మ్యూజియం, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వరకూ మంటలు చొచ్చుకొస్తున్నాయి. మంటలకు బలమైన ఈదురుగాలులు తోడవుతుండడంతో పరిస్థితి నియంత్రణలోకి రావడం లేదని అధికారులు చెప్పారు.
ఆర్నాల్డ్ స్వార్జినెగ్గర్‌తోపాటు హాలీవుడ్ ప్రముఖులు నివాసం ఉండే మాండివిల్లే కాన్యాన్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలపై హెలికాప్టర్లతో నీటిని చల్లుతున్నారు. దట్టమైన పొగ అలుముకోవడం సహాయక చర్యలకు ఆటంకంగా మారుతోంది. అధిక జనాభాతో కిక్కిరిసి ఉండే హలీవుడ్ హిల్స్, శాన్ ఫెర్నాండో వ్యాలీ వైపు మంటలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
12 వేలకుపైగా ఇళ్లు దగ్ధం
లాస్ ఏంజెలెస్‌లో 145 చదరపు కిలోమీటర్ల భూభాగం కార్చిచ్చు ప్రభావానికి గురయ్యింది. ఇది శాన్ ఫ్రాన్సిస్కో నగర విస్తీర్ణం కంటే అధికం. కార్చిచ్చు మంగళవారం తొలుత లాస్‌ఏంజెలెస్ ఉత్తర డౌన్‌టౌన్‌లో మొదలైంది. క్రమంగా విస్తరించింది. మరో నాలుగు చోట్ల కార్చిచ్చులు రగిలాయి. ఇప్పటిదాకా 12 వేలకుపైగా ఇళ్లు మంటల్లో కాలిపోయి బూడిదగా మారాయి. విలాసవంతమైన గృహాలు, అపార్టుమెంట్ భవనాలు, వ్యాపార కేంద్రాలు నామరూపాల్లేకుండా పోయాయి.
వాటిలో విలువైన వస్తువులు, గృహోపకరణాలు అగ్నికీలల్లో మాడిపోయాయి. కార్చిచ్చుకు కచి్చతమైన కారణం ఏమిటన్నది ఇంకా ధ్రువీకరించలేదు. మొత్తానికి ఇది కనీవిని ఎరుగని భారీ నష్టమేనని చెప్పొచ్చు. ఇప్పటిదాకా 150 బిలియన్ డాలర్ల (రూ.12.92 లక్షల కోట్లు) మేర నష్టం వాటిలినట్లు అక్యూవెదర్ అనే ప్రైవేట్ సంస్థ అంచనా వేసింది.
బాధితుల కోసం షెల్టర్లు
వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ 1.50 లక్షల మందికి ఆదేశాలు జారీ చేశారు. నిరాశ్రయుల కోసం తొమ్మిది షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ 700 మందికిపైగా బాధితులు ఆశ్రయం పొందుతున్నారు. 1,354 ఫైర్ ఇంజన్లు, 84 హెలికాప్టర్లు నిర్విరామంగా పని చేస్తున్నారు. 14,000 వేల మంది అగ్నిమాపక సిబ్బంది విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు. మంటలు ఆర్పడానికి శ్రమిస్తున్నారు.
అందని నీళ్లు, నిధులు
కార్చిచ్చు నష్టపోయినవారిని అదుకోవడానికి మానవతావాదులు ముందుకొస్తున్నారు. డొనేషన్ కేంద్రాల్లో విరాళాలు అందజేస్తుందన్నారు. బాధితులకు కొందరు దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు. ఆహారం సైతం అందిస్తున్నారు. దగ్ధమైన తమ ఇళ్లను చూసుకోవడానికి బాధితులు వస్తున్నారు. సర్వం కోల్పోయామంటూ బోరున విలపిస్తున్నారు. అయితే, కాలిపోయిన ఇళ్ల వద్దకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
శిథిలాల నుంచి ప్రమాదకరమైన వాయువులు వెలువడుతున్నాయని, అవి పీల్చడం ప్రాణాంతకమని చెబుతున్నారు. మరోవైపు మంటలు ఆర్పడానికి చాలినంత నీరు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. కొందరు సంపన్నులు విచ్చలవిడిగా నీరు వాడేశారని, అందుకే ఈ దుస్థితి ఏర్పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 440 మిలి యన్ లీటర్ల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ ఖాళీ అయ్యింది. అగ్నిమాపక శాఖకు తగినన్ని నిధులు కూడా అందడం లేదని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంటలు ఎలా ఆర్పాలని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment