Houses burnt
-
మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్న మంటలు
లాస్ ఏంజెలెస్: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో రగిలిన కార్చిచ్చు ఇళ్లు, చెట్లు, పుట్టలను కబళిస్తూ విలయతాండవం చేస్తోంది. అత్యంత ఖరీదైన గృహాలు బూడిద కుప్పలుగా మారిపోతున్నాయి. మనుషులతోపాటు పక్షులు, జంతువులు మంటల్లో పడి కాలిపోతున్నాయి. కార్చిచ్చులో మృతుల సంఖ్య 16కు చేరుకున్నట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. ఈటాన్ ఫైర్‌లో 11 మంది, పసిఫిక్ పాలిసేడ్స్ ఫైర్‌లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అగ్నికీలలు ఇప్పటికిప్పుడు ఆరిపోయే పరిస్థితి లేకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. కార్చిచ్చు మొదలైన తర్వాత కొందరు కనిపించకుండాపోయారు. వారి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. బూడిద కుప్పల్లో అన్వేషిస్తున్నారు. ఇందుకోసం జాగిలాల సాయం తీసుకుంటున్నారు. మరోవైపు అదృశ్యమైన తమవారి కోసం బాధితులు అధికారులను సంప్రదిస్తున్నారు. అధికారులు పాసాడెనాలో ఫ్యామిలీ అసిస్టెన్స్ సెంటర్ ఏర్పాటు చేశారు. కార్చిచ్చును అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నప్పటికీ మంటలు మరికొన్ని ప్రాంతాలకు వ్యాపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. జె.పాల్ గెట్టీ మ్యూజియం, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వరకూ మంటలు చొచ్చుకొస్తున్నాయి. మంటలకు బలమైన ఈదురుగాలులు తోడవుతుండడంతో పరిస్థితి నియంత్రణలోకి రావడం లేదని అధికారులు చెప్పారు. ఆర్నాల్డ్ స్వార్జినెగ్గర్తోపాటు హాలీవుడ్ ప్రముఖులు నివాసం ఉండే మాండివిల్లే కాన్యాన్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలపై హెలికాప్టర్లతో నీటిని చల్లుతున్నారు. దట్టమైన పొగ అలుముకోవడం సహాయక చర్యలకు ఆటంకంగా మారుతోంది. అధిక జనాభాతో కిక్కిరిసి ఉండే హలీవుడ్ హిల్స్, శాన్ ఫెర్నాండో వ్యాలీ వైపు మంటలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 12 వేలకుపైగా ఇళ్లు దగ్ధం లాస్ ఏంజెలెస్‌లో 145 చదరపు కిలోమీటర్ల భూభాగం కార్చిచ్చు ప్రభావానికి గురయ్యింది. ఇది శాన్ ఫ్రాన్సిస్కో నగర విస్తీర్ణం కంటే అధికం. కార్చిచ్చు మంగళవారం తొలుత లాస్ఏంజెలెస్ ఉత్తర డౌన్టౌన్లో మొదలైంది. క్రమంగా విస్తరించింది. మరో నాలుగు చోట్ల కార్చిచ్చులు రగిలాయి. ఇప్పటిదాకా 12 వేలకుపైగా ఇళ్లు మంటల్లో కాలిపోయి బూడిదగా మారాయి. విలాసవంతమైన గృహాలు, అపార్టుమెంట్ భవనాలు, వ్యాపార కేంద్రాలు నామరూపాల్లేకుండా పోయాయి. వాటిలో విలువైన వస్తువులు, గృహోపకరణాలు అగ్నికీలల్లో మాడిపోయాయి. కార్చిచ్చుకు కచి్చతమైన కారణం ఏమిటన్నది ఇంకా ధ్రువీకరించలేదు. మొత్తానికి ఇది కనీవిని ఎరుగని భారీ నష్టమేనని చెప్పొచ్చు. ఇప్పటిదాకా 150 బిలియన్ డాలర్ల (రూ.12.92 లక్షల కోట్లు) మేర నష్టం వాటిలినట్లు అక్యూవెదర్ అనే ప్రైవేట్ సంస్థ అంచనా వేసింది. బాధితుల కోసం షెల్టర్లు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ 1.50 లక్షల మందికి ఆదేశాలు జారీ చేశారు. నిరాశ్రయుల కోసం తొమ్మిది షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ 700 మందికిపైగా బాధితులు ఆశ్రయం పొందుతున్నారు. 1,354 ఫైర్ ఇంజన్లు, 84 హెలికాప్టర్లు నిర్విరామంగా పని చేస్తున్నారు. 14,000 వేల మంది అగ్నిమాపక సిబ్బంది విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు. మంటలు ఆర్పడానికి శ్రమిస్తున్నారు.అందని నీళ్లు, నిధులు కార్చిచ్చు నష్టపోయినవారిని అదుకోవడానికి మానవతావాదులు ముందుకొస్తున్నారు. డొనేషన్ కేంద్రాల్లో విరాళాలు అందజేస్తుందన్నారు. బాధితులకు కొందరు దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు. ఆహారం సైతం అందిస్తున్నారు. దగ్ధమైన తమ ఇళ్లను చూసుకోవడానికి బాధితులు వస్తున్నారు. సర్వం కోల్పోయామంటూ బోరున విలపిస్తున్నారు. అయితే, కాలిపోయిన ఇళ్ల వద్దకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. శిథిలాల నుంచి ప్రమాదకరమైన వాయువులు వెలువడుతున్నాయని, అవి పీల్చడం ప్రాణాంతకమని చెబుతున్నారు. మరోవైపు మంటలు ఆర్పడానికి చాలినంత నీరు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. కొందరు సంపన్నులు విచ్చలవిడిగా నీరు వాడేశారని, అందుకే ఈ దుస్థితి ఏర్పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 440 మిలి యన్ లీటర్ల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ ఖాళీ అయ్యింది. అగ్నిమాపక శాఖకు తగినన్ని నిధులు కూడా అందడం లేదని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంటలు ఎలా ఆర్పాలని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. -
బతుకు బుగ్గిపాలు.. మనుమరాలు పెళ్లి కోసం..
సాక్షి, ప్రత్తిపాడు(తూర్పుగోదావది) : మండలంలోని పెద్దిపాలెం గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వెనుక బుధవారం సంభవించిన అగ్ని ప్రమాదంలో ఐదు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధితులు కూలి పనులకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో వారంతా రోడ్డున పడ్డారు. ఈ ప్రమాదంలో పడాల అప్పలరాజు, తాతపూడి రత్నం, తాతపూడి అమ్మాజీ, కేశనకుర్తి రాంబాబు, చిప్పల రాజులకు చెందిన ఇళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఒకరి ఇంట్లో కట్టెల పొయ్యి నుంచి నిప్పురవ్వలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.ఐదు లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. స్థానికుల చొరవతో తప్పిన పెను ప్రమాదం గ్రామంలో తాతపూడి అమ్మాజీ ఇంటికి నిప్పు అంటుకొన్న వెంటనే స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగారు. అప్పటికే ఆ ఇంటికి పక్కనే ఉన్న మరో నాలుగు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిప్రమాదం కారణంగా విద్యుత్ సరఫరా నిలిపి వేయడంతో అందుబాటులో నీరులేక మంటలను అదుపు చేయడం కష్టమైంది. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న భారీ వృక్షాలు మంటలు వ్యాప్తి చెందకుండా సహకరించాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకొన్న ప్రత్తిపాడు అగ్నిమాపక అధికారి కె.ఉమామహేశ్వరావు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. రోడ్డున పడ్డ కుటుంబాలు అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోవడంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కాయకష్టం చేసుకొని దాచుకొన్నదంతా బూడిద కావడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తిండి గింజలు, బట్టలు, నగదు, బంగారు, ఎలక్ట్రికల్ వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. రెండు రోజుల్లో మనవరాలు పెళ్లి కోసం అని దాచిన సొమ్ములు దగ్ధమయ్యాయి. తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
మావోయిస్టుల బీభత్సం: మూడిళ్లు పేల్చివేత
-
గ్రామం భస్మీపటలం
గూడూరు మండలం నాగవరంలో ఘోర అగ్నిప్రమాదం 42 ఇళ్లు, 25 పశువుల పాకలు దగ్ధం రూ.2 కోట్లకు పైగా నష్టం 56 కుటుంబాలు నిరాశ్రయం పెళ్లింట విషాదం అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఊరంతా వ్యాపించాయి. గంటల వ్యవధిలో 42 ఇళ్లు బుగ్గిపాలయ్యాయి. మరో 25 పశువుల పాకలు దగ్ధమయ్యాయి. రూ.2 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. మొత్తం 56 కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి. కళ్లముందే సర్వస్వం కోల్పోవడంతో బాధితులంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బుధవారం రాత్రి గ్రామానికి చెందిన వ్యక్తి కుమార్తె వివాహం తిరుపతిలో జరగాల్సి ఉండగా పెళ్లి ఏర్పాట్లలో కుటుంబసభ్యులు నిమగ్నమై ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. పెళ్లిపందిరి సహా గృహం కూడా కాలిబూడిదైంది. వివాహం కోసం సిద్ధంగా ఉంచిన నగదు, బంగారం, పెళ్లి సామగ్రి బుగ్గిపాలయ్యాయి. గూడూరు మండలం ముక్కొల్లు శివారు నాగవరంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా గ్రామం మొత్తాన్ని మంటలు చుట్టుముట్టడంతో పాటు వడగాలులు తోడవ్వటంతో 42 గృహాల్లోని 56 కుటుంబాల వారు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. కష్టపడి పండించిన ధాన్యం, మినుములు కాలిబూడిదయ్యాయి. దాచుకున్న నగదు, బంగారువస్తువులు, గృహోపకరణాలు మంటల్లో చిక్కుకుని కాలిబూడిదయ్యాయి. ఉపాధి పనులు చేస్తున్న కూలీలు, పశువులను మేపేందుకు వెళ్లిన వారు ప్రమాద సంఘటనను తెలుసుకుని గ్రామంలోకి వచ్చేసరికే మంటలు ఊరంతా వ్యాపించాయి. వేసవి కావటంతో గ్రామం చుట్టుపక్కల ఎక్కడా నీరు లభ్యం కాకపోవటంతో మంటలను అదుపు చేయటం కష్టమైంది. గుడ్లవల్లేరు, మచిలీపట్నం, గుడివాడ, పామర్రుల నుంచి వచ్చిన ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. 10.30 గంటలకు ప్రమాదం: మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో నాగవరం గ్రామానికి చెందిన బాడిగ వీరప్రసాద్‌కు చెందిన వరి గడ్డివామికి నిప్పు అంటుకుంది. ముందుగా వీరప్రసాద్‌కు చెందిన గృహం, పశువులపాకకు నిప్పు అంటుకుంది. అక్కడి నుంచి మంటలు గ్రామమంతా వ్యాపించాయి.ఒక్కసారిగా గ్రామం మొత్తం మంటలు వ్యాపించటంతో అక్కడి వారంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. మంటలు గ్రామమంతా వ్యాపించడంతో కొందరు యువకులు గృహాల్లోని గ్యాస్ సిలిండర్లను రోడ్డు పైకి విసిరేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. వివాహ పనుల్లో నిమగ్నమై ఉండగా ... గ్రామానికి చెందిన బాడిగ మహంకాళిరావు తన కుమార్తె రజనీ వివాహం బుధవారం రాత్రి తిరుపతిలో జరుగనుంది. ఈ నేపథ్యంలో ఈ కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. పెళ్లికి ఇవ్వాల్సిన కట్నకానుకలు, బంగారు నగలు, భోజనాలకు కావాల్సిన నిత్యావసర సరుకలు సిద్ధంగా ఉంచుకున్నారు. ఊహించని విధంగా గ్రామంలో మంటలు చెలరేగటంతో మహంకాళరావు ఇంటి ముందు వేసిన పెళ్లి పందిరితో సహా గృహం కాలిబూడిదైంది. వివాహం కోసం సిద్ధంగా ఉంచుకున్న రూ. 1.50 లక్షల నగదు, ఐదు నవర్సుల బంగారం, పెళ్లి సామానులు కాలిబూడిదయ్యాయి. దీంతో ఈ కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో మిగిలారు. సహాయ చర్యల్లో నిమగ్నమైన అధికారులు : నాగవరం గ్రామంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం సంఘటనలో బాధితులను ఆదుకునేందుకు రెవెన్యూ, పోలీసు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బందరు ఆర్డీవో పి సాయిబాబు, గూడూరు తహశీల్దార్ బీఎల్ఎన్.రాజకుమారి, గుడివాడ డీఎస్పీ నాగన్న, బందరు రూరల్ సీఐ వీవీఎస్ఎన్ మూర్తి, పలువురు ఎస్సైలు గ్రామానికి వచ్చి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. సర్వస్వం కోల్పోయిన బాధితులు కోరుకున్న చోట పునరావాస శిబిరం ఏర్పాటు చేసి సహాయక చర్యలు వేగవంతం చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.ప్రమాదంలో నష్టం అంచనాలను తయారు చేస్తున్నామని సుమారు రెండు కోట్ల రూపాయల వరకు నష్టం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. గ్రామంలో ఉద్రిక్తత : నాగవరం గ్రామంలో ఉన్న ఊరచెరువుల ఫలసాయం పొందే విషయంలో రెండు సామాజికవర్గాల నడుమ కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత నెలన్నర వ్యవధిలో ఐదు వరి గడ్డివామిలు దగ్ధమయ్యాయి. కొంత మంది కావాలనే వరిగడ్డి వామిలను దగ్ధం చేశారనే కారణంతో పోలీసుల కేసు వరకు వెళ్లింది. బందరు రూరల్ సీఐ మూర్తి, గూడూరు ఎస్సై ఎ ఫణిమోహన్, రెవెన్యూ అధికారులు ఇరువర్గాలను పిలిపించి గ్రామంలో ఎలాంటి అలజడులు రేగకుండా సామరస్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పాటు చేసిన 15 రోజుల వ్యవధిలోనే గ్రామంలోని గృహాలకు నిప్పు అంటుకోవటం వివాదాస్పదమైంది. ఓ వైపు గృహాలు అగ్నిప్రమాదంలో తగలబడుతుంటే మరో వైపు రెండు వర్గాలు ఈ సంఘటనకు మీరంటే మీరు కారణమంటూ పోలీసులు, అధికారుల ఎదుటే వాగ్వాదానికి దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొని పరిస్థితి చేయదాటే స్థితికి వచ్చింది. గుడివాడ డీఎస్పీ నాగన్న, బందరు రూరల్ సీఐ మూర్తి గ్రామస్తులకు సర్ధిచెప్పారు. ఇరువర్గాలకు చెందిన కొంత మందిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టండి : ఎమ్మెల్యే కాగిత గూడూరు : గూడూరు మండలం నాగవరం గ్రామంలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో బాధితులకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు అందించాలని పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అధికారులను ఆదేశించారు. అస్వస్తత కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మెల్యే ఫోన్లో బందరు ఆర్డీవో సాయిబాబు, గూడూరు తహశీల్దార్ బీఎల్ఎన్.రాజకుమారిలతో మాట్లాడి సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహించకుండా అన్ని విధాల పునరావాస చర్యలు చేపట్టాలని కోరారు. పలువురి పరామర్శ : నాగవరం గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదం బాధితులను పలువురు నాయకులు పరామర్శించారు. మాజీ జెడ్పీటీసీ సభ్యులు బూరగడ్డ శ్రీకుమార్, లేళ్లగరువు పీఏసీఎస్ అధ్యక్షులు గుడివాడ సుబ్రహ్మణ్యేశ్వరరావు, గ్రామసర్పంచి సమ్మెట ఈశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షులు పోతన స్వామి, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గోపీ నాగబాబు, రామరాజుపాలెం ఎంపీటీసీ సభ్యులు కాసగాని శ్రీను తదితరులు బాధితులను పరామర్శించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.