పెద్దిపాలెంలో అగ్నికి ఆహుతవుతున్న పూరిల్లు
సాక్షి, ప్రత్తిపాడు(తూర్పుగోదావది) : మండలంలోని పెద్దిపాలెం గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వెనుక బుధవారం సంభవించిన అగ్ని ప్రమాదంలో ఐదు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధితులు కూలి పనులకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో వారంతా రోడ్డున పడ్డారు. ఈ ప్రమాదంలో పడాల అప్పలరాజు, తాతపూడి రత్నం, తాతపూడి అమ్మాజీ, కేశనకుర్తి రాంబాబు, చిప్పల రాజులకు చెందిన ఇళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఒకరి ఇంట్లో కట్టెల పొయ్యి నుంచి నిప్పురవ్వలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.ఐదు లక్షల ఆస్తినష్టం వాటిల్లింది.
స్థానికుల చొరవతో తప్పిన పెను ప్రమాదం
గ్రామంలో తాతపూడి అమ్మాజీ ఇంటికి నిప్పు అంటుకొన్న వెంటనే స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగారు. అప్పటికే ఆ ఇంటికి పక్కనే ఉన్న మరో నాలుగు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిప్రమాదం కారణంగా విద్యుత్ సరఫరా నిలిపి వేయడంతో అందుబాటులో నీరులేక మంటలను అదుపు చేయడం కష్టమైంది. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న భారీ వృక్షాలు మంటలు వ్యాప్తి చెందకుండా సహకరించాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకొన్న ప్రత్తిపాడు అగ్నిమాపక అధికారి కె.ఉమామహేశ్వరావు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
రోడ్డున పడ్డ కుటుంబాలు
అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోవడంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కాయకష్టం చేసుకొని దాచుకొన్నదంతా బూడిద కావడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తిండి గింజలు, బట్టలు, నగదు, బంగారు, ఎలక్ట్రికల్ వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. రెండు రోజుల్లో మనవరాలు పెళ్లి కోసం అని దాచిన సొమ్ములు దగ్ధమయ్యాయి. తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment