రాజధాని బెజవాడేనా!? | vijayawada is best location for state capital | Sakshi
Sakshi News home page

రాజధాని బెజవాడేనా!?

Published Wed, May 14 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 AM

రాజధాని బెజవాడేనా!?

రాజధాని బెజవాడేనా!?

విజయవాడలో పర్యటించిన సందర్భంగా జిల్లా మ్యాప్‌ను పరిశీలిస్తున్న రాజధాని కమిటీ సభ్యులు రతన్‌రాయ్, జగన్‌షా, రవీంద్రన్. చిత్రంలో కలెక్టర్ రఘునందన్‌రావు తదితరులు.
 
 సాక్షి, విజయవాడ : నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి తమ ప్రాంతం అనువుగా ఉందంటే.. తమ ప్రాంతం అనువుగా ఉందంటూ దాదాపు అన్ని జిల్లాలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ఆయా జిల్లాల్లోని భూములు, నీటివనరులు, ప్రత్యేకతలు.. ఇలా ప్రతి అంశమూ తెరపైకి వస్తోంది. కలెక్టర్ మొదలుకొని తహశీల్దార్ వరకు అందరూ తమ జిల్లాలోని ప్రాంతాలు అనువుగా ఉన్నాయని శివరామకృష్ణన్ కమిటీకి నివేదికలు అందజేస్తున్నారు.

వీరితోపాటు ప్రతి జిల్లాలోనూ ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, వివిధ సామాజిక సేవాసంఘాలు పెద్దఎత్తున వినతిపత్రాలు అందించాయి. బెజవాడను రాజధాని చేయాలంటూ కొందరు, విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటుచేయాలని మరికొందరు తమ ప్రతిపాదనలను ఇటీవల జిల్లాకు వచ్చిన శివరామకృష్ణన్ కమిటీ ముందుంచారు. కలెక్టర్ రఘునందన్‌రావు, విజయవాడ నగర పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు, ఉడా వీసీ పి.ఉషాకుమారి, మున్సిపల్ కమిషనర్ హరికిరణ్ తదితరులు ఆయా శాఖల వివరాలను కమిటీకి అందజేసి విజయవాడ రాజధాని ఏర్పాటుకు అనువుగా ఉంటుందని నివేదిక ఇచ్చారు.
   
 బెజవాడపై కమిటీ సంతృప్తి..
 సీమాంధ్ర జిల్లాల్లో విజయవాడ రెండో అతి పెద్ద నగరం. వాణిజ్యపరంగానూ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. శివరామకృష్ణన్ కమిటీ ఆదివారం జిల్లాలో పర్యటించింది. జిల్లాకు రాకముందు విశాఖపట్నం, రాజమండ్రి ప్రాంతాల్లో పర్యటించింది.  విశాఖ అనుకూలంగా ఉన్నప్పటికీ నౌకాదళం అక్కడ ఉండడంతో అనువు కాదని ప్రాథమికంగా నిర్థారించినట్లు సమాచారం.
 
 రాజమండ్రి కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ 13 జిల్లాలకు కేంద్రబిందువు కాకపోవడంతో అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో విజయవాడలో పర్యటించిన కమిటీ జిల్లాలోని వనరులు, ఇతర అంశాలపై సంతృప్తి వ్యక్తం చేసింది. 13 జిల్లాలకు విజయవాడ కేంద్రబిందువు కావడం, రైల్వే డివిజన్ ఉండడం, ప్రభుత్వ, అటవీ భూములు, దేవాదాయ శాఖ భూములు ఉండడం, కృష్ణానది ఉండడంతో నీటి సమస్య లేకపోవడం, జాతీయ రహదారులు జిల్లాలో అధికంగా ఉండడం, విద్యుత్ సమస్య తీర్చే 1500 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు, ప్రెవేట్ విద్యాసంస్థలు, గుంటూరు, విజయవాడల్లో ఏడు  బోధనాసుపత్రులు, రెండు విశ్వవిద్యాలయాలు, సుమారు 60కి పైగా ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఇలా అనేక అంశాల్లో ఇతర ప్రాంతాల కంటే జిల్లా అగ్రగామిగా ఉండడంతో రాజధానిగా బెజవాడనే ఎంపిక చేస్తారనే ప్రచారం బలంగా సాగుతోంది. రాజధాని కమిటీ సభ్యుడు రతన్‌రాయ్ కూడా విజయవాడ సమాచారాన్ని సమగ్రంగా సేకరించారు.

జిల్లాలోని ఖాళీ భూముల వివరాలపై పూర్తిస్థాయిలో అధికారులను అడిగి తెలుసుకుని వాటి మ్యాప్‌లను కూడా తెప్పించుకుని పరిశీలించారు. గతంలో హైపర్ కమిటీ హనుమాన్‌జంక్షన్-ఏలూరు మధ్య సుమారు నాలుగు వేల ఎకరాల భూమి ఉందని, విమానాశ్రయానికి, జాతీయ రహదారులకు అతి సమీపంలో ఉండడంతో అనువుగా ఉంటుందని సూచించిన సంగతి తెలిసిందే. దీంతో  కమిటీ జంక్షన్ ప్రాంతంలోనూ పర్యటించింది. ముసునూరు మండలంలో ఉన్న 5,600 ఎకరాల అటవీప్రాంత భూముల వివరాలను తహశీల్దార్ ద్వారా తెలుసుకుని నివేదికను స్వీకరించింది. అలాగే హైపర్ కమిటీ గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని నిర్మాణానికి అనువుగా భూములు ఉన్నాయని గతంలో సూచించిన నేపథ్యంలో శివరామకృష్ణన్ కమిటీ గుంటూరుకు వెళుతూ మార్గం మధ్యలోని ఆ భూములనూ పరిశీలించింది.
 
 పుష్కలంగా భూములు
 కృష్ణా జిల్లాలో అటవీప్రాంతం అధికంగా ఉంది. జిల్లాలో రెండు లక్షల ఎకరాల అటవీభూములున్నాయి. వీటిలో 1.25 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం కాగా, 75 వేల ఎకరాల భూమి అటవీ శాఖ ఆధీనంలో ఉంది. దీంతోపాటు దేవాదాయ భూములు సుమారు 36.377 ఎకరాలు ఉన్నాయి. వేలాది ఎకరాల రెవెన్యూ భూమి ఉంది. ఇక్కడ కాకుండా మరెక్కడైనా రాజధాని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తే..  ఇక్కడే రాజధాని ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌తో పలు సంఘాలు ఉద్యమం కొనసాగించే దిశగా ఆలోచిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement