లెర్నింగ్‌పైనా దృష్టిపెట్టండి
- గురుపూజోత్సవంలో కలెక్టర్
విజయవాడ : ఉపాధ్యాయులు టీచింగ్‌పై కాకుండా లెర్నింగ్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అన్నారు. విద్యారంగంలో కృష్ణా జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. జిల్లా విద్యా శాఖ, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యాన శుక్రవారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆయనపై గౌరవానికి నిదర్శనమన్నారు. సమాజం, ప్రభుత్వం కలిసి నిర్వహించేది టీచర్స్ డే ఒక్కటేనని పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించినప్పుడు ఆ ఘనత సంబంధిత బృందానికి దక్కుతుందని, విఫలమైతే ఇందుకు బాధ్యులను ఒకరిద్దరై నెట్టడం మంచి పద్ధతి కాదన్నారు.
తమ బోధనల ద్వారా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించి మన జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలని ఉపాధ్యాయులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యకు ప్రాధాన్యతనిచ్చి ఎక్కువ నిధులు కేటాయిస్తోందని, ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో అనుకున్న ప్రగతిని సాధించలేక పోవడం దురుదృష్టకరమన్నారు.
ప్రపంచ దేశాలలో విద్యా ప్రమాణాలను ‘పాసా’ విధానాన్ని కొలమానంగా తీసుకుంటారని, దాని ప్రకారం మన దేశం వెనుకబడి ఉందని తెలిపారు. అదనపు జాయింట్ కలెక్టర్ బీఎల్ చెన్నకేశవరావు మాట్లాడుతూ మార్కులే పరమావధిగా విద్యా బోధన చేయటం సరికాదన్నారు. విద్యార్థులలో సామాజిక, నైతిక విలువలను పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
అవార్డులు అందుకుంటున్న ఉపాధ్యాయులను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని హితవుపలికారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను సన్మానించారు. జిల్లా విద్యాశాఖాధికారి దేవానందరెడ్డి, రాజీవ్ విద్యా మిషన్ ఇన్‌చార్జ్ పీవో పుష్పమణి, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఆర్‌ఎంజే నాయక్, జిల్లాలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.