Siva Ramakrishnan Committee
-
స్పందిస్తారా?
సాక్షి, ప్రతినిధి, ఒంగోలు : రాజధాని ఎంపిక కోసం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఎట్టకేలకు ఆదివారం ఒంగోలు రానుంది. ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, పౌర సమాజ వేదిక నేతలు, ప్రజలతో సమావేశం అవుతుంది. ఈ కమిటీ ముందు తమ వాదనలు వినిపించేందుకు ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నేతలు సన్నద్ధమవుతున్నారు. ఈ కమిటీ ప్రతినిధులు ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కొత్తపట్నంలోని వాన్‌పిక్ భూములు, దొనకొండలోని ప్రభుత్వ భూములను సందర్శిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని విషయంలో ముందుగానే ఒక నిర్ణయానికి రావడం వల్ల ప్రకాశం జిల్లాను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలున్న నేపథ్యంలో ఈ కమిటీ ఏ విధంగా స్పందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ఆధారంగా రాష్ట్రానికి కేటాయించిన 11 జాతీయ సంస్థల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా జిల్లాకు కేటాయించకపోవడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజధాని నిర్మాణానికి జిల్లాలో ఉన్న అనుకూలతలివీ.. * జిల్లాలోని దొనకొండ దగ్గర మొత్తం 54,483 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని అధికారులు లెక్కలు తేల్చారు. ఇందులో 34 వేల ఎకరాలు యధాతథంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. మిగిలిన 20 వేల ఎకరాలు అటవీ భూమి. దీన్ని డీ-నోటిఫై చేస్తే సరిపోతుంది. * దొనకొండకు పది కిలోమీటర్ల దూరంలోనే సాగర్ కాలువ ప్రవహిస్తుండటంతో, ఇక్కడ తాగునీటికి కూడా ఇబ్బంది ఉండదు. * దొనకొండలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాన్ని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దాదాపు 1939వ సంవత్సరంలో నిర్మించారు. ఇక్కడ సమాచార వ్యవస్థ ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. అయితే మిగిలిన భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇక్కడ ఇంధనం నింపుకోవడానికి, సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగించారు. ఇటీవల ఈ శిథిల భవనానికి కంచె కూడా వేశారు. ప్రస్తుతం ఈ విమానాశ్రయం ఆధీనంలో 136 ఎకరాల భూములున్నాయి. శిథిల భవనాలను వాడుకలోకి తీసుకురావడంతో పాటు, ఈ భూములను అభివృద్ధి చేస్తే విమానాశ్రయం కూడా అందుబాటులోకి వస్తుంది. రాజధాని నిర్మాణానికి ఈ ప్రాంతం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావు నివేదిక పంపిన సంగతి తెలిసిందే. * దొనకొండ ప్రాంతం భౌగోళికంగా రాయలసీమకు దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తే వెనుకబడిన ప్రాంతం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. * ఈ ప్రాంతం జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శి నియోజకవర్గంలో ఉన్నా రాజధాని నిర్మాణంపై ఆయన స్పందించలేదు. * ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చొరవ తీసుకుని ఢిల్లీలో ఈ కమిటీని కలిసి ప్రకాశం జిల్లా పర్యటనకు రావాలని కోరడం, రాజధాని సాధన సమితి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతుండటంతో దొనకొండను రాజధానిని చేయాలంటూ మంత్రివర్యులు ఒక ప్రకటన చేసి ఊరుకున్నారు. వాన్‌పిక్ ప్రాజెక్టు కోసం కేటాయించిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అక్కడ కూడా రాజధానిని ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా ఉంటుందని జిల్లా ప్రజలు తమ వాదన వినిపించనున్నారు. శివరామకృష్ణన్ కమిటీ సభ్యుల పర్యటన సాగేదిలా.. ఒంగోలు టౌన్: శివరామకృష్ణ కమిటీ సభ్యులు ఆదివారం జిల్లాకు వస్తున్నట్లు కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ శనివారం తెలిపారు. కమిటీ సభ్యుల పర్యటన వివరాలను ఆయన వెల్లడించారు. * ఉదయం 10 గంటలకు ఒంగోలు చేరుకుంటారు. * 10.30 గంటలకు స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అధికారులు, జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో సమావేశమవుతారు. * 11.30 గంటలకు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సివిల్ సొసైటీస్ ప్రతినిధులతో సమావేశమవుతారు. * మధ్యాహ్నం 12 గంటలకు సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తారు. * 12.30 గంటలకు కొత్తపట్నంలోని వాన్‌పిక్ భూములను కమిటీ పరిశీలిస్తుంది. * 1.30 నుంచి 2.30 గంటల వరకు స్థానిక ఎన్ఎస్పీ అతిథిగృహంలో లంచ్ బ్రేక్ తీసుకుంటారు. * 2.30 గంటలకు దొనకొండకు ఒంగోలు నుంచి బయలుదేరతారు. * సాయంత్రం 4 గంటలకు దొనకొండలోని భూములను పరిశీలిస్తారు. * 5 గంటలకు అక్కడ నుంచి కడపకు వెళతారు. -
వైజాగా... చాలదా
విశాఖలో రాజధాని ఏర్పాటుకు అందుబాటులో 15వేల ఎకరాలు సీఎం దృష్టికి తీసుకువెళ్లిన శివరామకృష్ణన్ కమిటీ గుంటూరువైపు ప్రభుత్వం మొగ్గుతో మనకొచ్చే అవకాశం తక్కువే బదులుగా ఈ భూముల్లో భారీగా కొత్త ప్రాజెక్టులొచ్చే వీలు ఐఐటీ,ఐటీఐఆర్ ఏదో ఒకటి దక్కే అవకాశం వేలాది ఎకరాల స్థలాల లభ్యత ఉన్నా నవ్యాంధ్రకు రాజధానిగా విశాఖ అవతరించేదీ లేనిదీ ఇంకా రూఢి కాలేదు. రాజమండ్రి,గుంటూరు ప్రాంతాల్లో ఇక్కడి కన్నా తక్కువ భూములున్నటు తేలింది. ఈ నేపథ్యంలో తాజాగా విశాఖలో రాజధానికి గల అవకాశాలపై మరోసారి చర్చ ప్రారంభమైంది. రాజ ధాని హోదా మాట ఎలా ఉన్నాఐఐటీ, ఐటీఐఆర్ ఏదో ఒక భారీ ప్రాజెక్టు దక్కే అవకాశం ఉంది. సాక్షి, విశాఖపట్నం : విభజన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు ముమ్మరమవుతోంది. ఇప్పటికే విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని రావచ్చని సూచనప్రాయంగా ప్రచారం జరుగుతున్నా అధికారికంగా ఇంకా ఖరారు కాకపోవడంతో విశాఖకు ఆ అవకాశం వస్తుందనే కొద్దిపాటి ఆశలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో సమావేశమైన శివరామకృష్ణన్ కమిటీ విశాఖలో రాజధానికి గల అవకాశాలను కూడా వివరించింది. కమిటీ రాజమండ్రి, విశాఖపట్నం, గుంటూరు తదితర ప్రాంతాల్లో పర్యటించి రాజధానికి అనువైన భూముల వివరాలు కూడా గతంలో ఆరా తీసింది. ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి నివేదికలు రప్పించుకుంది. దాని ప్రకారం విశాఖలో రాజధాని ఏర్పాటుకు 15 వేల ఎకరాల భూములు అందుబాటులో ఉన్నట్లు కమిటీ వివరించింది. విశాఖలో అనేక రకాల ప్రాథమిక సౌకర్యాలు ఇప్పటికే ఉండడం, ప్రకృతి విపత్తుల భయం కూడా ఈ ప్రాంతానికి లేకపోవడం విశాఖకు మంచి అవకాశంగా ఉన్నట్లు ఈ కమిటీ అభిప్రాయపడింది. ఇదే విషయాన్ని శనివారం సీఎంకు వివరించింది. అదే రాజమండ్రి,గుంటూరు ప్రాంతాల్లో విశాఖ కన్నా తక్కువ భూములున్నటు తేల్చింది. ఈ నేపథ్యంలో తాజాగా విశాఖలో రాజధానికి గల అవకాశాలపై మరోసారి చర్చ ప్రారంభమైంది. రాజధాని ఎంపిక తుది నిర్ణయం ప్రభుత్వం చేతిలో ఉన్నందున, ఇప్పటికే గుంటూరువైపు ఆసక్తి చూపుతుండడంతో విశాఖ వైపు మొగ్గు చూపకపోవచ్చని స్పష్టమవుతోంది. విశాఖలో ఇప్పటికే రద్దీవాతావరణం, కాలుష్యం, దానికితోడు నగరం నుంచి గ్రామీణ ప్రాంతం వరకు తీరం వెంట పారిశ్రామిక కారిడార్ వస్తోన్న నేపథ్యంలో రాజధానికి అనువైన ప్రాంతంగా పరిగణించడం లేదు. విశాఖలో భూముల లభ్యత భారీగా ఉన్నట్లు ఇప్పటికే కలెక్టర్ కూడా వివరాలు సిద్ధం చేశారు. ఒకవేళ ప్రభుత్వం విశాఖవైపు మొగ్గుచూపకపోతే ఈ భూముల్లో ఎక్కడెక్కడ ఏయే ప్రాంతంలో ఏయే ప్రాజెక్టులు తీసుకు రావచ్చనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరిస్తున్నారు. కేబినెట్లో కదలిక విభజన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్‌కు ఐఐటీ,ఐఐఎం,గిరిజన యూనివర్సిటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఆస్పత్రులు కేంద్రం నుంచి మంజూరయ్యే అవకాశం ఉంది. వీటిలో కొన్నింటిని విశాఖలో అందుబాటులో ఉన్న భూముల్లో స్థాపించవచ్చని తెలుస్తోంది. కేబినేట్ సమావేశానికి విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అవుటర్ రింగ్ రోడ్డు, విద్యా,వైద్య,పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధితోపాటు ఐటీఐఆర్ ఏర్పాటుకు విశాఖలో ఖాళీ భూములపై మాస్టర్‌ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. దీంతో రాజధాని రాకపోయినా కొత్త ప్రాజెక్టులు ఇక్కడకు వచ్చే వీలుంది. ఆంధ్రలో ఐఐటీ ఏర్పాటుపై ఈనెల 17న పురపాలకశాఖ మంత్రి నారాయణ ఉన్నతాధికారులతో మరోసారి చర్చించనున్నారు. ఇప్పటికే ఆయన జిల్లా కలెక్టర్‌తో చర్చలు కూడా జరిపారు. ఖాళీ భూముల వివరాలు కోరారు. ఒక వేళ రాజధాని రాకపోతే ఇక్కడ కచ్చితంగా కేంద్రం మంజూరు చేసే ఐఐటీ తీసుకు రావచ్చు. కేంద్రం హైదరాబాద్‌కు 2.19లక్షల కోట్లతో ఇప్పటికే ఐటీఆర్ ప్రకటించింది. ఆ తర్వాత ఒత్తిడి పెరగడంతో విశాఖలో రూ.50వేల కోట్లతో ఐటీఐఆర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి వెల్లడించింది. నగరంతోపాటు గ్రామీణ ప్రాంతంలో కూడా ఐటీఐఆర్‌కు కావలసిన 10 వేల ఎకరాల భూముల లభ్యతపై సర్వే నిర్వహించింది. ప్రస్తుతం విశాఖలో ఐటీఐఆర్ ప్రాజెక్టు ప్రాథమిక పనులు పది నెలల నుంచి నిలిచిపోయాయి. ఇప్పుడు భూముల లభ్యత ఎలాగూ ఉంది కాబట్టి ఏదో ఒక కీలక ప్రాజెక్టు విశాఖకు వేగంగానే దక్కే అవకాశం ఉంది. -
మళ్లీ భూమ్
రాజధాని అంచనాతో స్థల క్రయ విక్రయాల జోరు గుంటూరు-విజయవాడ రోడ్డులోని స్థలాలకు డిమాండ్ మిగిలిన ప్రాంతాల్లోను కొనుగోళ్లు జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ జోరందుకుంది. సీమాంధ్రలో రెండో అతి పెద్ద నగరంగా విజయవాడకు గుర్తింపు ఉండటం, రాజధాని ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉండటంతో రాజధాని అవకాశాలపై సర్వత్రా చర్చ సాగుతోంది. దీనికి తోడు గత వారంలో శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ నగరంలో పర్యటించి సమగ్ర అధ్యయనం చేసింది. దీంతో విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయనే బలమైన వాదన వినిపిస్తుండటం రియల్ వ్యాపారానికి ఊతమిచ్చింది. సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొద్ది రోజుల్లో కొలువుతీరనుంది. రాజధాని ఏర్పాటుతో పాటు, అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలనే రాజకీయ వాదన బలంగా ఉంది. పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందే అవకాశమున్న నేపథ్యంలో గుంటూరు - విజయవాడ మధ్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంతంలో డీజీపీ కార్యాలయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నాయని బలంగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే రెండు జిల్లాల టీడీపీ ముఖ్యులతో దీనిపై చర్చించారు. రాజధాని ఏర్పాటుచేసే ప్రాంతంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, డీజీపీ కార్యాలయం ఉంటాయి కాబట్టి రాజధాని ఏర్పాటు కూడా ఇక్కడే జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అన్ని వనరులూ పుష్కలంగా ఉన్న విజయవాడను రాజధానిగా ప్రకటించినా నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంతం 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాజధాని ఏర్పాటు రెండు జిల్లాల మధ్య జరిగినా రెండు జిల్లాల అభివృద్ధికీ దోహదపడుతుంది. ఇదే అంశాన్ని రియల్ వ్యాపారులు కారణంగా చూపుతూ వ్యాపారం సాగిస్తున్నారు. విస్తారంగా భూములు, స్థలాలు... ప్రధానంగా గంటూరు- విజయవాడ మధ్య సుమారు 250కి పైగా ప్రెవేట్ వెంచర్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 30 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోంది. గత ఆరు నెలలుగా వ్యాపారం పెరగటంతో పాటు ధరలు కూడా రెట్టింపయ్యాయి. గుంటూరు విజయవాడ నగరాలతో పాటు ఏడు మున్సిపాలిటీల పరిధి విస్తరించి ఉన్న వీజీటీఎం పరిధిలో 1400 గ్రామాలను కలుపుకొని 7067 కిలోమీటర్ల పరిధి ఉంది. ఉడా పరిధిలో అధికార, అనధికార రియల్ ఎస్టేట్ వెంచర్లు సుమారు ఆరువేలు ఉన్నాయి. రెండు జిల్లాల్లో వెంచర్ల కింద సుమారు 10 వేల ఎకరాల భూమి ఉంది. దీనికితోడు రెండు జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కృష్ణా జిల్లాలో అటీవీశాఖకు రెండు లక్షల ఎకరాల భూమి ఉంది. దీనిలో 1.25 లక్షల ఎకరాలు ఆక్రమణల చెరలో ఉండగా మిగిలిన 75 వేల ఎకరాలు అటవీశాఖ ఆధీనంలో ఉన్నాయి. దేవాదాయ శాఖకు కూడా జిల్లాలో భూములు అధికంగానే ఉన్న విషయం తెలిసిందే. జిల్లాలో దేవాదాయ శాఖకు 36,377 ఎకరాలు ఉన్నాయి. ఈ క్రమంలో రాజధాని నిర్మాణానికి అనువుగా ఇక్కడ భూములు ఉన్నాయని, అందుబాటులో గన్నవరం విమానాశ్రయం, జాతీయరహదారి, రైల్వే డివిజన్, నీటి సమస్యలు తీర్చే కృష్ణా నది ఇలా అన్ని వనరులు ఉన్నాయని కలెక్టర్ రఘునందన్‌రావు శివరామకృష్ణన్ కమిటీకి నివేదిక ఇచ్చారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగా జూన్ రెండో తేదీన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం జరగనుంది. జూన్ చివరినాటికి కల్లా రాజధానిని ఎంపిక చేసి తాత్కాలికంగానైనా సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. వేగంగా విక్రయాలు... రాజధాని గుంటూరు-విజయవాడ మధ్య ఉంటుందని, నాగార్జున విశ్వవిద్యాలయంలో దాదాపు సీఎం కార్యాలయానికి అనువైన అన్ని సౌకర్యాలూ ఉన్నాయని ఇప్పటికే అక్కడి జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని విజయవాడ-గుంటూరు రహదారి, విజయవాడ-మచిలీపట్నం రహదారి, విజయవాడ-నూజివీడు రహదారి, విజయవాడ-నందిగామ మధ్య ఉన్న ఖాళీ స్థలాలు, వెంచర్ల విక్రయాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 16 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉండటం, పోలీసులు జిల్లాలో సుమారు 30 చెక్‌పోస్టులు ఏర్పాటుచేయటంతో నగదు లావాదేవీలకు అవకాశం లేకపోయింది. ప్రస్తుతం పరిస్థితి మారటంతో కొనుగోళ్లకు అనుకూల పరిస్థితి ఏర్పడింది. -
ఆంధ్రప్రదేశ్ రాజధాని బెజవాడేనా!?
-
రాజధాని బెజవాడేనా!?
విజయవాడలో పర్యటించిన సందర్భంగా జిల్లా మ్యాప్‌ను పరిశీలిస్తున్న రాజధాని కమిటీ సభ్యులు రతన్‌రాయ్, జగన్‌షా, రవీంద్రన్. చిత్రంలో కలెక్టర్ రఘునందన్‌రావు తదితరులు. సాక్షి, విజయవాడ : నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి తమ ప్రాంతం అనువుగా ఉందంటే.. తమ ప్రాంతం అనువుగా ఉందంటూ దాదాపు అన్ని జిల్లాలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ఆయా జిల్లాల్లోని భూములు, నీటివనరులు, ప్రత్యేకతలు.. ఇలా ప్రతి అంశమూ తెరపైకి వస్తోంది. కలెక్టర్ మొదలుకొని తహశీల్దార్ వరకు అందరూ తమ జిల్లాలోని ప్రాంతాలు అనువుగా ఉన్నాయని శివరామకృష్ణన్ కమిటీకి నివేదికలు అందజేస్తున్నారు. వీరితోపాటు ప్రతి జిల్లాలోనూ ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, వివిధ సామాజిక సేవాసంఘాలు పెద్దఎత్తున వినతిపత్రాలు అందించాయి. బెజవాడను రాజధాని చేయాలంటూ కొందరు, విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటుచేయాలని మరికొందరు తమ ప్రతిపాదనలను ఇటీవల జిల్లాకు వచ్చిన శివరామకృష్ణన్ కమిటీ ముందుంచారు. కలెక్టర్ రఘునందన్‌రావు, విజయవాడ నగర పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు, ఉడా వీసీ పి.ఉషాకుమారి, మున్సిపల్ కమిషనర్ హరికిరణ్ తదితరులు ఆయా శాఖల వివరాలను కమిటీకి అందజేసి విజయవాడ రాజధాని ఏర్పాటుకు అనువుగా ఉంటుందని నివేదిక ఇచ్చారు. బెజవాడపై కమిటీ సంతృప్తి.. సీమాంధ్ర జిల్లాల్లో విజయవాడ రెండో అతి పెద్ద నగరం. వాణిజ్యపరంగానూ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. శివరామకృష్ణన్ కమిటీ ఆదివారం జిల్లాలో పర్యటించింది. జిల్లాకు రాకముందు విశాఖపట్నం, రాజమండ్రి ప్రాంతాల్లో పర్యటించింది. విశాఖ అనుకూలంగా ఉన్నప్పటికీ నౌకాదళం అక్కడ ఉండడంతో అనువు కాదని ప్రాథమికంగా నిర్థారించినట్లు సమాచారం. రాజమండ్రి కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ 13 జిల్లాలకు కేంద్రబిందువు కాకపోవడంతో అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో విజయవాడలో పర్యటించిన కమిటీ జిల్లాలోని వనరులు, ఇతర అంశాలపై సంతృప్తి వ్యక్తం చేసింది. 13 జిల్లాలకు విజయవాడ కేంద్రబిందువు కావడం, రైల్వే డివిజన్ ఉండడం, ప్రభుత్వ, అటవీ భూములు, దేవాదాయ శాఖ భూములు ఉండడం, కృష్ణానది ఉండడంతో నీటి సమస్య లేకపోవడం, జాతీయ రహదారులు జిల్లాలో అధికంగా ఉండడం, విద్యుత్ సమస్య తీర్చే 1500 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు, ప్రెవేట్ విద్యాసంస్థలు, గుంటూరు, విజయవాడల్లో ఏడు బోధనాసుపత్రులు, రెండు విశ్వవిద్యాలయాలు, సుమారు 60కి పైగా ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఇలా అనేక అంశాల్లో ఇతర ప్రాంతాల కంటే జిల్లా అగ్రగామిగా ఉండడంతో రాజధానిగా బెజవాడనే ఎంపిక చేస్తారనే ప్రచారం బలంగా సాగుతోంది. రాజధాని కమిటీ సభ్యుడు రతన్‌రాయ్ కూడా విజయవాడ సమాచారాన్ని సమగ్రంగా సేకరించారు. జిల్లాలోని ఖాళీ భూముల వివరాలపై పూర్తిస్థాయిలో అధికారులను అడిగి తెలుసుకుని వాటి మ్యాప్‌లను కూడా తెప్పించుకుని పరిశీలించారు. గతంలో హైపర్ కమిటీ హనుమాన్‌జంక్షన్-ఏలూరు మధ్య సుమారు నాలుగు వేల ఎకరాల భూమి ఉందని, విమానాశ్రయానికి, జాతీయ రహదారులకు అతి సమీపంలో ఉండడంతో అనువుగా ఉంటుందని సూచించిన సంగతి తెలిసిందే. దీంతో కమిటీ జంక్షన్ ప్రాంతంలోనూ పర్యటించింది. ముసునూరు మండలంలో ఉన్న 5,600 ఎకరాల అటవీప్రాంత భూముల వివరాలను తహశీల్దార్ ద్వారా తెలుసుకుని నివేదికను స్వీకరించింది. అలాగే హైపర్ కమిటీ గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని నిర్మాణానికి అనువుగా భూములు ఉన్నాయని గతంలో సూచించిన నేపథ్యంలో శివరామకృష్ణన్ కమిటీ గుంటూరుకు వెళుతూ మార్గం మధ్యలోని ఆ భూములనూ పరిశీలించింది. పుష్కలంగా భూములు కృష్ణా జిల్లాలో అటవీప్రాంతం అధికంగా ఉంది. జిల్లాలో రెండు లక్షల ఎకరాల అటవీభూములున్నాయి. వీటిలో 1.25 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం కాగా, 75 వేల ఎకరాల భూమి అటవీ శాఖ ఆధీనంలో ఉంది. దీంతోపాటు దేవాదాయ భూములు సుమారు 36.377 ఎకరాలు ఉన్నాయి. వేలాది ఎకరాల రెవెన్యూ భూమి ఉంది. ఇక్కడ కాకుండా మరెక్కడైనా రాజధాని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తే.. ఇక్కడే రాజధాని ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌తో పలు సంఘాలు ఉద్యమం కొనసాగించే దిశగా ఆలోచిస్తున్నాయి.