
మళ్లీ భూమ్
- రాజధాని అంచనాతో స్థల క్రయ విక్రయాల జోరు
- గుంటూరు-విజయవాడ రోడ్డులోని స్థలాలకు డిమాండ్
- మిగిలిన ప్రాంతాల్లోను కొనుగోళ్లు
జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ జోరందుకుంది. సీమాంధ్రలో రెండో అతి పెద్ద నగరంగా విజయవాడకు గుర్తింపు ఉండటం, రాజధాని ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉండటంతో రాజధాని అవకాశాలపై సర్వత్రా చర్చ సాగుతోంది. దీనికి తోడు గత వారంలో శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ నగరంలో పర్యటించి సమగ్ర అధ్యయనం చేసింది. దీంతో విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయనే బలమైన వాదన వినిపిస్తుండటం రియల్ వ్యాపారానికి ఊతమిచ్చింది.
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొద్ది రోజుల్లో కొలువుతీరనుంది. రాజధాని ఏర్పాటుతో పాటు, అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలనే రాజకీయ వాదన బలంగా ఉంది. పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందే అవకాశమున్న నేపథ్యంలో గుంటూరు - విజయవాడ మధ్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంతంలో డీజీపీ కార్యాలయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నాయని బలంగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే రెండు జిల్లాల టీడీపీ ముఖ్యులతో దీనిపై చర్చించారు.
రాజధాని ఏర్పాటుచేసే ప్రాంతంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, డీజీపీ కార్యాలయం ఉంటాయి కాబట్టి రాజధాని ఏర్పాటు కూడా ఇక్కడే జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అన్ని వనరులూ పుష్కలంగా ఉన్న విజయవాడను రాజధానిగా ప్రకటించినా నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంతం 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాజధాని ఏర్పాటు రెండు జిల్లాల మధ్య జరిగినా రెండు జిల్లాల అభివృద్ధికీ దోహదపడుతుంది. ఇదే అంశాన్ని రియల్ వ్యాపారులు కారణంగా చూపుతూ వ్యాపారం సాగిస్తున్నారు.
విస్తారంగా భూములు, స్థలాలు...
ప్రధానంగా గంటూరు- విజయవాడ మధ్య సుమారు 250కి పైగా ప్రెవేట్ వెంచర్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 30 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోంది. గత ఆరు నెలలుగా వ్యాపారం పెరగటంతో పాటు ధరలు కూడా రెట్టింపయ్యాయి. గుంటూరు విజయవాడ నగరాలతో పాటు ఏడు మున్సిపాలిటీల పరిధి విస్తరించి ఉన్న వీజీటీఎం పరిధిలో 1400 గ్రామాలను కలుపుకొని 7067 కిలోమీటర్ల పరిధి ఉంది. ఉడా పరిధిలో అధికార, అనధికార రియల్ ఎస్టేట్ వెంచర్లు సుమారు ఆరువేలు ఉన్నాయి. రెండు జిల్లాల్లో వెంచర్ల కింద సుమారు 10 వేల ఎకరాల భూమి ఉంది. దీనికితోడు రెండు జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
కృష్ణా జిల్లాలో అటీవీశాఖకు రెండు లక్షల ఎకరాల భూమి ఉంది. దీనిలో 1.25 లక్షల ఎకరాలు ఆక్రమణల చెరలో ఉండగా మిగిలిన 75 వేల ఎకరాలు అటవీశాఖ ఆధీనంలో ఉన్నాయి. దేవాదాయ శాఖకు కూడా జిల్లాలో భూములు అధికంగానే ఉన్న విషయం తెలిసిందే. జిల్లాలో దేవాదాయ శాఖకు 36,377 ఎకరాలు ఉన్నాయి.
ఈ క్రమంలో రాజధాని నిర్మాణానికి అనువుగా ఇక్కడ భూములు ఉన్నాయని, అందుబాటులో గన్నవరం విమానాశ్రయం, జాతీయరహదారి, రైల్వే డివిజన్, నీటి సమస్యలు తీర్చే కృష్ణా నది ఇలా అన్ని వనరులు ఉన్నాయని కలెక్టర్ రఘునందన్‌రావు శివరామకృష్ణన్ కమిటీకి నివేదిక ఇచ్చారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగా జూన్ రెండో తేదీన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం జరగనుంది. జూన్ చివరినాటికి కల్లా రాజధానిని ఎంపిక చేసి తాత్కాలికంగానైనా సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేశారు.
వేగంగా విక్రయాలు...
రాజధాని గుంటూరు-విజయవాడ మధ్య ఉంటుందని, నాగార్జున విశ్వవిద్యాలయంలో దాదాపు సీఎం కార్యాలయానికి అనువైన అన్ని సౌకర్యాలూ ఉన్నాయని ఇప్పటికే అక్కడి జిల్లా కలెక్టర్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో జిల్లాలోని విజయవాడ-గుంటూరు రహదారి, విజయవాడ-మచిలీపట్నం రహదారి, విజయవాడ-నూజివీడు రహదారి, విజయవాడ-నందిగామ మధ్య ఉన్న ఖాళీ స్థలాలు, వెంచర్ల విక్రయాలు వేగంగా జరుగుతున్నాయి.
ఈ నెల 16 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉండటం, పోలీసులు జిల్లాలో సుమారు 30 చెక్‌పోస్టులు ఏర్పాటుచేయటంతో నగదు లావాదేవీలకు అవకాశం లేకపోయింది. ప్రస్తుతం పరిస్థితి మారటంతో కొనుగోళ్లకు అనుకూల పరిస్థితి ఏర్పడింది.