సాక్షి, విజయవాడ బ్యూరో : అద్భుత పర్యాటక ప్రాంతంగా, ఆర్థికాభివృద్ధి కేంద్రంగా నూతన రాజధాని అమరావతిని నిర్మించేందుకు సింగపూర్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అత్యాధునిక నగరాలకు దీటుగా అమరావతిని నిర్మించేందుకు అవసరమైన అన్ని హంగులను అందులో పొందుపరిచింది. అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 219 చదరపు కిలోమీటర్ల రాజధాని నగరం ఎలా ఉండాలి, అందులో ఏమేమి ఉండాలో సూచించే మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ ప్రభుత్వం సోమవారం మన రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.
కాజధాని నగరం ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు ప్రాంతీయ పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, లాజిస్టిక్స్, ఐటీ, ఫార్మాసూటికల్స్ పరిశ్రమలను ప్లాన్‌లో ప్రతిపాదించారు. అందులోభాగంగా సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌ను నెలకొల్పుతారు. ఇందులోనే పారిశ్రామిక పార్కులు కూడా ఉంటాయి. నగరం మధ్యలోని ప్రాంతాన్ని కమర్షియల్ జోన్లుగా విభజించి వ్యాపార అవకాశాలు కల్పిస్తారు. రాజధాని నగరంలో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించే ందుకు హోమ్ జాబ్స్ విధానాన్ని సింగపూర్ ఏజెన్సీలు సూచించాయి. ప్రజలు ఇళ్ల వద్దే పనిచేస్తూ సంపాదించుకునేందుకు గృహావసర వ్యాపారాలను ప్రోత్సహిస్తారు. రాజధాని నగరానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు అనుగుణంగా రైలు, రోడ్డు మార్గాల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తారు. నగరంలో ప్రజారవాణా వ్యవస్థకు పెద్దపీట వేస్తారు.
బీఆర్‌టీఎస్ తర్వాత మోడల్ అయిన ఎంఆర్‌టీఎస్ (మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్)ను ప్రవేశపెట్టనున్నారు. అంటే రైలు మార్గాల మాదిరిగానే బస్సులకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేసి తిప్పుతారు. మెట్రో రైలు రాజధాని నగరంలో కీలకం. వీటిద్వారా నగరంలో వ్యక్తిగతంగా ఎవరూ కార్లు, స్కూటర్లు, బైక్‌లను వినియోగించకుండా అందరూ ప్రజారవాణా వ్యవస్థనే వినియోగించే విధానాన్ని ప్రోత్సహిస్తారు. తద్వారా నగరంలో కాలుష్యం లేకుండా చూడాలని ప్లాన్‌లో పేర్కొన్నారు. మోటారు వాహనాలకు ప్రత్యామ్నాయంగా నగరంలో జలమార్గాలను అభివృద్ధి చేస్తారు. కాలువలు, రిజర్వాయర్లలో బోట్ల ద్వారా ప్రయాణించే ఏర్పాట్లు చేస్తారు. సైకిల్ ట్రాక్‌లు, వాకింగ్ ట్రాక్‌లు ప్రత్యేకంగా ఉంటాయి. పాఠశాలలు, ఆస్పత్రులు, మార్కెట్లు, షాపింగ్‌మాల్స్,లైబ్రరీ, యూనివర్సిటీ వంటి వాటిని నివాస ప్రాంతాలకు దగ్గరే ఏర్పాటుచేస్తారు. దీనివల్ల స్థానికులు ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా చూస్తారు.
అంతర్జాతీయ విమానాశ్రయానికి 5 వేల ఎకరాలు.. దేశవిదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు నగరాన్ని పర్యాటక అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్లాన్‌లో ప్రతిపాదించారు. నగరంలో గ్రీన్‌బెల్ట్‌ను నిర్మించి స్థానికులు, పర్యాటకులు ఆహ్లాదంగా గడిపే వాతావరణాన్ని సృష్టిస్తారు. అందమైన పార్కులు, గార్డెన్లు, రిక్రియేషన్ క్లబ్బులు ఏర్పాటుచేస్తారు. అమరావతి నగరం కృష్ణానది ఒడ్డు నుంచి చూస్తే అద్భుత దృశ్యంగా ఉండేలా తీర్చిదిద్దాలని అందుకనుగుణమైన అన్ని హంగు లూ ఏర్పాటు చేయాలని ప్లాన్‌లో ప్రతిపాదించారు. నగరంలోనే పలు టూరిజం సర్క్యూట్లు ఏర్పాటు చేస్తారు. నగరాన్ని ఆకాశం నుంచి చూసేందుకు స్కైవాక్‌లు కూడా ఉంటాయి.
నగరానికి సమీపంలోనే అంతర్జాతీయ విమానాశ్రయానికి 5 వేల ఎకరాలను రిజర్వు చేసుకోవాలని ప్లాన్‌లో సూచించారు. నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఎక్స్‌ప్రెస్ వేలు కూడా ఏర్పాటు చేస్తారు. నగరంలో చెత్త నిర్వహణకు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను నెలకొల్పుతారు. కొండవీటి వాగు ముంపు నుంచి రాజధానిని తప్పించి దాన్ని పర్యాటకానికి ఉపయోగిస్తారు. రాజధాని నగరం నుంచి మచిలీపట్నం పోర్టుకు కారిడార్ నిర్మిస్తారు. ఇవన్నీ 50 ఏళ్లలో రాజధానిలో ఏర్పాటు చేసుకోవాలని సింగపూర్ ప్రభుత్వ ఏజెన్సీలు సూచించాయి.
పర్యాటకం,పరిశ్రమలకు పెద్దపీట
Published Tue, May 26 2015 1:36 AM | Last Updated on Sat, Aug 18 2018 3:49 PM
Advertisement
Advertisement