పక్కా ప్రణాళికతో రెండున్నరేళ్లలో పూర్తిస్థాయిలో నిర్మిస్తాం
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి : పొంగూరు నారాయణ
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని అద్భుతంగా అభివృద్ధి చేసి, ఐదు అత్యుత్తమ రాజధానుల సరసన నిలిపేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు.
నెల్లూరు రూరల్ మండలం చింతారెడ్డిపాళెంలోని నారాయణ మెడికల్ కళాశాల ఆవరణలోని తన స్వగృహంలో మంత్రి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 2015 జనవరిలో అమరావతి రాజధాని నిర్మాణానికి కేవలం 58 రోజుల్లో 34 వేల ఎకరాల భూములను రైతులు అందజేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతోనే తమ భూములను రాజధాని ఏర్పాటుకు కేటాయించారని మంత్రి గుర్తుచేశారు.
వివిధ దశల్లోనే నిలిచిపోయిన భవనాలను పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. సుమారు రెండున్నరేళ్లలోనే అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు కృషిచేస్తామన్నారు. సీఎం చంద్రబాబు మరోసారి రాజధానిని అభివృద్ధి చేసే బాధ్యతను తనపై ఉంచారని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టేందుకు రాజధాని అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తానన్నారు.
మున్సిపాలిటీల అభివృద్ధికి పెద్దపీట..
ఇక 2014 నుంచి 2019 వరకు తమ పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రంలోని 114 మున్సిపాల్టీల్లో పెద్దఎత్తున పార్కులు, రోడ్లు, డ్రైనేజీలు, డివైడర్లు, పాఠశాలల్లో మౌలిక వసతులు మొదలైన అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి నారాయణ చెప్పారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన క్షణాల్లోనే ప్లాన్ అప్రూవల్ ఇచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. ఎటువంటి చార్జీలు కూడా ప్రజల నుంచి వసూలుచేయలేదన్నారు.
గత ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపిందని, చెత్త పన్నుతో ప్రజలు బాగా ఇబ్బందులుపడ్డారని మంత్రి చెప్పారు. అధికారులతో సమీక్షించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. త్వరలో టిడ్కో ఇళ్ల పూర్తిపై దృష్టిసారిస్తామని.. అలాగే, అధికారులతో సమావేశమై మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు, పెండింగ్ అంశాలపై చర్చిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment