జిల్లాలో తగ్గిన జోరు
‘తుళ్లూరు’ ప్రకటనతో క్రయవిక్రయాలు తగ్గుముఖం
విజయవాడ : జిల్లాలో రిజిస్ట్రేషన్ల జోరు తగ్గుతోంది. గత కొద్దిరోజులుగా విజయవాడ నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల హడావిడి పెద్దగా కనిపించడం లేదు. రాజధాని గుంటూరు జిల్లా తుళ్లూరుకు వెళ్లిపోవడంతో స్థలాలు, భూముల క్రయ విక్రయాలు తగ్గినట్లు తెలుస్తోంది. అన్‌సీజన్ కావడం వల్ల కూడా కొంతమేరకు రిజిస్ట్రేషన్లు తగ్గినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఏటా ఈ సీజన్‌లో రిజిస్ట్రేషన్స్ తక్కువగా ఉంటాయని, పంటలు చేతికొచ్చాక ఆదాయం మళ్లీ పుంజుకుంటుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ఆదాయ లక్ష్యం రూ.616.78 కోట్లు కాగా, అక్టోబర్ నాటికి రూ.351.06 కోట్ల మేర ఆదాయం లభించింది. డీఆర్ కార్యాలయాల వారీగా చూస్తే.. మచిలీపట్నం పరిధిలో రూ.106.67 కోట్లు లక్ష్యం కాగా రూ.66.89 కోట్లు, విజయవాడ పశ్చిమ పరిధిలో రూ.254.64 కోట్లు లక్ష్యం కాగా రూ.141.07 కోట్లు, విజయవాడ తూర్పు పరిధిలో రూ.255.47 కోట్లు లక్ష్యం కాగా రూ.143.10 కోట్ల ఆదాయం రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి సమకూరింది.
ఈ విధంగా ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గినట్లు గుర్తించారు. తుళ్లూరులో రాజధాని ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతుండటంతో అక్టోబర్‌లో రిజిస్ట్రేషన్ల సంఖ్య సుమారు 10 శాతం తగ్గినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. తుళ్లూరు ప్రాంతంలో రాజధాని నిర్మాణం విషయం ప్రకటించగానే జిల్లాలో రియల్టర్లు, బ్రోకర్ల హడావిడి తగ్గిపోయింది. భూముల ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మాత్రం నెమ్మదిగా సాగుతోంది.
రిజిస్ట్రేషన్లు డల్
Published Fri, Nov 28 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 5:14 PM
Advertisement