ఆస్తుల వాటా.. స్టాంప్‌ డ్యూటీకి టాటా | Scams in Registrations of Inheritance Assets | Sakshi
Sakshi News home page

ఆస్తుల వాటా.. స్టాంప్‌ డ్యూటీకి టాటా

Published Thu, Aug 19 2021 4:08 AM | Last Updated on Thu, Aug 19 2021 4:10 AM

Scams in Registrations of Inheritance Assets - Sakshi

సాక్షి, అమరావతి: విజయవాడలోని ప్రముఖ వ్యాపారికి చెందిన ఉమ్మడి ఆస్తిని నలుగురు వారసులు పంచుకున్నారు. రిజిస్ట్రేషన్‌ శాఖ లెక్కల ప్రకారం ఆ ఆస్తి విలువ రూ.133.93 కోట్లు. హిందూ వారసత్వ చట్ట నిబంధనల ప్రకారం ఆస్తిని పంచుకున్న వారసులు రిజిస్ట్రేషన్‌ నిమిత్తం రూ.1.84 కోట్లను స్టాంపు డ్యూటీగా చెల్లించాలి. కానీ.. చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తూ వారసుల మధ్య ఆస్తులను సమానంగా పంపిణీ చేయలేదు. అంతేకాదు వారసులు కాని వారికి ఆస్తులను ముందే విక్రయించేసి.. కొనుగోలుదారులను కూడా వారసుల జాబితాలో చూపించారు. మొత్తంగా సుమారు రూ.75 లక్షల్ని మాత్రమే స్టాంప్‌ డ్యూటీగా చెల్లించారు. దాంతో ఖజానాకు రూ.1.09 కోట్ల నష్టం వాటిల్లింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఓ ప్రముఖ వ్యాపారి, రాజకీయ నేత కుటుంబానికి చెందిన రూ.132 కోట్ల ఉమ్మడి ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విషయంలోనూ ఖజానాకు రూ.1.03 కోట్ల మేర గండికొట్టారు. ఇలా 2014–20 సంవత్సరాల మధ్య స్టాంప్‌ డ్యూటీ రూపంలో రాష్ట్ర ఖజానా రూ.1,200 కోట్ల వరకు ఆదాయాన్ని కోల్పోయినట్టు ఆంధ్రప్రదేశ్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (ఏపీ డీఆర్‌ఐ) గుర్తించింది. వారసత్వ చట్టం ప్రకారం ఆస్తుల పంపిణీలో నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రభుత్వ ఖజానాకు దశాబ్దాలుగా రూ.వేలాది కోట్లను గండికొడుతున్న మాయాజాలం ఏపీ డీఆర్‌ఐ పరిశీలనలో వెల్లడైంది.  

ఏటా 64 వేల వారసత్వ ఆస్తుల పంపిణీ రిజిస్ట్రేషన్లు 
వీలునామా లేని సందర్భాల్లో వారసుల మధ్య ఆస్తుల పంపిణీకి సంబంధించిన నిబంధనల్ని హిందూ వారసత్వం చట్టంలోని సెక్షన్‌ 8లో స్పష్టంగా పొందుపర్చారు. ఆ సెక్షన్‌ కింద రాష్ట్రంలో ఏటా దాదాపు 64 వేల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మొత్తం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ఇవి 4 శాతం. రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఏటా సగటున 16 లక్షల ఆస్తుల క్రయ, విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు చేస్తోంది. తద్వారా స్టాంపు డ్యూటీ రూపంలో ఏటా సగటున రూ.5,500 కోట్ల ఆదాయం ఖజానాకు చేరుతోంది. అందులో వారసత్వ ఆస్తుల పంపిణీ రిజిస్ట్రేషన్లు 4 శాతం అంటే 64 వేల రిజిస్ట్రేషన్ల ద్వారా స్టాంపు డ్యూటీ రూపంలో ప్రభుత్వానికి ఏటా రూ.75 కోట్ల ఆదాయం వస్తోంది. కానీ.. నిబంధనల ప్రకారం ఏటా రూ.275 కోట్లు స్టాంపు డ్యూటీ రావాలని ఏపీ డీఆర్‌ఐ తనిఖీల్లో వెల్లడైంది.  

ఆరేళ్లలో రూ.1,200 కోట్ల స్టాంపు డ్యూటీ ఎగవేత 
ఏపీ డీఆర్‌ఐ కమిషనర్‌ ఎం.నరసింహారెడ్డి ఇటీవల ప్రత్యేక బృందాలతో నిర్వహించిన తనిఖీల్లో విస్మయానికి గురిచేసే వాస్తవాలు వెలుగు చూశాయి. 2014 నుంచి 2020 వరకు రాష్ట్రంలో వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్లలో 50 రిజిస్ట్రేషన్లను ఏపీ డీఆర్‌ఐ బృందాలు తనిఖీ చేశాయి. వాటికి నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ కంటే రూ.22.68 కోట్లు తక్కువ చెల్లించినట్టు గుర్తించారు. ఆ విధంగా 2014–20 మధ్య ఖజానాకు రూ.1,200 కోట్లు గండికొట్టినట్టు తేలింది.

హక్కుదారులు కాకపోయినా..
ఉమ్మడి ఆస్తిలో చట్ట ప్రకారం హక్కుదారులు కాని వారిని కూడా హక్కుదారులుగా చేరుస్తున్నారు. ఆ మేరకు ముందుగానే ఆస్తుల అమ్మకానికి ఒప్పందం చేసుకుని కొనుగోలుదారులను ఆస్తి హక్కుదారులుగా చూపిస్తున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన సబ్‌ రిజిస్ట్రార్లు కొందరు అవినీతికి పాల్పడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఆమోదిస్తున్నారు. వారసులు కానివారికి ఆస్తిని రిజిస్ట్రేషన్‌ చేస్తే 3 శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాలి. కానీ.. వారిని వారసులుగా పేర్కొని వాటాలు ఇస్తూ ఆ విలువపై కేవలం 1 శాతం స్టాంపు డ్యూటీ చెల్లిస్తున్నారు. దాంతో ప్రభుత్వం 2 శాతం స్టాంపు డ్యూటీ ఆదాయాన్ని కోల్పోతోంది. మరోవైపు స్వార్జిత ఆస్తిని కూడా ఉమ్మడి వారసత్వ ఆస్తిగా చూపిస్తున్నారు. దాంతో ఒక భాగానికి స్టాంపు డ్యూటీ మినహాయింపు పొందుతున్నారు.

న్యాయ వివాదాలు తలెత్తితే నష్టం వారికే..
వారసత్వ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉమ్మడి ఆస్తుల పంపిణీ చేస్తుండటంతో న్యాయ వివాదాలు కూడా పెరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఒకరికి ఎక్కువ వాటా ఇవ్వాలంటే ఆ మేరకు మిగిలిన వాటాదారులు తమ వాటాల్లోని భాగాన్ని ఎక్కువ వాటా పొందే వారికి చట్టబద్ధంగా బదిలీ చేయాలి. దానిపై 3 శాతం స్టాంపు డ్యూటీ చెల్లిస్తే అది చట్టబద్ధమైన బదలాయింపు అవుతుంది. కానీ.. ప్రస్తుతం తమ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి కదా అని ఒకరికి ఎక్కువ, మిగిలిన వారికి తక్కువగా ఆస్తుల రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. కానీ అది ఆస్తులను చట్టబద్ధంగా బదిలీ చేసినట్టు కాదు. భవిష్యత్‌లో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వస్తే.. తమకూ సమాన వాటా దక్కాల్సిందే అని మిగిలిన వాటాదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే చేయగలిగేదేమీ ఉండదు. ఎందుకంటే వాటాల బదిలీ చట్టబద్ధంగా జరగలేదు కాబట్టి వారసులందరికీ సమాన హక్కు సజీవంగా ఉన్నట్టే. రాష్ట్రంలో ఇలాంటి కేసులు లెక్కకు మించి న్యాయ వివాదాలు నమోదవుతూ ఉన్నాయి.

ఉమ్మడి ఆస్తి పంపిణీపై స్టాంపు డ్యూటీ నిబంధనలివీ.. 
► ఉమ్మడి ఆస్తిని విభజించి రిజిస్ట్రేషన్‌ చేసేప్పుడు దస్తావేజులో పేర్కొన్న పార్టీలు అందరూ ఉమ్మడి ఆస్తిలో వాటాదారులు కావాలి. వారి మధ్య ఆస్తిని సమ భాగాలుగా పంపిణీ చేస్తే.. అందులో ఒక భాగానికి స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇస్తారు.  
► మిగిలిన భాగాలకు రిజిస్ట్రేషన్‌ ఆస్తి విలువలో 1 శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాలి. కన్వేయన్స్‌ డీడ్‌ ద్వారా ఆస్తి పొందిన వారు 4 శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాలి. 
► హక్కు విడుదల (అంటే చట్టబద్ధ వారసులు తమ వాటాలో కొంత భాగాన్ని ఇతరులకు ఇస్తే) ద్వారా ఆస్తి పొందిన వారు 3శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాలి. 
► గిఫ్ట్‌/సెటిల్‌మెంట్‌ డీడ్‌ ద్వారా ఆస్తి పొందితే 2శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాలి.  

ఎగవేత సాగుతుందిఇలా..
ఉమ్మడి వారసత్వ ఆస్తి పంపిణీలో ఓ భాగానికి స్టాంపు డ్యూటీ మినహాయింపు నిబంధనను దుర్వినియోగం చేస్తూ స్టాంపు డ్యూటీని భారీగా ఎగవేస్తున్నారు. చట్టబద్ధ వారసులైన కుమారులు, కుమార్తెల మధ్య ఆస్తిని సమాన భాగాలుగా పంపిణీ చేయాల్సి ఉన్నా చేయడం లేదు. ఒకరికి ఆస్తిలో ఎక్కువ భాగం కేటాయిస్తున్నారు. ఆ పెద్ద భాగానికి స్టాంపు డ్యూటీ మినహాయింపు తీసుకుంటున్నారు. మిగిలిన భాగాలకు ఒక శాతం చొప్పున స్టాంపు డ్యూటీ చెల్లిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి నిబంధనల ప్రకారం స్టాంపు డ్యూటీ రావడం లేదు. వారసులు పరస్పర సమ్మతితో ఎక్కువ లేదా తక్కువ భాగాలు పంపిణీ చేసుకోవాలనుకుంటే ఎవరూ కాదనరు. కానీ.. నిబంధనల ప్రకారం సమానంగా పంపిణీ చేసుకుని.. ఎవరికి ఎక్కువ వాటా ఇవ్వాలి అనుకుంటున్నారో మిగిలిన వాటాదారులు తమ వాటా నుంచి ఆ మేరకు ఆస్తిని బదిలీ చేయాలి. అలా చేస్తే.. అది వారసత్వ హక్కును బదలాయించినట్టు అవుతుంది. ఆ మేరకు బదలాయించిన అదనపు ఆస్తి భాగంపై 3శాతం స్టాంపు డ్యూటీ  చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆ విధంగా చేయకపోవడంతో ప్రభుత్వం 3 శాతం స్టాంపు డ్యూటీని నష్టపోతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement