విజయవాడ : దస్తావేజు లేఖరుల ఆందోళనతో జిల్లాలో శుక్రవారం రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఆన్‌లైన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖరుల సంఘం ఆధ్వర్యాన రెండు రోజులపాటు నిర్వహించ తలపెట్టిన ఆందోళన కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. దస్తావేజు లేఖరులు విధులు బహిష్కరించి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దీంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో లావాదేవీలు నిలిచిపోయాయి.
విజయవాడ నగరంతోపాటు జిల్లాలోని 28 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. గన్నవరం, మచిలీపట్నం, గుడివాడ, నందిగామ, జగ్గయ్యపేట, నూజివీడు తదితర ప్రాంతాల్లో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు వెలవెలబోయాయి. రిజిస్ట్రేషన్స్ ప్రక్రియలో స్లాట్ బుకింగ్ విధానం ప్రవేశపెట్టవద్దని, ఆన్‌లైన్ వల్ల తాము జీవనోపాధి కోల్పోతామని దస్తావేజు లేఖరులు ఆందోళన వ్యక్తంచేశారు.
తమ నిరసన కార్యక్రమం శనివారం కూడా కొనసాగుతుందని దస్తావేజు లేఖరుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల హరికృష్ణ, విజయవాడ నగర నాయకుడు నేరెళ్ల నారాయణరావు తెలిపారు. తొలిరోజు తమ ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిందని చెప్పారు.
రిజిస్ట్రేషన్లు బంద్
Published Sat, Oct 18 2014 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM
Advertisement