Slot Booking
-
పత్తి విక్రయానికి స్లాట్ బుకింగ్
సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్‌కు సంబంధించి పత్తి పంట మార్కెట్లోకి వస్తోంది. రైతులు పత్తిని విక్రయించాలంటే గతంలో భారత పత్తి సంస్థ (సీసీఐ) కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షించేవారు. అయితే ఈ విషయంలో రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సీసీఐ అధికారులు తాజాగా ‘వాట్సాప్ టాప్ యాప్’ను రూపొందించారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖకు దీనిని అనుసంధానించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సీసీఐ కేంద్రాల కొనుగోళ్ల తాజా వివరాలను యాప్‌లో అందుబాటులో ఉంచుతారు. దీంతో రైతు ఎప్పు డు సరుకు తీసుకెళ్లాలనే సమాచారం నుంచి నగదు జమ వరకు సకల వివరాలు తెలుసుకోవచ్చు. ఏ రోజు, ఎప్పుడు మార్కెట్‌కు వెళ్లాలో నిర్ణయించుకుని, రైతులు దీని ద్వారానే స్లాట్ బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది.మార్కెట్, తేదీ, సమయం నిర్దేశించుకొని స్లాట్‌ను బుక్ చేసుకొని ఆ ప్రకారం మార్కెట్‌కు వెళితే సరిపోతుంది. కాగా, స్లాట్ బుకింగ్ సదుపాయాన్ని మాత్రం తొలుత పైలట్ ప్రాజెక్టుగా నిర్మల్ మార్కెట్లో అమలు చేయనున్నారు. అనంతరం ఇతర మార్కెట్లకు విస్తరించనున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం స్లాట్ బుకింగ్ సదుపాయం లేని జిల్లాల్లోని మార్కెట్లలో కొనుగోలు ప్రక్రియ, రద్దీ తదితర వివరాలను రైతులు తెలుసుకునేందుకు వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. 8897281111 నంబర్ వాట్సాప్ ద్వారా సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. హాయ్ అని వాట్సాప్‌లో మెసేజ్ పెడితే సమగ్ర సమాచారం మనముందు ఉంటుంది. అలాగే అత్యంత ముఖ్యమైనది.. ఆయా కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉండే సమయాన్ని వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అమ్మిన పంట మొత్తం రైతు ఖాతాలో జమ అయ్యేవరకు దీని ద్వారా వివరాలు తెలుసుకునే సదుపాయం కల్పించారు. 21.46 లక్షల మంది రైతుల వివరాలు నిక్షిప్తంవాట్సాప్ యాప్‌లో రైతులకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. ఆ యాప్‌లో 21,46,263 మంది పత్తి రైతుల వివరాలు ఉన్నాయి. కాగా, వ్యవసాయ శాఖ వద్ద వివరాలు నమోదు చేసుకున్న రైతులకే ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. రైతులు తమ వద్ద ఎంత పత్తి నిల్వ ఉంది? అనే వివరాలను తొలుత యాప్‌లో నమోదు చేయాలి. అప్పుడు స్థానిక సీసీఐ/జిన్నింగు మిల్లు పరిధిలో కొనుగోలుకు ఎంత సమయం పడుతుందో సమాచారం అందుతుంది. సీరియల్లో ఉన్న వాహనాల సంఖ్య, లోడింగ్, అన్లోడింగ్ వివరాలు కనిపిస్తాయి. పంటను విక్రయించిన తర్వాత తక్‌పట్టీ వివరాలు, ధరల వివరాలు, నగదు ఎన్ని రోజుల్లో జమ అవుతుందో కూడా తెలుసుకోవచ్చు. ‘యాప్’లో వివరాలు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులో ఉంటాయి. దీంతో రైతు తన పంటను ఇంటి దగ్గర్నుంచి తెచ్చుకుని వెంటనే అమ్ముకునే సౌలభ్యం కలుగుతుంది.వాట్సాప్ యాప్‌తో రైతులకు ప్రయోజనంవాట్సాప్ యాప్ ద్వారా పత్తి రైతులకు మరింత ప్రయోజనం ఉంటుంది. దీనిని ఈ ఏడాదే అందుబాటులోకి తీసుకువచ్చాం. నిర్మల్ మార్కెట్లోనైతే స్లాట్ బుకింగ్ సదుపాయం కూడా కల్పించాం. దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తాం. రైతులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి. – లక్ష్మణుడు, అడిషనల్ డైరెక్టర్, మార్కెటింగ్‌శాఖ -
సదరం ‘స్లాట్స్’ తిప్పలు!
దివ్యాంగులకు సదరం ‘స్లాట్స్’ తిప్పలు తప్పడం లేదు. వైకల్యం నిర్ధారణ పరీక్షలు నిర్వహించే సదరం శిబిరాలకు స్లాట్స్ అందని ద్రాక్షగా మారాయి. 15 రోజులకు ఒకసారి విడుదల చేస్తున్న స్లాట్స్ ఏ మూలకూ సరిపోని పరిస్థితి నెలకొంది. సాక్షి, హైదరాబాద్: నగరంలో ఐదు సదరం శిబిరాల కేంద్రాలు ఉన్నాయి. వివిధ కేటగిరీ వైకల్యాల నిర్ధారణ శిబిరాలు వారానికి ఒకసారి మాత్రమే నిర్వహిస్తుండటంతో దివ్యాంగులకు నిరీక్షణ తప్పడం లేదు. వాస్తవంగా శారీరక వైకల్యం, మానసిక రుగత్మ, వినికిడి లోపం, కంటి రుగత్మల లాంటి నాలుగు వైకల్యం నిర్ధారణ పరీక్షలు ప్రత్యేక శిబిరాల ద్వారా నిర్వహిస్తోంది. ఒక్కో వైకల్యానికి ఒక్కో కేంద్రాన్ని ప్రత్యేకంగా కేటాయించి వారంవారం శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. వికలత్వ నిర్ధారణ కోసం నాలుగు మెడికల్ బోర్డులు ఏర్పాటు చేసి శాశ్వత, తాత్కాలిక ప్రాతిపధికన సర్టిఫికెట్ జారీ చేస్తోంది. మానసిక వైక్యలం పరీక్షలకు రెండు కేంద్రాలు మాత్రమే నిర్వహిస్తోంది. నిలోఫర్ ఆస్పత్రిలో 18 సంవత్సరాల లోపు, ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో 18 సంవత్సరాల పై బడిన వారికి వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. మీ సేవా కేంద్రాల ద్వారా స్లాట్... కొత్తగా వైకల్య నిర్ధారణ పరీక్షలు కోసం మీ సేవా కేంద్రాల ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సదరం వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా ఆధార్ నెంబర్, వివరాలు నమోదుతో దరఖాస్తు చేసుకుంటే తేదీ, సమయం, కేంద్రంతో కూడిన స్లాట్ లభిస్తోంది. స్లాట్ ప్రకారం దరఖాస్తుదారులైన దివ్యాంగులు మీ సేవ కేంద్రం రసీదు, ఆధార్ జిరాక్స్, పాస్‌పోర్టు సైజు ఫొటో, మెడికల్ రిపోర్ట్స్‌తో సదరం కేంద్రానికి హాజరు కావాల్సి ఉంటుంది. స్లాట్ ప్రకారం సదరం క్యాంపునకు హాజరు కాకపోతే రెండు రోజుల తర్వాత తిరిగి మీ సేవా ద్వారా స్లాట్ బుక్ చేసు కోవచ్చు. సదరం కేంద్రంలో సంబంధిత వైద్య బందం పరీక్షలు నిర్వహించి వైకల్యాన్ని నమోదు చేస్తోంది. వైకల్యంపైనే... మెడికల్ బోర్టు ఆన్లైన్ వివరాలను పరిశీలించి వైకల్యాన్ని నిర్ణారించిన తర్వాతనే తాత్కాలిక, శాశ్వత ధ్రువీకరణ పత్రాల జారీపై నిర్ణయం తీసుకుంటారు. తాత్కాలిక ధ్రువీకరణ పత్రాలను ఒకటి, రెండు, మూ డు, నాలుగు సంవత్సరాల వరకు వర్తించేలా ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. తాత్కాలిక సదరం సర్టిఫికెట్ రెన్యువల్ కోసం కూడా తిరిగి స్లాట్ బుకింగ్ చేసుకొని వైకల్య నిర్ణారణ పరీక్షలు హాజరు కావాల్సి ఉంటుంది. రిజక్ట్ అయితే అంతేనా? క్యాంపులో సదరం సర్టిఫికెట్ జారీ చేయటంలో అప్లికేషన్ రిజక్ట్ అయితే మళ్లీ స్లాట్ సమస్యగా తయారైంది. మానసిక, ఇతర ఇబ్బందులున్న చిన్న పిల్లలు, సర్టిఫికెట్ టెస్టులు టైంలో సహకరించకపోవడంతో డాక్టర్ల టీమ్ రిజక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. -
Passport: పాస్‌పోర్టు కావాలనుకునే వారికి గుడ్‌న్యూస్..
సాక్షి, హైదరాబాద్: పాస్‌పోర్టు దరఖాస్తుదారులు స్లాట్ల కోసం ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అదనంగా 7,150 స్లాట్స్ విడుదల చేస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు 5,500 స్లాట్లు అదనంగా విడుదల చేశామని, అలాగే ఏప్రిల్ 29వ తేదీన శనివారం పాస్‌పోర్టు డ్రైవ్‌లో మరో 3,056 స్లాట్లు విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ ఇంకా దరఖాస్తుదారులు స్లాట్ల లభ్యతకు సుదీర్ఘకాలం వేచి చూడాల్సి వస్తుండటంతో అదనంగా 7,150 స్లాట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని బేగంపేట, అమీర్‌పేట్, టోలిచౌకితో పాటు కరీంనగర్, నిజామాబాద్‌లలోని పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో తత్కాల్, సాధారణ, పీసీసీల కోసం స్లాట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. అదనపు స్లాట్లను ప్రతి బుధ, శుక్రవారాల్లో సాయంత్రం 4.30కు విడుదల చేస్తామని వివరించారు. తమ అధికారిక పోర్టల్, ఎంపాస్పోర్ట్సేవా యాప్ ద్వారా షెడ్యులింగ్, రీ షెడ్యూలింగ్ చేసుకుని కొత్త తేదీల్లో స్లాట్లు పొందవచ్చని తెలిపారు. చదవండి: అక్రమ సిమ్‌కార్డుల దందాపై ఉక్కుపాదం.. మీ పేరు మీద ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసుకోండిలా..! -
10 నుంచి సదరం స్లాట్ బుకింగ్‌లు
సాక్షి, అమరావతి : సదరం సర్టిఫికెట్లు పొందేందుకు స్లాట్ బుకింగ్‌లు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్, మే, జూన్ నెలలకు స్లాట్లు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్లాట్లు బుక్ చేసుకున్న వారికి రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో 171 ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్థోపెడిక్, మానసిక, కంటి, ఈఎన్టీ వైద్యులు పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి శాశ్వత ధ్రువీకరణ పత్రాలిస్తారు. గతంలో ఏ జిల్లాకు చెందినవారు ఆ జిల్లాలోని ఆస్పత్రుల్లోనే స్లాట్ బుక్ చేసుకుని స్క్రీనింగ్‌కు హాజరుకావాల్సి ఉండేది. ఈ క్రమంలో విద్య, ఉపాధి, కుటుంబ అవసరాల నిమిత్తం సొంత జిల్లాలను విడిచి వేరే జిల్లాల్లో నివసించేవారు సదరం సర్టీ ఫికెట్ పొందేందుకు సొంత జిల్లాకు వెళ్లాల్సి వచ్చేది. ఇది వ్యయప్రయాసలతో కూడుకున్న ప్రక్రియ. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం రాష్ట్రంలోని ఏ జిల్లాలో అయినా సదరం స్క్రీనింగ్‌కు హాజరై సర్టీ ఫికెట్ పొందేందుకు ప్రభుత్వం గతేడాది జూలై నుంచి అవకాశం క ల్పించింది. -
పాస్‌పోర్టు.. నెలలకొద్దీ లేటు!
సాక్షి, హైదరాబాద్: ఏదో అత్యవసరమై విదేశాలకు వెళ్లాలి.. అందుకు పాస్‌పోర్టు కావాలి.. దరఖాస్తు చేసుకుందామనుకుంటే నెలా నెలన్నర దాకా స్లాట్‌కే దిక్కులేదు. స్లాట్ దొరికి పాస్‌పోర్టు కేంద్రంలో హాజరైనా.. ప్రక్రియ ముగిసి పాస్‌పోర్టు చేతికి వచ్చేదాకా మరింత ఆలస్యం. కరోనా సమయంలో ఇండియాకు తిరిగి వచ్చిన ఉద్యోగులు, విదేశాల్లో చదువుకోసం వెళ్లాల్సిన విద్యార్థులు, తమ కుటుంబ సభ్యులను చూసుకునేందుకు వెళదామనుకున్నవారు.. ఇలా ఎందరో దీనివల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సమయం చిక్కిందికదా అని విహారయాత్రకు వెళ్దామనుకునే వారికి కూడా వీసాలు దొరికినా.. పాస్‌పోర్టు కోసం స్లాట్లు దొరకని పరిస్థితి. కోవిడ్ సమయంలో దాదాపు ఏడాదిన్నర పాటు పాస్‌పోర్టు కోసం పెద్దగా దరఖాస్తులు రాలేదని.. ఇప్పుడు పరిస్థితి చక్కబడటంతో భారీగా దరఖాస్తు చేసుకుంటుండటమే ఇబ్బందికి కారణమని రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయవర్గాలు చెప్తున్నాయి. తత్కాల్ నెల.. సాధారణం నెలన్నర.. ఉమ్మడి రాష్ట్రంలో పాస్‌పోర్టు కోసం రెండు, మూడు నెలలు ఎదురుచూడాల్సి వచ్చేది. తెలంగాణ ఏర్పాటయ్యాక వారం, పదిరోజుల్లో పాస్‌పోర్టు చేతికి అందింది. కానీ మళ్లీ ఇప్పుడు పరిస్థితి మొదటికి వచ్చింది. అసలు పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసి, స్లాట్ కోసమే నెలా నెలన్నర రోజులు వేచి చూడాల్సి వస్తోంది. ఇప్పుడు సాధారణ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకుంటే.. జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో స్లాట్ కేటాయిస్తున్నారు. దీనివల్ల సాధారణ పాస్‌పోర్టు దరఖాస్తుదారులు అనుకున్న సమయంలో వెళ్లాల్సిన ప్రదేశాలకు, హాజరుకావాల్సిన కార్యక్రమాలకు పోలేక ఇబ్బంది పడుతున్నారు. ఇక తత్కాల్ విధానంలో, రెన్యువల్ కోటా కింద పాస్‌పోర్టుకు దరఖాస్తు చేస్తే.. నెల రోజుల తర్వాత స్లాట్ కేటాయిస్తున్నారు. దీనివల్ల వీసా ఉండి ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సినవాళ్లు ఇబ్బందిపడుతున్నారు. అత్యవసరంగా కావాల్సినవారు నానా ఇబ్బందులు పడి ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు, ఎంపీలు, మంత్రులు, ఇతర వీవీఐల సిఫార్సు లేఖల ద్వారా వారం, పదిరోజుల్లో పాస్‌పోర్టు స్లాట్‌ను పొందగలుతున్నారు. కరోనా ప్రభావంతోనే..! పాస్‌పోర్టు స్లాట్ కేటాయింపుల సమయం నెలన్నర వరకు ఉండటానికి ప్రధాన కారణం కరోనా ప్రభావమేనని పాస్‌పోర్టు కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. రెండేళ్ల పాటు కరోనా ప్రభావం వల్ల దరఖాస్తులు పెద్దగా రాలేదని.. రెన్యువల్ కోసమూ దరఖాస్తులు అందలేదని అంటున్నాయి. ఇప్పుడు ఒక్కసారిగా అంతా దరఖాస్తు చేసుకుంటుండటంతో రద్దీ పెరిగిందని, రోజూ వందల స్లాట్లు ఇస్తున్నా సరిపోవడం లేదని పేర్కొంటున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టడం, విదేశాలు మళ్లీ గేట్లు ఓపెన్ చేయడంతో ఒకేసారి రద్దీ పెరిగిందని వెల్లడిస్తున్నాయి. పాస్‌పోర్టు సేవా కేంద్రాల వారీగా ప్రతిరోజు కేటాయిస్తున్న స్లాట్లు సరిపోవడం లేదని పాస్‌పోర్టు ఆఫీస్ వర్గాలు వెల్లడించాయి. ఆయా సేవా కేంద్రాల వారీగా స్లాట్ల వివరాలు పరిశీలిస్తే.. రెండు రోజుల్లో ఎస్బీ విచారణ గతంలో పాస్‌పోర్టు జారీకి సంబంధించి పోలీసుశాఖ స్పెషల్ బ్రాంచ్ విచారణ ప్రక్రియ ఆలస్యమయ్యేది. కానీ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎస్బీ విచారణ రెండు, మూడు రోజుల్లోనే పూర్తవుతోంది. వారం, పది రోజుల్లోగా దరఖాస్తుదారుడి చేతికి పాస్‌పోర్టు అందేది. ఇప్పుడు కూడా ఎస్బీ విచారణ త్వరగా పూర్తవుతున్నా.. పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో సిబ్బంది కొరతతో ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. అరకొర సిబ్బందితో పెద్ద సంఖ్యలో దరఖాస్తులను క్లియర్ చేయడం కష్టమవుతోందని, సిబ్బంది సంఖ్య పెరిగితే త్వరగా ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెప్తున్నారు. ఫోన్లు పనిచేయడమే లేదు.. పాస్‌పోర్టు జారీ ప్రక్రియలో సమస్యలు, కారణాలపై వివరణ కోరేందుకు ‘సాక్షి’ప్రతినిధులు రీజనల్ పాస్‌పోర్టు అధికారి (ఆర్పీవో)ను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయ వెబ్సైట్లో ఉన్న రెండు ల్యాండ్ లైన్ నంబర్లలో సంప్రదించే ప్రయత్నం చేసినా.. ఆ నంబర్లు పనిచేయడం లేదని సమాధానం వచ్చింది. దరఖాస్తుదారులు కూడా ఈ తీరుతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెన్యువల్ కోసం నెల నుంచి ప్రయత్నిస్తున్నా.. నేను యూఎస్ వెళ్లాల్సి ఉంది. నాకు వీసా ఉంది. కానీ పాస్‌పోర్టు వ్యాలిడిటీ జూలైతో ముగుస్తోంది. ట్రావెల్ చేయాలంటే పాస్‌పోర్టు వ్యాలిడిటీ ఆరు నెలలకు తక్కువ కాకుండా ఉండాలి. రెన్యూవల్ కోసం ఏప్రిల్ తొలివారంలో ఆన్లైన్లో దరఖాస్తు చేశాను. జూన్ñ మధ్యవారంలో స్లాట్ ఇచ్చారు. స్లాట్ కోసమే రెండున్నర నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది. – మహ్మద్ అబ్దుల్, హైదరాబాద్ కరోనా సమయంలో వచ్చా.. వెళ్లాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి.. నేను కరోనా సమయంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకునేందుకు అమెరికా నుంచి వచ్చాను. వర్క్ ఫ్రం హోం అవకాశం ఉండటంతో ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు మళ్లీ వెళ్లాలి. పాస్‌పోర్టు రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంది. తత్కాల్లో రెన్యూవల్‌కు మే మొదటి వారంలో దరఖాస్తు చేశా.. జూలై మొదటి వారంలో స్లాట్ ఇచ్చారు. నేను ఈ నెలలోనే వెళ్లాల్సి ఉంది. – సత్య, ఈసీఐఎల్, హైదరాబాద్ -
వాట్సాప్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్
సాక్షి, వెబ్‌డెస్క్ : వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్‌ను మరింత సులభతరం చేసింది కేంద్రం. దీని ప్రకారం ఇకపై వ్యాక్సిన్ స్టాట్ బుకింగ్ కోసం కోవిన్ యాప్, వెబ్పోర్టల్లకు వెళ్లాల్సిన పని లేదు. థర్డ్ పార్టీ యాప్‌లను వినియోగించాల్సిన అవసరం లేదు. వాట్సాప్ ద్వారానే ఈ పనిని సుళువుగా చేసేయొచ్చు. ఎక్కువ మందికి చేరువగా స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరి ఫోన్లో వాట్సాప్ కామన్‌గా మారింది. ఎంట్రీ లెవల్ ఫోన్లలోనూ వాట్సాప్ ఉంటోంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైతం వాట్సాప్‌ను వినియోగడంలో పట్టు పెంచుకున్నారు. దీంతో వాట్సాప్ ద్వారా వాక్సిన్ స్లాట్ బుకింగ్‌కు కేంద్రం అవకాశం కల్పించింది. వాట్సాప్ అయితేనే వాట్సాప్ ద్వారా కరోనా హెల్ప్ డెస్క్‌ని ఈ ఏడాది మార్చిలో కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల ప్రారంభం నుంచి వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్‌లోడ్‌కి అవకాశం కల్పించింది. ఇప్పటికే ఈ హెల్ప్‌డెస్క్ నుంచి 31 లక్షల మంది వ్యాక్సిన్ సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఇతర ఆప్షన్ల కంటే వాట్సాప్ ద్వారా ఎక్కువ మంది అత్యంత వేగంగా వ్యాక్సిన్ సర్టిఫికేట్టు డౌన్లోడ్ చేసుకున్నట్టు కేంద్రం గుర్తించింది. దీంతో వాట్సాప్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్‌కి అవకాశం కల్పించింది. 9013151515 వాట్సాప్ ద్వారా వ్యాక్సిన్ బుకింగ్ చేసుకోవడానికి మైగవ్ కరోనా హెల్ప్ డెస్క్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ పద్దతులు పాటించాలి. - మీ మొబైల్ నంబరులో 9013151515 నంబరు సేవ్ చేసుకోవాలి. ఇదే నంబరుకు బుక్ స్లాట్ అని ఇంగ్లిష్‌లో టైప్ చేసి మెసేజ్ పంపాలి. - ఆరు అంకెల ఓటీపీ నంబరు మీ మొబైల్‌కి వస్తుంది. మూడు నిమిషాల్లోగా ఓటీపీ నంబర్ ఎంటర్ చేయాలి - ఆ నంబరు ఆధారంగా ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాలను బట్టి మనకు వివిధ ఆప్షన్లు వస్తాయి. అందులో మొదటి డోసు ఎప్పుడు ఇచ్చారు, రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాలు ఉంటాయి - హెల్ప్ డెస్క్ మెనూలో కుటుంబ సభ్యుల్లో ఎవరి పైరునైనా చేర్చాలా , దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ సెంటర్ వివరాలు ఇలా వివిధ ఆప్షన్లకు 1, 2 ,3 ఇలా 8 వరకు నంబర్లు కేటాయించారు. మన అవసరానికి తగ్గట్టు నంబరును రిప్లై ఇస్తే దానికి తగ్గట్టుగా ఆప్షన్లు వస్తాయి. - ఈ హెల్ప్‌లైన్ డెస్క్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవడంతో పాటు కరోనాకు సంబంధించి ఇతర సమాచారాన్ని కూడా తెలుసుకునే వీలుంది. చదవండి: IKEA : కొత్తగా సిటీ స్టోర్లు.. ప్రైస్‌వార్‌కి రెడీ -
Corona Vaccine: టీకా కటకట
వనస్థలిపురానికి చెందిన డి.నర్సింగ్‌రావు మే 27న కోవాగ్జిన్ టీకా మొదటి డోసు తీసుకున్నాడు. 4 నుంచి 6 వారాల గడువులో రెండో డోసు తీసుకోవాల్సి ఉంది. దీంతో కొన్ని రోజులుగా టీకా కోసం ప్రయత్నిస్తున్నాడు. ఎక్కడా దొరకలేదు. ఈ నెల 15న ఆఫీసుకు సెలవు పెట్టి స్థానిక ప్రాంతీయ ఆస్పత్రి సమీపంలోని టీకా కేంద్రం వద్ద క్యూలైన్లో నిల్చున్నాడు. సిబ్బంది పరిమిత సంఖ్యలోనే టోకెన్లు ఇవ్వడంతో ఆయన వెనుదిరగాల్సి వచ్చింది. టీకా కేంద్రాల కోసం గాలిస్తూ నాగోల్ సమీపంలోని మరో కేంద్రానికి వెళ్లగా.. అక్కడా పెద్ద క్యూ కన్పించింది. చివరకు కొత్తపేట్‌లోని ఓ కేంద్రం వద్ద సాయంత్రం వరకు వేచి చూసి, ఆరు వారాల గరిష్ట గడువు ముగిసిన వారం రోజుల తర్వాత రెండో డోసు టీకా పొందాడు. సాక్షి, హైదరాబాద్: కోవిడ్ టీకాల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అర్హులు మొదటిడోసు కోసం వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెల్లువెత్తుతు న్నారు. మరోవైపు మొదటి డోసు అనంతరం గడువులోగా రెండో డోసు వేయించుకునేందుకు వస్తున్న వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటున్నారు. మొ త్తం మీద రాష్ట్రంలోని పలు వ్యాక్సినేషన్ కేంద్రాలకు గత నాలుగైదు రోజులుగా జనాల తాకిడి తీవ్రంగా పెరగ్గా.. వచ్చిన వారందరికీ టీకాలు వేయలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ప్రధానంగా వేస్తున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు ఏది వేసుకోవాలన్నా ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ముఖ్యంగా కోవాగ్జిన్ టీకాలకు తీవ్ర కొరత ఏర్పడింది. 1,035 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రస్తుతం రాష్ట్రంలో 1,035 కేంద్రాల్లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో 958 కేంద్రాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహిస్తూ ఉచితంగా టీకాలు పంపిణీ చేస్తోంది. మరో 77 కేంద్రాలను ప్రైవేటు ఆస్పత్రులు నిర్వహిస్తూ ఫీజులు తీసుకుని వ్యాక్సిన్ అందిస్తున్నాయి. రాష్ట్రంలో మే నెలలో టీకాల పంపిణీ ఊపందుకోగా.. కోవాగ్జిన్ టీకాలు తీసుకున్న వారంతా ఇప్పుడు రెండోడోసు కోసం దిక్కులు చూస్తున్నారు. కేంద్రం నుంచి పరిమితంగానే వ్యాక్సిన్లు అందుతుండడంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంటర్లకు పంపిణీలో ఇబ్బందులు వస్తున్నాయి. రెండో డోసుకు డిమాండ్ ప్రస్తుతం రెండో డోసు టీకాకు డిమాండ్ పెరిగింది. రాష్ట్రంలో రోజుకు సగటున 1.5 లక్షలకు పైగా టీకాలు పంపిణీ చేస్తుండగా.. మొదటి, రెండో డోసుల నిష్పత్తి 40:60 శాతంగా ఉంటోంది. ప్రస్తుతం కోవీషీల్డ్ టీకాల కొరత తీవ్రంగా ఉందని చెబుతున్నారు. ఇప్పటివరకు 1,31,47,311 టీకాలు రాష్ట్రంలో ఇప్పటివరకు 1,31,47,311 టీకా డోసులు పంపిణీ చేశారు. ఇందులో మొదటి డోసు 1,08,32,712 తీసుకోగా, రెండోడోసు కింద 23,14,599 పంపిణీ చేశారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకాల్లో 1,06,08,692 డోసులను రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ ఉచితంగా పంపిణీ చేయగా, 25,38,619 డోసులు ప్రైవేటు కేంద్రాల్లో పంపిణీ చేశారు. స్లాట్ బుకింగ్ లేక.. వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్రం మొదట్లో కోవిన్ యాప్, వెబ్‌సైట్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. టీకాలు పొందాలనుకున్న వారు యాప్‌లో ఆధార్ నంబర్, ఇతర వివరాలను ఎంట్రీ చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. దీంతో పరిమిత సంఖ్యలో టీకాల పంపిణీకి వీలుండేది. కానీ ప్రస్తుతం యాప్, వెబ్సైట్లో స్లాట్ బుకింగ్‌లు కేవలం ప్రైవేటు కేంద్రాలకే పరిమితమయ్యాయి. టీకా కోసం నేరుగా కేంద్రాల వద్దకే వెళ్లొచ్చునని కేంద్రం ప్రకటించింది. దీంతో ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద లబ్ధిదారులు నేరుగా వివరాలను సమర్పించి టీకా డోసులు పొందుతున్నారు. ఈ కారణంగా చాలాచోట్ల వ్యాక్సినేషన్ కేంద్రాలు జనాలతో కిటకిటలాడుతున్నాయి. స్పష్టమైన గడువు, డోసు తీసుకున్న తర్వాత ఎన్నిరోజులు పూర్తయ్యాయి అనే అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా క్యూలైన్లో వచ్చిన వారికి టీకాలు ఇసున్నారనే విమర్శలున్నాయి. దీంతో కొందరికి గడువు దాటినా టీకాలు అం దకపోగా.. మరికొందరు ముందుగానే టీకాలు పొందుతున్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద అంతా గందరగోళంగా ఉంటోంది. -
వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్‌కు మరో మార్గం ?
వెబ్‌డెస్క్ : కోవిన్ యాప్‌తో పాటు ఇతర ప్రైవేటు అప్లికేషన్ల ద్వారా కూడా త్వరలో వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. పేటీఎం, మేక్ మై ట్రిప్‌తో పాటు మరికొన్ని సంస్థలు వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ప్రభుత్వానికి సహాకరించేందుకు ముందుకు వచ్చాయంటూ రాయిటర్స్ సంస్థ కథనం ప్రచురించింది. థర్డ్‌పార్టీ టీకా రిజిస్ట్రేషన్‌లో ఎదురవుతున్న సమస్యలు తీర్చేందుకు కేంద్రం మరో ముందడుగు వేసింది. టీకా రిజిస్ట్రేషన్ సేవల్లో ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు గత నెలలలో ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో పాల్గొనేందుకు పలు ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపించాయి. అపోలో, మాక్స్ వంటి ఆస్పత్రులతో పాటు మేక్ మై ట్రిప్, 1 మిల్లీగ్రామ్, పేటీఎం, ఇన్ఫోసిస్ తదితర మొత్తం 15 సంస్థలు ఈ సేవలు ప్రారంభించే అవకాశం ఉందని రాయిటర్స్ పేర్కొంది. సహాయకారిగా మేక్ మై ట్రిప్ సీఈవో రాజేశ్ మాగౌ మాట్లాడుతూ వ్యాక్సిన్ బుకింగ్ చేసుకునేందుకు ప్రజలకు సహయకారిగా ఉండాలని నిర్ణయించామని, అందుకే మేక్ మై ట్రిప్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ సేవలకు ముందుకు వచ్చామని వివరించారు. అయితే ఈ అంశంపై స్పందించేందుకు పేటీఎం,అపోలో, మాక్స్ నిరాకరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. పేటీఎంకి వెబ్‌సైట్‌కి పది కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. మేక్ మై ట్రిప్ అప్లికేషన్‌కి 1.20 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. చదవండి: కోవిడ్ టీకా డోస్‌ల వృథాలో జార్ఖండ్ టాప్ -
టీకా స్లాట్ బుక్ చేసినా.. తిప్పలు తప్పట్లేదు
సాక్షి,కుత్బుల్లాపూర్( హైదరాబాద్) : నానా పాట్లు పడి స్లాట్ బుక్ చేసుకుని వ్యాక్సిన్ సెంటర్లకు వెళ్తే అక్కడ గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఒక సెంటర్లో వ్యాక్సిన్ వేయించుకొనేందుకు స్లాట్ తీసుకొని వెళ్తే, అక్కడ టోకెన్లు ఇచ్చి తర్వాత లోపలికి పంపిస్తున్నారు. మరో సెంటర్ వద్ద స్లాట్‌లోని టైమింగ్‌తో సంబంధం లేకుండా క్యూలో నిలబడాలని చెప్తున్నారు. దీంతో వ్యాక్సిన్ కోసం వచ్చినవారు నానా అవస్థలు పడుతున్నారు. ► వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోవడంతో టీకా కోసం వచి్చన వారు తమ వంతు వచ్చేంత వరకు చెట్లనీడలో, సమీపంలోని దుకాణాల మెట్లపై, ఎండలోనూ ఉసూరుమంటూ వేచి ఉండాల్సి వస్తోంది. ► ఒక షాపూర్‌నగర్ సెంటర్లో టెంట్ వేసినప్పటికీ అది సరిపోకపోవడంతో వచి్చనవారు ఎండలు నిరీక్షించాల్సి వస్తోంది. ► ఆరోగ్య కేంద్రం వద్ద చెట్టు కింద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ► గాజులరామారం సెంటర్ వద్ద లోపలికి వెళ్లడానికి జనం పోటీ పడుతుండటంతో ఒక్కొక్కరిని సిబ్బంది లోపలికి పంపిస్తున్నారు. కష్టాలు తప్పడం లేదు నేను మా అమ్మకు వ్యాక్సిన్ వేయించడానికి ప్రైవేట్ హాస్పిటల్లో స్లాట్ బుక్ చేశా. అది క్యాన్సిల్ అయిందని మెసేజ్ రావడంతో మళ్లీ స్లాట్ బుక్ చేసుకుంటే కుత్బుల్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దొరికింది. తీరా ఇక్కడి వస్తే.. టోకెన్లను తీసుకోవాలని చెప్పారు. దీంతో టోకెన్ల కోసం పోటీ పడాల్సి వస్తోంది. స్లాట్ దొరకటం ఒక ఎత్తయితే, ఇక్కడ టోకెన్ పొంది లోపలికి వెళ్లడం మరో ప్రయాసగా మారుతోంది. కూర్చోవడానికి సదుపాయం లేకపోవడంతో వ్యాక్సిన్ కోసం గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. ఈ చెట్ల కింద కుర్చీలు ఏర్పాటు చేస్తే పెద్దవారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ విషయమై అధికారులు ఆలోచించాలని కోరుతున్నా. – నన్ను, న్యూవివేకానంద్నగర్ ( చదవండి: కరోనా: మాత్రలు వద్దు.. పౌష్టికాహారమే ముద్దు ) -
స్లాట్ బుకింగ్: మొరాయిస్తున్న వెబ్సైట్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ఆపాల్సిన అవసరం లేదని తెలంగాణ హై కోర్టు ప్రకటించిన సంగతి తేలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ప్రస్తుతానికి స్లాట్ బుక్ చేసుకుని పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగించాలని సూచించారు. మరి కొద్ది సేపట్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్లాట్ బుకింగ్ ప్రక్రియను సీఎస్ సోమేష్ కుమార్ ప్రారంభించనున్నారు. ఈనెల 14 నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే రిజిస్ట్రేషన్లకు అనుమతి లభించింది. (చదవండి: వ్యవసాయేతర ‘రిజిస్ట్రేషన్లు’ షురూ..) ఇక పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లకు ఏర్పాట్లు చేసినప్పటికి ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. స్లాట్ బుక్ చేసుకోవడంలోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. స్లాట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ మొరాయిస్తుందని జనాలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
సొంత బండే సో బెటరు
సాక్షి, సిటీబ్యూరో: సగటు జీవికి లాక్డౌన్ అనేక పాఠాలను నేర్పించింది. ఇల్లుకదలకుండా చేయడమే కాదు..నిబంధనలను సడలించిన తర్వాత కూడా బయటకు వెళ్లేందుకు అవకాశం లేకుండా చేసింది. లాక్డౌన్ సడలింపులతో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో కార్యకలాపాలు తిరిగి మొదలయ్యాయి. వర్తక వాణిజ్యాలు ఊపందుకున్నాయి. కానీ స్తంభించినప్రజారవాణా కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. సిటీ బస్సులు, మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్ సర్వీసులు ఇప్పట్లో తిరిగి పట్టాలెక్కేఅవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు బస్సుల్లో, రైళ్లలో ప్రయాణం చేయడం వల్ల కరోనా వ్యాపించే ప్రమాదం ఉందనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో సిటీజనులు సొంత వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, మధ్యతరగతికి చెందిన వర్గాలు లాక్డౌన్ సడలింపులతో ఆటోమొబైల్ షోరూమ్‌ల వైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో కొద్ది రోజులుగా వాహనాల అమ్మకాలు పెరిగాయి.ప్రత్యేకించి ద్విచక్రవాహనాలకు గిరాకీ ఎక్కువగా ఉంది. దీంతో ఆర్టీఏ కార్యాలయాల్లోనూ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. గ్రేటర్లో సుమారు 10 వేల కొత్త వాహనాలు.. వాహనాల అమ్మకాలు బాగా తగ్గిపోయి ఆటోమొబైల్ రంగంలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో లాక్డౌన్ పిడుగుపాటుగా మారింది. దీంతో మార్చి 22 నుంచి మే రెండో వారం వరకు అన్ని రకాల వాహనాల అమ్మకాలు నిలిచిపోయాయి. షోరూమ్‌లు మూసివేశారు. ప్రభుత్వం దశలవారీగా లాక్డౌన్ నిబంధనలను సడలించింది. మొదట రవాణాశాఖ కార్యకలాపాలకు అనుమతినిచ్చారు. ఆ తరువాత ఆటోమొబైల్ షోరూమ్‌లు తెరిచేందుకు అవకాశం ఇవ్వడంతో మే నెల 16వ తేదీ తర్వాత తిరిగి అమ్మకాలు మొదలయ్యాయి. లాక్డౌన్ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న సగటు వేతన జీవులు సొంత వాహనాల వైపే మొగ్గుచూపారు. ‘లాక్‌డౌన్‌కు ముందు సొంత వాహనం కంటే సిటీ బస్సుల్లోనో, మెట్రో రైళ్లలోనో ప్రయాణం చేసి ఖర్చు తగ్గించుకోవాలనుకున్న వారు ఇప్పుడు అప్పు చేసైనా సరే సొంతంగా ఒక వాహనం కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణం భారంగా మారడం కూడా ఇందుకు కారణం.’ అని తెలంగాణ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాంకోటేశ్వర్‌రావు అభిప్రాయపడ్డారు. లాక్డౌన్ ఆంక్షలను సడలించిన అనంతరం వాహనాల అమ్మకాలు 25 నుంచి 30 శాతం నమోదైనట్లు పేర్కొన్నారు. ఇందులో టూవీలర్స్ అమ్మకాలే ఎక్కువగా ఉన్నాయి. రవాణాశాఖ లెక్క ల ప్రకారం గత నెల 16 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో 11,570 వాహనాలు తాత్కాలికంగా నమోదు కాగా, వాటిలో సుమారు 10 వేల వరకు ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. రెండు నెలల పాటు లాక్డౌన్ కారణంగా అన్ని రకాల కార్యకలాపాలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు చాలామంది బైక్‌లు కొనుగోలుకు ముందుకు రావడం గమనార్హం. లాక్డౌన్ సడలింపులతో బ్యాంకుల నుంచి తేలిగ్గా రుణాలు లభించడం, ప్రజారవాణా పట్టాలు ఎక్కకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని రవాణా అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రజారవాణా వాహనాలను వినియోగించడం వల్ల కరోనా వ్యాప్తి చెందవచ్చనే ఆందోళన కూడా కారణమే. దీంతో చాలామంది ఆటోలు, క్యాబ్‌లను వినియోగించేందుకు కూడా వెనుకడుగు వేస్తున్నారు. ఆర్టీఏ కేంద్రాల్లో పెరిగిన స్లాట్లు.. కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని వాహనాల రిజిస్ట్రేషన్లు, లెర్నింగ్ లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్సులు వంటి వివిధ రకాల పౌరసేవల కోసం పరిమితంగా స్లాట్లు అందుబాటులోకి తెచ్చిన రవాణాశాఖ కొద్ది రోజులుగా వీటి సంఖ్యను పెంచింది. గతంలో ఒక్కో కార్యాలయంలో కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ల కోసం 30 నుంచి 50 స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో ఉన్న డిమాండ్ మేరకు 80 నుంచి 100 స్లాట్ల వరకు పెంచారు. వాహన వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు స్లాట్లను అంచనా వేస్తూ పెంచుతున్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో రోజుకు 1000 వాహనాల వరకు నమోదు చేసే అవకాశం ఏర్పడింది. మరోవైపు ఆన్లైన్లోనే అన్ని రకాల అనుమతులను పొందే సదుపాయాన్ని కూడా త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు రవాణాశాఖ చర్యలు చేపట్టింది. -
స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బుకింగ్
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ మినహాయింపుతో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన రిజిస్ట్రేషన్ శాఖ, స్థిరాస్తుల నమోదు ప్రక్రియ కోసం దరఖాస్తుదారులకు మరింత వెసులుబాటు కల్పించే విధంగా చర్యలు చేపట్టింది. ఆన్లైన్లో స్లాట్ బుకింగ్‌తో పాటు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు వెళ్లడానికి అనుమతి పత్రం (పాస్) సౌకర్యం కూడా కల్పిస్తోంది. స్థిరాస్తి దస్తావేజుల నమోదు కోసం నిర్ణయించుకున్న సమయం ప్రకారం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న సమయంలో సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్లడానికి పాస్ కూడా ఆన్లైన్లో లభిస్తుంది. స్థిరాస్తి రిజిస్ట్రేషన్ చేసుకునే దరఖాస్తుదారులు ముందుగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్సైట్ registration. telangana.gov.in లో పబ్లిక్ డాటా ఎంట్రీ ద్వారా డాక్యుమెంట్స్ వివరాలను నమోదు చేసుకోవాలి. స్థిరాస్తి క్రయవిక్రయదారులు తమ మధ్య గల షరతులు, నిబంధనలను కచ్చితంగా పొందుపరచడం ద్వారా భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేయించుకునే ఆస్తి విలువ ప్రకారం స్టాంప్ డ్యూటీని ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు మినహా ఇతర రుసుం చెల్లించాల్సిన అవసరం ఉండదు. స్టాంపు డ్యూటీ తదితర సుంకాలను పూర్తిగా ఆన్లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది. క్రయవిక్రయదారులు అనుకూలమైన సమయాన్ని నిర్ణయించుకొని ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే స్థిరాస్తికి సంబంధించిన ఈసీ, దస్తావేజు నఖలు పత్రాలను కూడా ఆన్లైన్ ద్వారా పొందే అవకాశాన్ని రిజిస్ట్రేషన్ శాఖ కల్పించింది. రిజిస్ట్రేషన్ శాఖ registration. telangana.gov.in వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో రుసుము చెల్లించి పొందవచ్చు. ఐదుగురికి మాత్రమే అనుమతి కరోనా కట్టడిలో భాగంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఒక స్థిరాస్తి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌కు కేవలం ఐదుగురు సభ్యులను మాత్రమే అనుమతించనున్నారు. రిజిస్ట్రేషన్‌కు రిజిస్ట్రేషన్‌కు మధ్య కొంత సమయం తీసుకునే విధంగా చర్యలు చేపట్టారు. ఆస్తిని కొనుగోలు చేసేవారు, అమ్మేవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నా.. స్లాట్ ప్రకారం ఒకసారి కేవలం ఐదుగురిని మాత్రమే సబ్‌రిజిస్ట్రార్ వద్దకు అనుమతించి.. తర్వాత మరో ఐదుగురిని పంపిస్తారు. కార్యాలయంలోకి ప్రవేశించే సమయంలో, రిజిస్ట్రేషన్ సంతకాలు, ఫొటోగ్రఫీ సందర్భంగా శానిటైజర్‌ను ఉపయోగించడం తప్పనిసరి. మాస్కులు లేనిదే లోపలికి అనుమతించరు. కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టారు. -
తిరుపతివాసులకు వెంకన్న సులభ దర్శనం
సాక్షి, తిరుమల: తిరుపతివాసులకు శుభవార్త. తిరుమల వేంకటేశ్వర స్వామివారి దర్శనాన్ని స్థానికులూ సులభంగా పొందే అవకాశం కలగనుంది. టైంస్లాట్ సర్వదర్శనం విధానాన్ని తిరుపతిలోనూ ప్రారంభించేందుకు టీటీడీ సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి లేదా మార్చి నుంచి తిరుమల, తిరుపతిలో శాశ్వత ప్రాతిపదికన టైం స్లాట్ సర్వదర్శనం అమలుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో టైం స్లాట్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. తిరుచానూరులోనూ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఫిబ్రవరి మూడోవారం లేదా మార్చి నుండి పూర్తిస్థాయిలో కౌంటర్లు ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. ఇదిలా ఉండగా స్థానిక ఆలయాల సందర్శనకు భక్తులు తమ ఆధార్‌కార్డు చూపించి సులభంగా టికెట్లు పొందవచ్చు. కేటాయించిన సమయాన్నిబట్టి శ్రీకాళహస్తి, కాణిపాకం, ఇతర స్థానిక ఆలయాలు సందర్శించే అవకాశం ఉంది. 1999లో రూ.50 సుదర్శన టికెట్ల విధానం సందర్భంలో భక్తులు జిల్లాలోని స్థానిక ఆలయాలు సందర్శించేవారు. -
పాస్‌పోర్ట్.. ఇంకా సులువు
మర్రిపాలెం(విశాఖ పశ్చిమ): అన్ని వర్గాల ప్రజలు పాస్‌పోర్ట్ సేవలను సులభంగా పొందేలా ప్రభుత్వం విస్తృత అవకాశాలు కల్పించిందని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారి (పీవో) ఎన్.ఎల్.పి.చౌదరి తెలిపారు. పాస్‌పోర్ట్ సేవలను ప్రజలు సకాలంలో పొందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఒకటి లేదా రెండు రోజుల వ్యవధిలో స్లాట్ బుకింగ్ అందుబాటులో ఉంటోందన్నారు. ఎనిమిదేళ్ల లోపు బాలలు, 60 ఏళ్లకు పైబడిన వృద్ధులకు 10 శాతం ఫీజులో రాయితీని ప్రభుత్వం ప్రకటించిన విషయం ప్రస్తావించారు. పాస్‌పోర్ట్ సేవలకు సంబంధించి గత ఏడాది ప్రగతి, భవిష్యత్ ప్రణాళికను ‘సాక్షి’కి వివరించారు. 2017లో కార్యాలయ పరిధిలో 3,49,576 పాస్‌పోర్ట్‌లు మంజూరు చేశామన్నారు. 19,538 పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇచ్చామన్నారు. సాధారణ పాస్‌పోర్ట్ మంజూరు సగటున 10 నుంచి 15 రోజుల వ్యవధిగా ఉందని, తత్కాల్ పాస్‌పోర్ట్ సేవలు ఒకటి నుంచి మూడు రోజుల్లో అందుతున్నాయని చెప్పారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్ట్’లో భాగంగా ప్రజలకు సేవలు సులువుగా అందుతున్నాయని చెప్పారు. దేశ వ్యాప్తంగా ‘బి’ కేటగిరీ పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో ఉత్తమ సేవలు అందించడంలో విశాఖపట్నం మూడో స్థానంలో నిలిచిందన్నారు. పాస్‌పోర్ట్ విచారణలో రాష్ట్ర పోలీస్ శాఖ ప్రశంసలు అందుకుందన్నారు. విస్తృతంగా పాస్‌పోర్ట్ సేవలు విశాఖపట్నం ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం పరిధిలోని ఆయా జిల్లాల ప్రజలకు పాస్‌పోర్ట్ సేవలు విస్తృతం చేసినట్టు పీవో తెలిపారు. హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోని ఆరు జిల్లాలు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు గతేడాది ఏప్రియల్ నుంచి విశాఖపట్నం కార్యాలయంతో అనుసంధానం చేసిన విషయం గుర్తుచేశారు. ఆయా జిల్లాల హెడ్ పోస్టాఫీసుల్లో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు వినియోగంలో ఉన్నాయన్నారు. నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో ప్రతీ రోజు దాదాపు 100 పాస్‌పోర్ట్ దరఖాస్తులు పరిశీలనకు వస్తున్నాయని వివరించారు. త్వరలో శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల హెడ్ పోస్టాఫీసుల్లో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ‘వాక్ ఇన్’ విధానం నిలిపివేశాం పాస్‌పోర్ట్ మంజూరు కోసం ప్రతీ దరఖాస్తుదారుడు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ తప్పనిసరిగా చేసుకోవాలని పీవో స్పష్టం చేశారు. గతంలో మైనర్లు, సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులకు స్లాట్ బుకింగ్‌తో సంబంధం లేకుండా ‘వాక్ ఇన్’ విధానంగా నేరుగా సేవలు ఉండేవన్నారు. ఈ విధానం దుర్వినియోగం జరుగుతోందని ప్రభుత్వం గుర్తించి నిలిపివేసినట్టు చెప్పారు. స్లాట్ బుకింగ్ లేకుండా సేవలు అందించమని స్పష్టం చేశారు. విద్యా సంస్థల్లో పాస్‌పోర్ట్ సేవలు... కళాశాలల్లో పాస్‌పోర్ట్ సేవలు నేరుగా అందించడంలో మంచి ఫలితాలు సాధించామని పీవో సంతోషం వ్యక్తం చేశారు. ఆయా కళాశాలల్లో 8,500 విద్యార్థులకు, జిల్లాలో 400 మంది మీడియా ప్రతినిధులకు పాస్‌పోర్ట్ అందచేసినట్టు తెలిపారు. గీతం విశ్వవిద్యాలయం, రఘు ఇంజనీరింగ్ కళాశాలలో విజిలెన్స్ అవగాహన సదస్సులు విజయవంతంగా నిర్వహించామన్నారు. విద్యాలయాలు కోరితే పాస్‌పోర్ట్ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. -
తిరుమలలో టైం స్లాట్ సర్వదర్శనానికి శ్రీకారం
తిరుమల: శ్రీవారి టైంస్లాట్ సర్వదర్శనానికి సోమవారం నుంచి టీటీడీ అధికారులు శ్రీకారం చుట్టారు. కేంద్రీయ విచారణ కార్యాలయంలో ఉదయం 6 గంటలకు తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు కౌంటర్లకు పూజ చేసి టికెట్ల జారీ ప్రక్రియను ప్రారంభించారు. తమిళనాడు తంజావూరుకు చెందిన శకుంతలరామన్ ఆధార్‌కార్డు ఆధారంగా తొలి టికెట్టు పొందారు. 24 గంటల వ్యవధిలో ఖాళీగా ఉన్న టైంస్లాట్లలో ఎంపిక చేసుకున్న సమయాన్నిబట్టి భక్తులు టికెట్లను పొందే సౌకర్యాన్ని టీటీడీ కల్పించింది. టికెట్లు పొందిన భక్తులను దివ్యవదర్శనం కాంప్లెక్స్ నుండి అనుమతిస్తారు. టికెట్లను స్కానింగ్ చేసిన తర్వాత ఒక్కో భక్తుడికి రూ.10ల లడ్డూలు రెండు, రూ.25ల లడ్డూలు మరో రెండు అందజేస్తారు. కాంప్లెక్స్‌లోకి వెళ్లిన భక్తులకు రెండు గంటల్లోపే శ్రీవారి దర్శనం కల్పించే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం 14 ప్రాంతాల్లో 117 కౌంటర్లు ఏర్పాటు చేశౠమని, మార్చి నుంచి తిరుపతిలోనూ కౌంటర్లు ఏర్పాటు చేస్తామని జేఈవో వెల్లడించారు. ఆరు రోజులపాటు ప్రయోగాత్మకంగా పరిశీలించి లోటుపాట్లు సవరిస్తామన్నారు. కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో ఎ.రవికృష్ణ, ఎస్ఈ రామచంద్రారెడ్డి, ఐటీ అధికారి శేషారెడ్డి, పీఆర్వో రవి, డాలర్ శేషాద్రి పాల్గొన్నరు. కాగా, సర్వ దర్శనం స్లాట్ విధానం ద్వారా సోమవారం 18 వేలకుగాను 12 వేల టోకెన్లు జారీ చేశారు. మంగళవారం 20 వేలు మంజూరు చేయనున్నారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి కంపార్టమెంట్లు అన్నీ నిండిపోవడంతో వెలుపల క్యూలైన్లో భక్తులు వేచి ఉండాల్సి వచ్చింది. సర్వ దర్శనానికి 12 గంటలు, కాలిబాట దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం 2.84 కోట్లు. సోమవారం నుంచి సర్వదర్శనానికి స్లాట్ విధానం ప్రారంభమవుతుంది. దీనికి గానూ 20 ప్రాంతాలలో 117 కౌంటర్లు టీటీడీ ఏర్పాటు చేసింది. ఉదయం ఆరు గంటల నుంచి టోకెన్లను జారీ చేయనున్నారు. సర్వ దర్శనం స్లాట్ విధానానికి ఆధార్ తప్పనిసరి అని అధికారులు తెలిపారు. వారం రోజులపాటు ప్రయోగాత్మక పరిశీలించనున్నారు. -
‘పాస్‌పోర్ట్’ ఆదాయం రూ.36.88 కోట్లు
మర్రిపాలెం: విశాఖప ట్నం ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం 2016లో రూ.36,88,04,465 వార్షిక ఆదాయం ఆర్జించింది. ఆయా పాస్‌పోర్ట్ సేవల ద్వారా ఆదాయం పాస్‌పోర్ట్ ఖాతాకు చేరింది. 2015లో ఆదాయం రూ.36.51 లక్షలు వచ్చింది. 2016లో 2,25,225 దరఖాస్తులు స్వీకరించగా, 2,21,947 అనుమతులు లభించాయి. వీటిలో 2,15,383 మందికి పాస్‌పోర్ట్ సేవలు అందించారు. 2015లో 2.26 లక్షల దరఖాస్తులు రాగా 2.24 లక్షల మందికి అనుమతి ఇచ్చారు. వీరిలో 2.20 లక్షల మందికి పాస్‌పోర్ట్‌లు అందించారు. 2015లో పాస్‌పోర్ట్ మంజూరు సమయం సగటున 11 రోజులు కాగా 2016లో 9 రోజులకు చేరింది. స్లాట్ బుకింగ్ కాలం రెండేళ్లుగా ఒకటి నుంచి రెండు రోజులుగా ఉంటోంది. కొత్త పాస్‌పోర్ట్ ( సాధారణ) మంజూరు 10 నుంచి 15 రోజులు, తత్కాల్‌కు ఒకటి నుంచి మూడు రోజుల వ్యవధిలో అందిస్తోంది. పాస్‌పోర్ట్ సేవలు పొందిన వారి నుంచి మంచి అభిప్రాయాలు ఈ–మెయిల్స్ ద్వారా తెలుసుకుంటున్నామని పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి తెలిపారు. పాస్‌పోర్ట్ అభ్యర్థులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది సహకారంతో మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు స్పష్టం చేశారు. గోదావరి జిల్లాలకు అందుబాటులో.. గోదావరి జిల్లాల ప్రజలకు అందుబాటులో పాస్‌పోర్ట్ సేవా లఘు కేంద్రం భీమవరంలో గతేడాది జూన్ 22న ప్రారంభించినట్లు చౌదరి గుర్తుచేశారు. ప్రతి రోజు వంద మందికి స్లాట్ బుకింగ్‌తో సేవలు అందిస్తుండగా రాబోయే రోజులలో 250కి పెంచడానికి ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. విద్యార్థులకు పాస్‌పోర్ట్ సేవలు సులభంగా అందించేటట్లు ఆయా జిల్లాలలోని కళాశాలల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామని చెప్పారు. -
1న పాస్‌పోర్ట్ మేళా
విశాఖపట్నం : పాస్‌పోర్ట్ ప్రత్యేక మేళాను నవంబర్ ఒకటో తేదీన నిర్వహిస్తున్నట్టు పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి తెలిపారు. మూడు రోజులు ముందుగా స్లాట్ బుకింగ్‌లు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5.30 గంటల నుంచి బుకింగ్‌లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల ప్రజలు మేళాలో పాల్గొనడానికి అర్హులుగా ప్రకటించారు. కొత్త పాస్‌పోర్ట్, రీ షెడ్యూల్(సాధారణ) అభ్యర్థులను మేళాకు ఆహ్వానిస్తున్నారు. మేళాలో 800 మందికి పాస్‌పోర్ట్ సేవలు కల్పించి స్లాట్ బుకింగ్‌లు అందజేస్తారు. స్లాట్ పొందిన అభ్యర్థులు అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్(ఎఆర్‌ఎన్) ఫారంతో పాటు గుర్తింపు, చిరునామాపత్రాలతో బిర్లా జంక్షన్ దరి పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో హాజరుకావాలి. అభ్యర్థులు పాస్‌పోర్ట్ వెబ్సైట్ www.passportindia. gov.in ద్వారా స్లాట్లు పొందవచ్చు. విశాఖపట్నం పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలో గల ఐదు జిల్లాలు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరిలో కామన్ సర్వీస్ సెంటర్లు(మీ-సేవ)ద్వారా పాస్‌పోర్ట్ సేవలు పొందవచ్చని పాస్‌పోర్ట్ అధికారి తెలిపారు. ఐదు జిల్లాల లో ఎంపిక చేసిన మీ-సేవ కేంద్రాలలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు నింపడం, స్లాట్ బుకింగ్, ఫీజుల చెల్లింపులు జరపవచ్చన్నారు. రూ.100 చార్జీ చెల్లించి మీ-సేవ కేంద్రాలలో సేవలు ప్రజలు పొందవచ్చని స్పష్టం చేశారు. -
రిజిస్ట్రేషన్లు బంద్
విజయవాడ : దస్తావేజు లేఖరుల ఆందోళనతో జిల్లాలో శుక్రవారం రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఆన్లైన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖరుల సంఘం ఆధ్వర్యాన రెండు రోజులపాటు నిర్వహించ తలపెట్టిన ఆందోళన కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. దస్తావేజు లేఖరులు విధులు బహిష్కరించి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దీంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో లావాదేవీలు నిలిచిపోయాయి. విజయవాడ నగరంతోపాటు జిల్లాలోని 28 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. గన్నవరం, మచిలీపట్నం, గుడివాడ, నందిగామ, జగ్గయ్యపేట, నూజివీడు తదితర ప్రాంతాల్లో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు వెలవెలబోయాయి. రిజిస్ట్రేషన్స్ ప్రక్రియలో స్లాట్ బుకింగ్ విధానం ప్రవేశపెట్టవద్దని, ఆన్లైన్ వల్ల తాము జీవనోపాధి కోల్పోతామని దస్తావేజు లేఖరులు ఆందోళన వ్యక్తంచేశారు. తమ నిరసన కార్యక్రమం శనివారం కూడా కొనసాగుతుందని దస్తావేజు లేఖరుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల హరికృష్ణ, విజయవాడ నగర నాయకుడు నేరెళ్ల నారాయణరావు తెలిపారు. తొలిరోజు తమ ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిందని చెప్పారు. -
ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు అంతా సిద్ధం
నవంబర్‌లో శ్రీకారం దస్తావేజు లేఖరులకు చెక్ నేటినుంచి విధుల బహిష్కరణ అధికారులు, సిబ్బందిలోనూ గుబులు విజయవాడ : స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ శాఖ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసే ప్రక్రియను వచ్చే నెల నుంచి ప్రారంభించనుండంతో దస్తావేజు లేఖర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవంగా ఈ విధానం అమల్లోకి వస్తుందని ఎప్పటినుంచో వినపడుతున్నప్పటికీ ఇప్పటికి కదలిక వచ్చింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం కూడా పచ్చజెండా ఊపిందని సమాచారం. రవాణ, పాస్‌పోర్టు కార్యాలయాల్లో మాదిరిగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను స్లాట్ బుకింగ్ ద్వారా చేయాలని భావించి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దస్తావేజు లేఖరులు లేకుండా నేరుగా ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లే విధంగా ఆన్లైన్ విధానాన్ని అమలు చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ నెల 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ అధికారులు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. ఇందుకు సంబంధించి సెంట్రల్ సర్వర్‌ను ఆన్‌లైన్‌కు అనుసంధానం చేసి కొత్త సాఫ్ట్వేర్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో సేల్డీడ్లు, గిఫ్ట్‌డీడ్‌లు, ఇతర రిజిస్ట్రేషన్లు ఎవరికి వారు సొంతంగా నిర్వహించుకునే విధానాన్ని అమలు చేయనున్నారు. ఆస్తుల మార్కెట్ విలువను కూడా నెట్లో పొందుపరిచారు. ప్రజలు తాము రిజిస్ట్రేషన్ చేయించుకోదలుచుకున్న ఆస్తి మార్కెట్ విలువను నేరుగా నెట్లో చూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌కు అయ్యే ఫీజులు చలానా రూపంలో నేరుగా చెల్లించుకోవచ్చు. స్లాట్ బుకింగ్ ఇలా... రిజిస్ట్రేషన్ ప్రక్రియలో డాక్యుమెంట్ రైటర్ ప్రమేయం లేకుండా ఎవరికివారు సొంతంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయదలుచుకునే వారు ఆన్లైన్లో డాక్యుమెంటు నమూనాను పూర్తి చేయాలి. వెబ్సైట్లోకి వెళ్లి, ఆ దరఖాస్తులో ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్‌గా డేటా సెంటర్ నుంచి సదరు వ్యక్తి వివరాలు వేలిముద్రలతో సహా వచ్చేస్తాయి. ఆస్తి వివరాలకు సంబంధించిన ఖాళీల్లో సరిహద్దులు, విస్తీర్ణం నింపాల్సి ఉంటుంది. మార్కెట్ విలువ ఆన్లైన్లోనే తెలుసుకుని, బ్యాంకు ఖాతా నుంచే నగదు బదిలీ ద్వారా చలానా లేకుండా ఫీజు కట్టేయవచ్చు. ఏ తేదీన రిజిస్ట్రర్ చేయదలుచుకుంటారో అందులో పేర్కొం టే ప్రాధాన్యతా క్రమంలో స్లాట్ కేటాయిస్తారు. ఆ సమయానికి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళితే పాత దస్తావేజులు, లింకు డాక్యుమెంట్లు పరిశీ లించి మరోసారి వేలిముద్రలు, ఫొటో లు తీసుకుని రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇందులో డాక్యుమెంటురైటర్కు ఎటువంటి సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. డాక్యుమెంటు రైటర్ దళారీగా వ్యవహరించి రిజిస్ట్రేషన్స్ సిబ్బందికి మామూళ్లు ముట్టచెబుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. దాంతో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కాగా ఈ విషయం తెలియడంతో దస్తావేజు లేఖర్లలో, రిజిస్ట్రేషన్స్ అధికారులు, సిబ్బందిలో అలజడి చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో వారు ఆందోళనకు దిగుతున్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, సిబ్బంది కూడా ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. నేటి నుంచి దస్తావేజు లేఖరుల సమ్మె చల్లపలి: దస్తావేజు లేఖరుల సేవలను దూరంగా పెట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం నుంచి రెండురోజులపాటు వారు సమ్మెకు సిద్ధమయ్యారు. ఎన్నో ఏళ్ల నుంచి అందిస్తున్న దస్తావేజుల సేవలను నిలిపివేసి, మీసేవా కేంద్రాలకు అప్పగించడాన్ని నిరసిస్తూ సమ్మెకు దిగుతున్నారు. ఈ ఏడాది జనవరిలో 10రోజులు చేపట్టిన సమ్మె వల్ల జిల్లాలో రూ.24 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. ఈసారి చేపట్టనున్న సమ్మెవ ల్ల రూ.8కోట్లు మేర ఆదాయానికి గండి పడనుంది. విజయవాడ రిజిస్ట్రార్ పరిధిలో 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుండగా, మచిలీపట్నం రిజిస్ట్రార్ పరిధిలో 14 సబ్‌రిజిస్ట్రార్ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో 1800 మంది దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్స్, డీటీపీ ఆఫరేటర్లు పనిచేస్తున్నారు. -
దళారుల దయ..పాస్‌పోర్టు నీదయా!
బహిరంగంగా దళారుల దందా స్లాట్ల మంజూరులో కీలక పాత్ర వినియోగదారుల జేబులకు చిల్లు విశాఖపట్నం : పాస్‌పోర్టు సేవ లో దళారులు రాజ్యమేలుతున్నారు. నేరుగా జరగని పనిని దళారులు చిటికెలో చేసేసి దరఖాస్తుదారులను ఆశ్చర్యపరుస్తున్నారు. దరఖాస్తుదారుల అవసరాన్ని బట్టి దళారులు డబ్బు గుంజుతున్నారు. పాస్‌పోర్టు కోసం ప్రజలు దారుణంగా మోసపోతున్నారు. ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ సామాన్యులకు అర్థం కాక దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న దళారులు చెలరేగిపోతున్నారు. వినియోగదారులను దోచుకుంటూ హవా కొనసాగిస్తున్నారు. వీరి మాయమాటలు నమ్ముతున్న ప్రజల జేబులకు చిల్లు పడుతోంది. స్లాట్ బుకింగ్, దరఖాస్తు,నోటరీఅంటూదళారులు వేలాది రూపాయలు దోచుకుంటున్నారు. పుట్టిన తేదీ ధ్రువపత్రాలు, గుర్తింపు, చిరునామాలు అప్పటికప్పుడు సృష్టించి అదనంగా డబ్బు వసూలు చేస్తున్నారు. వేగంగా పాస్‌పోర్ట్ మంజూరు కోసం అడ్డదారుల్లో ప్రయత్నించి సఫలీకృతులు కావడం గమనార్హం. దళారుల జోక్యాన్ని నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పాస్‌పోర్టు సేవా కేంద్రానికి అతి సమీపంలో దళారులు వ్యాపారాలు నిర్వహించినా అధికారులు చూసీ చూడనట్టు ఉండటాన్ని పలువురు తప్పుబడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కేంద్రానికి ఆనుకుని దళారుల కార్యాలయాలు ఉండటం సందేహాలకు తావిస్తోంది. కేంద్రానికి అతి సమీపంలో దళారుల కార్యాలయాల బోర్డులు అమర్చడంతో ప్రజలు విస్తుబోతున్నా రు. పాస్‌పోర్టు మంజూరు కోసం చట్టబద్ధమైన ఫీజులకు దళారులు మంగళం పాడేశారు. దళారుల కార్యాలయాలు బిర్లా కూడలిలో ఇష్టానుసారంగా వెలిశాయి. జిరాక్స్ కేంద్రాలుగా వెలిసి పాస్‌పోర్టు బుకింగ్‌లకు అడ్డాలుగా అవతరిస్తున్నాయి. మరికొందరు తాత్కాలిక టెంట్లు వేసి ఆకర్షిస్తున్నారు. ప్రజలు నేరుగా వెళ్తే పనులు జరగడం లేదని చెబుతున్నారు. అవసరమైన పత్రాలు తీసుకువెళితే ఇది నిజమేనా! ఒరిజినల్ తీసుకువచ్చావా! అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని అంటున్నారు. పోలీస్, నోటరీ సర్టిఫికెట్లకు వేలాది రూపాయలు ముట్టజెప్పాలని వాపోతున్నారు. ఇటీవల జరుగుతున్న మేళాలతో దళారులకు కాసుల పంట పండుతోందని కొందరంటున్నారు. మేళాలో పాస్‌పోర్ట్ స్లాట్ కోసం దళారులు ముందస్తు అడ్వాన్సులు తీసుకోవడం కొసమెరుపు. -
ప్రశాంతంగా పాస్‌పోర్ట్ మేళా
విశాఖపట్నం : పాస్‌పోర్ట్ మేళా శనివారం ప్రశాంతంగా ముగిసింది. బిర్లా జంక్షన్ దరి పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో మేళా జరిగింది. మేళాలో 800 మంది అభ్యర్థులకు అధికారులు అవకాశం కల్పించారు. మూడు రోజుల ముందుగా ప్రత్యేక స్లాట్ బుకింగ్‌తో అభ్యర్థులు మేళాలో పాల్గొనేలా చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల వాసులు మేళాలో పాల్గొనవచ్చని ప్రకటించారు. స్లాట్ బుకింగ్‌లో తెలిపిన సమయం ప్రకారం అభ్యర్థులకు అవకాశం కల్పించారు. త్వరతిగతిన సేవలు లభించడంతో పనులు వేగవంతంగా ముగిశాయి. దూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే కార్యాలయానికి చేరుకున్న అభ్యర్థులు ఎండవేడిమికి అవస్థలు పడ్డారు. గ్రీన్ బెల్ట్‌లోని చెట్ల కింద కూర్చొని సేదతీరారు. ప్రస్తుతం స్లాట్ బుకింగ్ పొందడానికి సుమారు నెలన్నర రోజులకు పైగా పడుతుండగా, మేళా నిర్వాహణ ద్వారా కేవలం మూడు రోజుల వ్యవధిలో పాస్‌పోర్ట్ సేవలు లభ్యం కావడంతో అభ్యర్థుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఈనెల 28న మరోసారి మేళా నిర్వహిస్తున్నట్టు అధికారులు ఇప్పటికే ప్రకటించారు.