‘పాస్‌పోర్ట్’ ఆదాయం రూ.36.88 కోట్లు
మర్రిపాలెం: విశాఖప ట్నం ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం 2016లో రూ.36,88,04,465 వార్షిక ఆదాయం ఆర్జించింది. ఆయా పాస్‌పోర్ట్ సేవల ద్వారా ఆదాయం పాస్‌పోర్ట్ ఖాతాకు చేరింది. 2015లో ఆదాయం రూ.36.51 లక్షలు వచ్చింది. 2016లో 2,25,225 దరఖాస్తులు స్వీకరించగా, 2,21,947 అనుమతులు లభించాయి. వీటిలో 2,15,383 మందికి పాస్‌పోర్ట్ సేవలు అందించారు. 2015లో 2.26 లక్షల దరఖాస్తులు రాగా 2.24 లక్షల మందికి అనుమతి ఇచ్చారు. వీరిలో 2.20 లక్షల మందికి పాస్‌పోర్ట్‌లు అందించారు. 2015లో పాస్‌పోర్ట్ మంజూరు సమయం సగటున 11 రోజులు కాగా 2016లో 9 రోజులకు చేరింది. స్లాట్ బుకింగ్ కాలం రెండేళ్లుగా ఒకటి నుంచి రెండు రోజులుగా ఉంటోంది.
కొత్త పాస్‌పోర్ట్ ( సాధారణ) మంజూరు 10 నుంచి 15 రోజులు, తత్కాల్‌కు ఒకటి నుంచి మూడు రోజుల వ్యవధిలో అందిస్తోంది. పాస్‌పోర్ట్ సేవలు పొందిన వారి నుంచి మంచి అభిప్రాయాలు ఈ–మెయిల్స్ ద్వారా తెలుసుకుంటున్నామని పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి తెలిపారు. పాస్‌పోర్ట్ అభ్యర్థులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది సహకారంతో మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు స్పష్టం చేశారు.
గోదావరి జిల్లాలకు అందుబాటులో..
గోదావరి జిల్లాల ప్రజలకు అందుబాటులో పాస్‌పోర్ట్ సేవా లఘు కేంద్రం భీమవరంలో గతేడాది జూన్ 22న ప్రారంభించినట్లు చౌదరి గుర్తుచేశారు. ప్రతి రోజు వంద మందికి స్లాట్ బుకింగ్‌తో సేవలు అందిస్తుండగా రాబోయే రోజులలో 250కి పెంచడానికి ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. విద్యార్థులకు పాస్‌పోర్ట్ సేవలు సులభంగా అందించేటట్లు ఆయా జిల్లాలలోని కళాశాలల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామని చెప్పారు.