పాస్‌పోర్ట్‌.. ఇంకా సులువు | passport services available in post office | Sakshi
Sakshi News home page

పాస్‌పోర్ట్‌.. ఇంకా సులువు

Published Thu, Jan 4 2018 11:03 AM | Last Updated on Thu, Jan 4 2018 11:03 AM

passport services available in post office - Sakshi

మర్రిపాలెం(విశాఖ పశ్చిమ): అన్ని వర్గాల ప్రజలు పాస్‌పోర్ట్‌ సేవలను సులభంగా పొందేలా ప్రభుత్వం విస్తృత అవకాశాలు కల్పించిందని ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం అధికారి (పీవో) ఎన్‌.ఎల్‌.పి.చౌదరి తెలిపారు. పాస్‌పోర్ట్‌ సేవలను ప్రజలు సకాలంలో పొందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఒకటి లేదా రెండు రోజుల వ్యవధిలో స్లాట్‌ బుకింగ్‌ అందుబాటులో ఉంటోందన్నారు. ఎనిమిదేళ్ల లోపు బాలలు, 60 ఏళ్లకు పైబడిన వృద్ధులకు 10 శాతం ఫీజులో రాయితీని ప్రభుత్వం ప్రకటించిన విషయం ప్రస్తావించారు. పాస్‌పోర్ట్‌ సేవలకు సంబంధించి గత ఏడాది ప్రగతి, భవిష్యత్‌ ప్రణాళికను ‘సాక్షి’కి వివరించారు.
2017లో కార్యాలయ పరిధిలో 3,49,576 పాస్‌పోర్ట్‌లు మంజూరు చేశామన్నారు. 19,538 పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్లు ఇచ్చామన్నారు. సాధారణ పాస్‌పోర్ట్‌ మంజూరు సగటున 10 నుంచి 15 రోజుల వ్యవధిగా ఉందని, తత్కాల్‌ పాస్‌పోర్ట్‌ సేవలు ఒకటి నుంచి మూడు రోజుల్లో అందుతున్నాయని చెప్పారు.  భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘పాస్‌పోర్ట్‌ సేవా ప్రాజెక్ట్‌’లో భాగంగా ప్రజలకు సేవలు సులువుగా అందుతున్నాయని చెప్పారు. దేశ వ్యాప్తంగా ‘బి’ కేటగిరీ పాస్‌పోర్ట్‌ కార్యాలయాల్లో ఉత్తమ సేవలు అందించడంలో విశాఖపట్నం మూడో స్థానంలో నిలిచిందన్నారు. పాస్‌పోర్ట్‌ విచారణలో రాష్ట్ర పోలీస్‌ శాఖ ప్రశంసలు అందుకుందన్నారు.

విస్తృతంగా పాస్‌పోర్ట్‌ సేవలు
విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌ పోర్ట్‌ కార్యాలయం పరిధిలోని ఆయా జిల్లాల ప్రజలకు పాస్‌పోర్ట్‌ సేవలు విస్తృతం చేసినట్టు పీవో తెలిపారు. హైదరాబాద్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయం పరిధిలోని ఆరు జిల్లాలు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు గతేడాది ఏప్రియల్‌ నుంచి విశాఖపట్నం కార్యాలయంతో అనుసంధానం చేసిన విషయం గుర్తుచేశారు. ఆయా జిల్లాల హెడ్‌ పోస్టాఫీసుల్లో పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు వినియోగంలో ఉన్నాయన్నారు. నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో ప్రతీ రోజు దాదాపు 100 పాస్‌పోర్ట్‌ దరఖాస్తులు పరిశీలనకు వస్తున్నాయని వివరించారు. త్వరలో శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల హెడ్‌ పోస్టాఫీసుల్లో పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

‘వాక్‌ ఇన్‌’ విధానం నిలిపివేశాం
పాస్‌పోర్ట్‌ మంజూరు కోసం ప్రతీ దరఖాస్తుదారుడు ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌ తప్పనిసరిగా చేసుకోవాలని పీవో స్పష్టం చేశారు. గతంలో మైనర్లు, సీనియర్‌ సిటిజన్స్, దివ్యాంగులకు స్లాట్‌ బుకింగ్‌తో సంబంధం లేకుండా ‘వాక్‌ ఇన్‌’ విధానంగా నేరుగా సేవలు ఉండేవన్నారు. ఈ విధానం దుర్వినియోగం జరుగుతోందని ప్రభుత్వం గుర్తించి నిలిపివేసినట్టు చెప్పారు. స్లాట్‌ బుకింగ్‌ లేకుండా సేవలు అందించమని స్పష్టం చేశారు.

విద్యా సంస్థల్లో పాస్‌పోర్ట్‌ సేవలు...
కళాశాలల్లో పాస్‌పోర్ట్‌ సేవలు నేరుగా అందించడంలో మంచి ఫలితాలు సాధించామని పీవో సంతోషం వ్యక్తం చేశారు. ఆయా కళాశాలల్లో 8,500 విద్యార్థులకు, జిల్లాలో 400 మంది మీడియా ప్రతినిధులకు పాస్‌పోర్ట్‌ అందచేసినట్టు తెలిపారు. గీతం విశ్వవిద్యాలయం, రఘు ఇంజనీరింగ్‌ కళాశాలలో విజిలెన్స్‌ అవగాహన సదస్సులు విజయవంతంగా నిర్వహించామన్నారు. విద్యాలయాలు కోరితే పాస్‌పోర్ట్‌ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement