తత్కాల్‌ పాస్‌పోర్ట్‌కు ఆ లేఖలు అక్కర్లేదు | NO Need Babus Letter for Tatkal passport | Sakshi
Sakshi News home page

తత్కాల్‌ పాస్‌పోర్ట్‌కు ఐఏఎస్, ఐపీఎస్‌ లేఖలు అక్కర్లేదు

Published Sun, Oct 21 2018 12:07 PM | Last Updated on Sun, Oct 21 2018 12:10 PM

NO Need Babus Letter for Tatkal passport - Sakshi

సాక్షి, అమరావతి: తత్కాల్‌ పద్ధతిలో పాస్‌పోర్ట్‌ తీసుకోవాలంటే ఒకప్పుడు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. లేదంటే విదేశీ ప్రయాణం వాయిదా వేసుకోవాలి. అంతకుమించి మార్గం లేదు. సడలించిన నిబంధనల ప్రకారం ఇప్పుడా అధికారుల అవసరం లేదు. మూడు ధృవపత్రాలు సమర్పించి రూ.2,500 ఫీజు చెల్లిస్తే చాలు మూడురోజుల్లో పాస్‌పోర్టు తీసుకుని విదేశీ యానం చేసుకోవచ్చు. బ్రోకర్లకు డబ్బులు, ధృవపత్రాల కొరత, ఇవన్నీ ఇప్పుడు సమస్యలే కావు. పుట్టిన తేదీని ధృవీకరించి, నివాస ధృవపత్రం ఒక్కటుంటే చాలు పాస్‌పోర్ట్‌ తీసుకోవడం సమస్యే కాదు అంటున్నారు విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి డీఎస్‌ఎస్‌ శ్రీనివాసరావు. పాస్‌పోర్ట్‌ తీసుకోవడం ఇప్పుడు చాలా సులభమని స్పష్టం చేశారు. పాస్‌పోర్ట్‌ నిబంధనలు సడలించాక మారిన పరిస్థితులపై ఆయన సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

ప్రధాన పోస్టాఫీసుల్లో సౌలభ్యం
చాలామంది పాస్‌పోర్ట్‌ కోసం పాస్‌పోర్ట్‌ సేవాకేంద్రాల్లోనే దరఖాస్తు చేసుకోవచ్చని అనుకుంటున్నారు. కానీ పోస్టాఫీసుల్లోనూ (పీవో పీఎస్‌కే) ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లా కేంద్రంలోని ప్రధాన పోస్టాఫీసుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పాస్‌పోర్టు కోసం దూర ప్రాంతాల నుంచి విజయవాడకు రావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక వారం రోజులు పాస్‌పోర్ట్‌ రావడం లేటవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 8 పోస్టాఫీసుల్లోనూ, 2 పాస్‌పోర్ట్‌ సేవాకేంద్రాల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. మరో ఐదు పోస్టాఫీసులు త్వరలోనే ప్రారంభమవుతాయి.

దరఖాస్తుకు పరిధి లేదు
గతంలో ఫలానా పాస్‌పోర్ట్‌ కార్యాలయం పరిధిలోనే దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన ఉండేది. ఇప్పుడా పరిధి లేదు. ఇండియాలో ఎక్కడి నుంచైనా, ఏ పాస్‌పోర్ట్‌ పరిధిలోనైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఉదాహరణకు విజయవాడ వాసి నాగపూర్‌లో ఉంటే అక్కడే దరఖాస్తు చేసుకోవచ్చు.

మైనర్‌కు ఐదేళ్ల కాలపరిమితి పాస్‌పోర్టు
పద్దెనిమిదేళ్ల లోపు వారికి 5 ఏళ్ల కాలపరిమితికి మించి పాస్‌పోర్ట్‌ ఇవ్వము. కానీ 15 ఏళ్లు దాటి 18 ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకుంటే తల్లిదండ్రులు కానీ, దరఖాస్తుదారుడు గానీ, పదేళ్లు కాలపరిమితి కావాలని కోరితే ఇస్తున్నాం. ఏడాది కాలపరిమితి ఉండగా దరఖాస్తు చేసుకున్నా.. దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి 10 ఏళ్లు ఇస్తాం.

సాధారణ పాస్‌పోర్ట్‌ పొందడం సులభతరం
గతంలో సాధారణ పద్ధతిలో పాస్‌పోర్ట్‌ దరఖాస్తు చేసుకుంటే చాలా ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడవన్నీ ఏమీ లేవు. చదువుకోని వారికి ఎస్‌ఎస్‌సీ కూడా అక్కర్లేదు. ప్రభుత్వం జారీ చేసిన బర్త్‌ సర్టిఫికెట్‌ తీసుకుని ఫోన్‌బిల్లు, గ్యాస్‌బిల్లు, ఆధార్‌కార్డు, ఓటర్‌కార్డు ఇలా ఏదో ఒకటి సమర్పిస్తే వచ్చేస్తుంది.
త్వరలోనే ఆర్పీవో త్వరలోనే విజయవాడలో ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం వస్తుంది. నిర్మాణ దశలో ఉంది. ఇది వస్తే పాస్‌పోర్ట్‌ ప్రింటింగ్‌ కూడా ఇక్కడే జరుగుతుంది.

దరఖాస్తుల్లో గుంటూరు, కృష్ణా టాప్‌
ప్రస్తుతం పాస్‌పోర్టుకు దరఖాస్తుకు చేసుకునే వారిలో కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి. దీని తర్వాత వైఎస్సార్, చిత్తూరు జిల్లాల నుంచి దరఖాస్తులు ఎక్కువ. గతంలో కంటే ఇప్పుడు పాస్‌పోర్ట్‌ దరఖాస్తులు భారీగా పెరిగాయి. ఏపీలో రోజుకు 2,700 మందికి పైగా దరఖాస్తు చేసుకుంటున్నారు. గతంలో వెయ్యి లేదా 1,200 మంది మాత్రమే దరఖాస్తు చేసుకునే వారు.

పోలీస్‌ వెరిఫికేషన్‌ ఇబ్బంది లేదు
గతంలో పోలీస్‌ వెరిఫికేషన్‌ క్లిష్టంగా ఉండేది. దరఖాస్తు ఆ చిరునామాలో లేకపోతే ఇబ్బంది ఉండేది. ఇప్పుడది లేదు. అతనికి కేవలం నేరచరిత్ర ఉందో లేదో మాత్రమే చూస్తారు. వెంటనే వెరిఫికేషన్‌ అయిపోతుంది.


విద్యార్థులకు ఒకటే వెరిఫికేషన్‌
గతంలో విద్యార్థులు ఎక్కడైనా చదువుతుంటే, సొంతూరులోనూ, చదువుతున్న చోటా రెండు చోట్లా వెరిఫికేషన్‌ ఉండేది. ఇప్పుడా నిబంధన లేదు. ఏ చిరునామా అయితే దరఖాస్తులో పెట్టాడో అక్కడే చూస్తారు. దీనివల్ల చాలామంది విద్యార్థులు త్వరగా పాస్‌పోర్ట్‌ పొందుతున్నారు.

మొబైల్‌ యాప్‌తోనూ..
పాస్‌పోర్ట్‌ దరఖాస్తు కోసం ఇంటర్నెట్‌ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎం–సేవా అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని మొబైల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. చేయగానే మెసేజ్‌ వస్తుంది. మెసేజ్‌ చూపించి, డాక్యుమెంట్లు ఇస్తే సరిపోతుంది. స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ఎవరైనా మొబైల్‌ ద్వారానే అప్లికేషన్‌ పెట్టుకోవచ్చు. గతంలో తత్కాల్‌కు ఐఏఎస్, ఐపీఎస్‌ ఇచ్చే వెరిఫికేషన్‌ లేఖలు అవసరం ఉండేవి. ఇప్పుడు అవసరం లేదు. ధృవపత్రాల్లో మూడు సమర్పించి, తత్కాల్‌ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్‌కార్డు, ఓటర్‌కార్డు, బ్యాంకు పాస్‌ బుక్కు ఇలా ఏవైనా మూడు ధృవపత్రాలు సమర్పిస్తే మూడు రోజుల్లో పాస్‌పోర్ట్‌ తీసుకోవచ్చు. 60 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు, 8 ఏళ్లలోపు చిన్నారులకు ఫీజులో 10 శాతం రాయితీ ఉంటుంది. ఇది తొలిసారి పాస్‌పోర్ట్‌ దరఖాస్తు చేసుకునే సమయంలో మాత్రమే వర్తిస్తుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement