పత్తి విక్రయానికి స్లాట్‌ బుకింగ్‌ | Slot booking for sale of cotton: Telangana | Sakshi
Sakshi News home page

పత్తి విక్రయానికి స్లాట్‌ బుకింగ్‌

Published Sat, Oct 19 2024 5:32 AM | Last Updated on Sat, Oct 19 2024 5:32 AM

Slot booking for sale of cotton: Telangana

రైతుల సౌలభ్యం కోసం వాట్సాప్‌ యాప్‌ అందుబాటులోకి 

ప్రస్తుతం నిర్మల్‌ మార్కెట్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలుకు నిర్ణయం

అనంతరం ఇతర మార్కెట్లలో అమలులోకి

రైతులు తమకు అనువైన సమయంలో పంట తెచ్చేందుకు వెసులుబాటు 

8897281111 నంబర్‌ వాట్సాప్‌ ద్వారా సమగ్ర సమాచారం

సాక్షి, హైదరాబాద్‌: ఈ సీజన్‌కు సంబంధించి పత్తి పంట మార్కెట్లోకి వస్తోంది. రైతులు పత్తిని విక్రయించాలంటే గతంలో భారత పత్తి సంస్థ (సీసీఐ) కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షించేవారు. అయితే ఈ విషయంలో రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సీసీఐ అధికారులు తాజాగా ‘వాట్సాప్‌ టాప్‌ యాప్‌’ను రూపొందించారు. రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖకు దీనిని అనుసంధానించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సీసీఐ కేంద్రాల కొనుగోళ్ల తాజా వివరాలను యాప్‌లో అందుబాటులో ఉంచుతారు. దీంతో రైతు ఎప్పు డు సరుకు తీసుకెళ్లాలనే సమాచారం నుంచి నగదు జమ వరకు సకల వివరాలు తెలుసుకోవచ్చు. ఏ రోజు, ఎప్పుడు మార్కెట్‌కు వెళ్లాలో నిర్ణయించుకుని, రైతులు దీని ద్వారానే స్లాట్‌ బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించింది.

మార్కెట్, తేదీ, సమయం నిర్దేశించుకొని స్లాట్‌ను బుక్‌ చేసుకొని ఆ ప్రకారం మార్కెట్‌కు వెళితే సరిపోతుంది. కాగా, స్లాట్‌ బుకింగ్‌ సదుపాయాన్ని మాత్రం తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా నిర్మల్‌ మార్కెట్లో అమలు చేయనున్నారు. అనంతరం ఇతర మార్కెట్లకు విస్తరించనున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం స్లాట్‌ బుకింగ్‌ సదుపాయం లేని జిల్లాల్లోని మార్కెట్లలో కొనుగోలు ప్రక్రియ, రద్దీ తదితర వివరాలను రైతులు తెలుసుకునేందుకు వాట్సాప్‌ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. 8897281111 నంబర్‌ వాట్సాప్‌ ద్వారా సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. హాయ్‌ అని వాట్సాప్‌లో మెసేజ్‌ పెడితే సమగ్ర సమాచారం మనముందు ఉంటుంది. అలాగే అత్యంత ముఖ్యమైనది.. ఆయా కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉండే సమయాన్ని వాట్సాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. అమ్మిన పంట మొత్తం రైతు ఖాతాలో జమ అయ్యేవరకు దీని ద్వారా వివరాలు తెలుసుకునే సదుపాయం కల్పించారు. 

21.46 లక్షల మంది రైతుల వివరాలు నిక్షిప్తం
వాట్సాప్‌ యాప్‌లో రైతులకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. ఆ యాప్‌లో 21,46,263 మంది పత్తి రైతుల వివరాలు ఉన్నాయి. కాగా, వ్యవసాయ శాఖ వద్ద వివరాలు నమోదు చేసుకున్న రైతులకే ఈ యాప్‌ అందుబాటులో ఉంటుంది. రైతులు తమ వద్ద ఎంత పత్తి నిల్వ ఉంది? అనే వివరాలను తొలుత యాప్‌లో నమోదు చేయాలి. అప్పుడు స్థానిక సీసీఐ/జిన్నింగు మిల్లు పరిధిలో కొనుగోలుకు ఎంత సమయం పడుతుందో సమాచారం అందుతుంది. సీరియల్లో ఉన్న వాహనాల సంఖ్య, లోడింగ్, అన్‌లోడింగ్‌ వివరాలు కనిపిస్తాయి. పంటను విక్రయించిన తర్వాత తక్పట్టీ వివరాలు, ధరల వివరాలు, నగదు ఎన్ని రోజుల్లో జమ అవుతుందో కూడా తెలుసుకోవచ్చు. ‘యాప్‌’లో వివరాలు తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో అందుబాటులో ఉంటాయి. దీంతో రైతు తన పంటను ఇంటి దగ్గర్నుంచి తెచ్చుకుని వెంటనే అమ్ముకునే సౌలభ్యం కలుగుతుంది.

వాట్సాప్‌ యాప్‌తో రైతులకు ప్రయోజనం
వాట్సాప్‌ యాప్‌ ద్వారా పత్తి రైతులకు మరింత ప్రయోజనం ఉంటుంది. దీనిని ఈ ఏడాదే అందుబాటులోకి తీసుకువచ్చాం. నిర్మల్‌ మార్కెట్‌లోనైతే స్లాట్‌ బుకింగ్‌ సదుపాయం కూడా కల్పించాం. దీనిని పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తాం. రైతులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి. 
– లక్ష్మణుడు, అడిషనల్‌ డైరెక్టర్, మార్కెటింగ్‌శాఖ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement