ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు అంతా సిద్ధం | Everything is ready registration | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు అంతా సిద్ధం

Published Fri, Oct 17 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 PM

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు అంతా సిద్ధం

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు అంతా సిద్ధం

  • నవంబర్‌లో శ్రీకారం
  •   దస్తావేజు లేఖరులకు చెక్
  •   నేటినుంచి  విధుల బహిష్కరణ
  •   అధికారులు, సిబ్బందిలోనూ గుబులు
  • విజయవాడ : స్టాంప్స్,  రిజిస్ట్రేషన్స్ శాఖ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసే ప్రక్రియను వచ్చే నెల నుంచి ప్రారంభించనుండంతో దస్తావేజు లేఖర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవంగా ఈ విధానం అమల్లోకి వస్తుందని ఎప్పటినుంచో వినపడుతున్నప్పటికీ ఇప్పటికి కదలిక వచ్చింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం కూడా పచ్చజెండా ఊపిందని సమాచారం.

    రవాణ, పాస్‌పోర్టు కార్యాలయాల్లో మాదిరిగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను  స్లాట్ బుకింగ్ ద్వారా చేయాలని  భావించి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దస్తావేజు లేఖరులు లేకుండా నేరుగా ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లే విధంగా ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ నెల 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ అధికారులు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు.

    ఇందుకు సంబంధించి సెంట్రల్ సర్వర్‌ను ఆన్‌లైన్‌కు అనుసంధానం చేసి కొత్త  సాఫ్ట్‌వేర్‌లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో  సేల్‌డీడ్‌లు, గిఫ్ట్‌డీడ్‌లు, ఇతర రిజిస్ట్రేషన్లు ఎవరికి వారు సొంతంగా నిర్వహించుకునే విధానాన్ని అమలు చేయనున్నారు. ఆస్తుల మార్కెట్ విలువను కూడా నెట్‌లో పొందుపరిచారు. ప్రజలు తాము రిజిస్ట్రేషన్ చేయించుకోదలుచుకున్న ఆస్తి మార్కెట్ విలువను నేరుగా నెట్‌లో చూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌కు అయ్యే ఫీజులు  చలానా రూపంలో నేరుగా చెల్లించుకోవచ్చు.
     
    స్లాట్ బుకింగ్ ఇలా...

    రిజిస్ట్రేషన్ ప్రక్రియలో డాక్యుమెంట్ రైటర్ ప్రమేయం లేకుండా ఎవరికివారు సొంతంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయదలుచుకునే వారు ఆన్‌లైన్‌లో డాక్యుమెంటు నమూనాను పూర్తి చేయాలి. వెబ్‌సైట్‌లోకి వెళ్లి, ఆ దరఖాస్తులో ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్‌గా డేటా సెంటర్ నుంచి సదరు వ్యక్తి వివరాలు వేలిముద్రలతో సహా వచ్చేస్తాయి. ఆస్తి వివరాలకు సంబంధించిన ఖాళీల్లో సరిహద్దులు, విస్తీర్ణం నింపాల్సి ఉంటుంది.

    మార్కెట్ విలువ ఆన్‌లైన్‌లోనే తెలుసుకుని, బ్యాంకు ఖాతా నుంచే   నగదు బదిలీ ద్వారా చలానా లేకుండా ఫీజు కట్టేయవచ్చు. ఏ తేదీన రిజిస్ట్రర్ చేయదలుచుకుంటారో అందులో పేర్కొం టే ప్రాధాన్యతా క్రమంలో స్లాట్ కేటాయిస్తారు. ఆ   సమయానికి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళితే పాత దస్తావేజులు, లింకు డాక్యుమెంట్లు పరిశీ లించి మరోసారి వేలిముద్రలు, ఫొటో లు తీసుకుని రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇందులో డాక్యుమెంటురైటర్‌కు ఎటువంటి సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు.

    డాక్యుమెంటు రైటర్ దళారీగా వ్యవహరించి రిజిస్ట్రేషన్స్ సిబ్బందికి మామూళ్లు ముట్టచెబుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. దాంతో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళిక  సిద్ధం చేశారు. కాగా ఈ విషయం తెలియడంతో దస్తావేజు లేఖర్లలో, రిజిస్ట్రేషన్స్ అధికారులు, సిబ్బందిలో అలజడి చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో వారు ఆందోళనకు  దిగుతున్నారు.  కొత్త విధానం అమల్లోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అధికారులు, సిబ్బంది కూడా ఆందోళన  చెందుతున్నట్లు సమాచారం.
     
    నేటి నుంచి  దస్తావేజు లేఖరుల సమ్మె


    చల్లపలి:  దస్తావేజు లేఖరుల సేవలను దూరంగా పెట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం నుంచి రెండురోజులపాటు వారు సమ్మెకు సిద్ధమయ్యారు. ఎన్నో ఏళ్ల నుంచి అందిస్తున్న దస్తావేజుల సేవలను నిలిపివేసి, మీసేవా కేంద్రాలకు అప్పగించడాన్ని నిరసిస్తూ సమ్మెకు దిగుతున్నారు. ఈ ఏడాది జనవరిలో 10రోజులు చేపట్టిన సమ్మె వల్ల  జిల్లాలో రూ.24 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. ఈసారి చేపట్టనున్న సమ్మెవ ల్ల రూ.8కోట్లు మేర ఆదాయానికి గండి పడనుంది.  విజయవాడ రిజిస్ట్రార్ పరిధిలో 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుండగా, మచిలీపట్నం రిజిస్ట్రార్ పరిధిలో 14 సబ్‌రిజిస్ట్రార్ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో 1800 మంది దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్స్, డీటీపీ ఆఫరేటర్లు పనిచేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement