వెంకోజీపాలెం : జిల్లావ్యాప్తంగా 40 కళాశాలలకు ఈ విద్యాసంవత్సరంలో ఉపకార వేతనాలు, ఫీజుల వాపస్ బంద్ కానుంది. ఈ విద్యాసంవత్సరంలో ఈ కళాశాలలు ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ల చేయించుకోకపోవడమే ఇందుకు కారణం. వాస్తవానికి ఏటా ప్రతి కళాశాల ఆన్‌లైన్ వివరాలు నమోదు చేసి హార్డ్‌కాపీలను సాంఘిక సంక్షేమశాఖ, బీసీ సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమశాఖ, మైనారిటీ సంక్షేమశాఖ కార్యాలయాలకు అందజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రభుత్వం ఆయా కళాశాలల విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజులు మంజూరు చేస్తుంది.
జిల్లాలో మొత్తం 525 జూనియర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, లా, మెడికల్, పాలిటెక్నిక్, బీఈడీ తదితర కళాశాలలు ఉన్నాయి. ఏటా 30వేలకు పైగా బీసీ, 6వేలకు పైగా ఎస్సీ, 8 వేలకు పైగా ఈబీసీ విద్యార్థులు ఉపకారవేతనాలు, ఫీజుల కోసం దరఖాస్తు చేస్తుంటారు. ప్రభుత్వం ఏటా వీరికి రూ.14.50 కోట్ల మేరకు ఉపకారవేతనాలు, ఫీజుల కింద విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో 66 కళాశాలలు రిజిస్ట్రేషన్లు చేసుకోకపోవడంతో సంక్షేమశాఖల అధికారులు తనిఖీలు నిర్వహించారు. 26 కళాశాలలు ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని గుర్తించారు.
ఇక మిగిలిన 40 కళాశాలలు ఈ నెల 22వ తేదీలోగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. కానీ స్పందన కానరావడం లేదు. దీంతో ఈ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులలో ఆందోళన నెలకొంది. రెన్యువల్స్‌కి ఈ నెల 24, ఫ్రెష్ విద్యార్థులకు ఈ నెల 30తో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ విద్యాసంవత్సరంలో ఉమ్మడి ప్రవేశపరీక్ష (సెట్) ద్వారా మొదటి సంవత్సరం ప్రవేశాలు జరిగిన ఇంజినీరింగ్, మెడిసిన్, పాలిటెక్నిక్, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల వివరాలు ఈ-పాస్‌లో ఇప్పటికీ అందుబాటులో లేవు. ఆయా కోర్సుల్లో చేరిన విద్యార్థులు దీనిపై ఆందోళన చెందుతున్నారు.
రిజిస్ట్రేషన్లు లేకుంటే ఉపకారం నిల్
ఈ నెల 22వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేయించుకోని 40 కళాశాలలకు ఉపకారవేతనాలు నిలిపివేస్తాం. సెట్‌ద్వారా ప్రవేశాలు జరిగిన కోర్సుల వివరాలు ఈ-పాస్‌లో అందుబాటులో లేవు. ఈ విషయమై ప్రిన్సిపల్ సెక్రటరీ నిర్వహించే వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన దృష్టికి తీసుకువస్తాం. విద్యార్థులంతా త్వరితగతిన ఉపకారవేతనాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- డి.వి.రమణమూర్తి, డెప్యూటీ డెరైక్టర్, సాంఘికసంక్షేమశాఖ, విశాఖపట్నం
40 కళాశాలలకు ఉపకారం బంద్!
Published Fri, Nov 21 2014 12:49 AM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM
Advertisement