9999 ఈ నంబరు చాలా రేటు | Rate this number to 9999 | Sakshi
Sakshi News home page

9999 ఈ నంబరు చాలా రేటు

Published Thu, Oct 23 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 PM

9999 ఈ నంబరు చాలా రేటు

9999 ఈ నంబరు చాలా రేటు

  • రూ. ఆరు లక్షలు పలికిన సంఖ్య
  •  సొంతం చేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి
  •  ఇదే రికార్డు స్థాయి ధర
  • సాక్షి, విజయవాడ : రవాణా శాఖకు ఫ్యాన్సీ నంబర్లు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. వీటికోసం ఔత్సాహికులు పోటీపడుతూ భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నారు. కొందరైతే లక్షలు గుమ్మరించడానికి కూడా వెనకాడడం లేదు. వాహనదారుల నమ్మకమో లేక ఫ్యాన్సీ నంబర్లు వాడడం సోషల్ స్టేటస్‌గా భావిస్తున్నారో ఏమోగానీ పోటీ మాత్రం తీవ్రంగా ఉంది. రవాణా శాఖ కార్యాలయంలో నెలకు సగటున 200 ఫ్యాన్సీ నంబర్లకు బహిరంగ వేలం జరుగుతుండడమే ఇందుకు నిదర్శనం. ఏటా ఫ్యాన్సీ నంబర్ల విక్రయం ద్వారా కోట్ల రూపాయల్లో ఆదాయం సమకూరుతుంది.

    ముఖ్యంగా జిల్లాలో 9999 నంబర్ చాలా క్రేజీగా మారింది. దీన్ని దక్కించుకోవడానికి వాహనదారులు ఎంత ధర చెల్లించడానికైనా వెనుకాడడం లేదు. గత వారంలో ఏపీ-16 సిరీస్‌లో 9999 నంబర్‌ను నగరానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వేలంలో ఆరు లక్షల ఒక్క రూపాయికి దక్కించుకున్నారు. ఇప్పటివరకు ఇదే అత్యధిక ధరకు కొనుగోలు చేసిన నంబరు కావడం విశేషం. గతంలో లభించిన ధర రూ 4.5 లక్షలు. ఇదే నంబరు కోసం పోటిపడిన పలువురు వాహనదారులు రూ.5 లక్షల వరకు వేలంలో పాల్గొన్నారు.

    ఏటా ఫ్యాన్సీ నంబర్ల ద్వారా సుమారు  రూ. 2 కోట్ల ఆదాయం రవాణా శాఖకు సమకూరుతుంది. నంబర్ల కేటగిరీని బట్టి వెయ్యి నుంచి యాభై వేల వరకు ధర నిర్ణయించి ఆన్‌లైన్‌లో ఉంచుతారు. ఇదిలా ఉంటే.. జిల్లాలో వాహనాల రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. విజయవాడ రాజధాని అయిన తరువాత వాహన కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు అత్యధికంగా జరిగాయి. గడిచిన మూడు నెలల్లో నాలుగు వేలకు పైగా వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి.

    ఈ క్రమంలో ఖరీదైన ద్విచక్ర వాహనాలు, కార్లతోపాటు సాధారణ వాహనాలకు కూడా వేలకు వేలు చెల్లించి ఫ్యాన్సీ నంబర్లు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో కార్ల యజమానులు అధికంగా రూ. 50 వేల కేటగిరీలో ఉన్న 9999, 5555, 7777 లాంటి నంబర్ల కొనుగోలుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అలాగే రూ. 10 వేల కేటగిరీలో ఉన్న 3, 111, 6336 లాంటి నంబర్లు అత్యధికంగా ద్విచక్ర వాహనదారులు కొనుగోలు చేస్తున్నారు.

    విజయవాడ రాజధాని అయిన క్రమంలో భూముల ధరలు కోట్లకు చేరాయి. దీంతో రియల్టర్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆదాయం బాగా వస్తుండడంతో ఎంత ఖరీదైనా వెనుకాడకుండా ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకుంటున్నారు.  9999 నంబర్ కోసం ప్రతి పర్యాయం 10 నుంచి 15 మంది పోటీపడుతుంటారు.
     
    అంతా ఆన్‌లైన్‌లోనే..

    నంబర్ల రిజిస్ట్రేషన్ల ప్రకియ అంతా ఆన్‌లైన్‌లోనే సాగుతుంది. నిత్యం ప్రతి జిల్లాకు 1000 నంబర్లు కేటాయిస్తారు. వాటిలో ఫ్యాన్సీ నంబర్లను రిజర్వ్ చేస్తారు. ఫ్యాన్సీ  నంబర్ కోసం అయితే ఉదయం ముందుగా  రిజిస్ట్రేషన్ కోసం నిర్దేశించిన ఫీజును చెల్లించి ఆ తర్వాత వేలంలో పాల్గొనడానికి సదరు కేటగిరీ ధరను ముందుగా చెల్లించి మధ్నాహ్నం ఒంటిగంట నుంచి 3 గంటల వరకు టెండర్ స్వీకరణ సమయంలో ధరను కోడ్ చేసి టెండర్ దాఖలు చేయాలి. అత్యధిక ధర కోడ్ చేసిన వ్యక్తికి నంబర్‌ను కేటాయించి మిగిలిన వారికి ముందుగా చెల్లించిన నగదును తిరిగి ఇచ్చేస్తారు. ప్రస్తుతం ఏపీ 16 సీడబ్ల్యూ సిరీస్ నడుస్తోంది.  రూ .30 వేల కేటగిరిలో 99, 333, 555, 666, 777, 888, 2222, 3333, 4444, 5555, 6666, 7777, 8888 లాంటి నంబర్లు ఉన్నాయి. అలాగే రూ. 20 వేల కేటగిరీలో 123, 222, 369, 444, 567,786 లాంటి నంబర్లు ఉన్నాయి.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement