Real estate magnate
-
రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు
-
రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు
పేట్ బషీరాబాద్ ప్రాంతంలో ఘటన హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారిపై బుధవారం రాత్రి 10.45 గంటల సమయంలో ఓ వ్యక్తి రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. ఈ ఘటన నగరంలో కలకలం సృష్టించింది. పేట్‌బషీరాబాద్ బాపూనగర్‌కు చెందిన నాగేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వాజ్‌పేరుు నగర్‌కు చెందిన తేజ గత 3 నెలల నుంచి ఓ స్థల వివాదంలో నాగేందర్ రెడ్డితో వాగ్యుద్ధానికి దిగసాగాడు. ఈ క్రమంలోనే తేజ బుధవారం రాత్రి 10.45 గంటలకు బాపూనగర్‌లోని నాగేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి, రివాల్వర్‌ను ఆయన తలపై గురిపెట్టి కాల్చే ప్రయత్నం చేశాడు. దీన్ని తప్పించుకునే క్రమంలో నాగేందర్‌రెడ్డికి వెన్నులో బుల్లెట్ దిగింది. రెండో బుల్లెట్ మిస్‌ఫైర్ అరుుంది. నాగేందర్‌రెడ్డి అరవడంతో స్థానికులు తేజను పట్టుకొని పేట్‌బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. నాగేందర్‌రెడ్డి అపస్మారక స్థితికి చేరడంతో దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు తేజను అదుపులోకి తీసుకుని కాల్పుల ఘటనకు దారి తీసిన పరిస్థితులపై విచారిస్తున్నారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొటాల్పల్లి గ్రామ శివారులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. రోడ్డు పక్కన మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు వేగవంతం చేశారు. మృతుడు కామారెడ్డికి చెందిన చత్రబోయిన గంగాధర్(33)గా గుర్తించారు. రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న గంగాధర్‌ను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారి దుర్మరణం
పాలకొల్లు అర్బన్ : కారు చెట్టుకు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి తీవ్రగాయాలపాలై పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాలకొల్లు రూరల్ పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. మొగల్తూరు మండలం కేపీ పాలెం (సౌత్) ముచ్చర్లవారిమెరకు చెందిన ముచ్చర్ల అలెగ్జాండర్ (47), అతని పెద్దన్నయ్య కుమారుడు ముచ్చర్ల ఫణీంద్రనాథ్ భూపతి ఇరువురు కలిసి టాటా ఇండికా కారులో బుధవారం ఉదయం విశాఖపట్టణం బయలుదేరారు. అక్కడ పనులు ముగించుకుని తిరిగి ప్రయాణమయ్యారు. గురువారం తెల్లవారుజామున పాలకొల్లు - నరసాపురం రోడ్డులోని దిగమర్రు సెంటర్‌కి సమీపంలో నిద్రగన్నేరు చెట్టును ఢీకొట్టడంతో అలెగ్జాండర్ తలపగిలి, కాళ్లు విరిగి అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవింగ్ చేస్తున్న ఫణీంద్రనాథ్ భూపతి ఎడమకాలు విరిగిపోవడంతో భీమవరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడు అలెగ్జాండర్‌కు భార్య సుజాత, కుమార్తెలు మయూరి, తేజస్వి ఉన్నారు. పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. రూరల్ సీఐ ఆరిమిల్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎస్సై కెఎం వంశీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలెగ్జాండర్ వ్యాపార రీత్యా నరసాపురంలో స్థిరపడ్డాడు. పేరుపాలెం బీచ్‌లో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని అతనే నిర్మించాడు. -
9999 ఈ నంబరు చాలా రేటు
రూ. ఆరు లక్షలు పలికిన సంఖ్య సొంతం చేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇదే రికార్డు స్థాయి ధర సాక్షి, విజయవాడ : రవాణా శాఖకు ఫ్యాన్సీ నంబర్లు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. వీటికోసం ఔత్సాహికులు పోటీపడుతూ భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నారు. కొందరైతే లక్షలు గుమ్మరించడానికి కూడా వెనకాడడం లేదు. వాహనదారుల నమ్మకమో లేక ఫ్యాన్సీ నంబర్లు వాడడం సోషల్ స్టేటస్‌గా భావిస్తున్నారో ఏమోగానీ పోటీ మాత్రం తీవ్రంగా ఉంది. రవాణా శాఖ కార్యాలయంలో నెలకు సగటున 200 ఫ్యాన్సీ నంబర్లకు బహిరంగ వేలం జరుగుతుండడమే ఇందుకు నిదర్శనం. ఏటా ఫ్యాన్సీ నంబర్ల విక్రయం ద్వారా కోట్ల రూపాయల్లో ఆదాయం సమకూరుతుంది. ముఖ్యంగా జిల్లాలో 9999 నంబర్ చాలా క్రేజీగా మారింది. దీన్ని దక్కించుకోవడానికి వాహనదారులు ఎంత ధర చెల్లించడానికైనా వెనుకాడడం లేదు. గత వారంలో ఏపీ-16 సిరీస్‌లో 9999 నంబర్‌ను నగరానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వేలంలో ఆరు లక్షల ఒక్క రూపాయికి దక్కించుకున్నారు. ఇప్పటివరకు ఇదే అత్యధిక ధరకు కొనుగోలు చేసిన నంబరు కావడం విశేషం. గతంలో లభించిన ధర రూ 4.5 లక్షలు. ఇదే నంబరు కోసం పోటిపడిన పలువురు వాహనదారులు రూ.5 లక్షల వరకు వేలంలో పాల్గొన్నారు. ఏటా ఫ్యాన్సీ నంబర్ల ద్వారా సుమారు రూ. 2 కోట్ల ఆదాయం రవాణా శాఖకు సమకూరుతుంది. నంబర్ల కేటగిరీని బట్టి వెయ్యి నుంచి యాభై వేల వరకు ధర నిర్ణయించి ఆన్లైన్లో ఉంచుతారు. ఇదిలా ఉంటే.. జిల్లాలో వాహనాల రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. విజయవాడ రాజధాని అయిన తరువాత వాహన కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు అత్యధికంగా జరిగాయి. గడిచిన మూడు నెలల్లో నాలుగు వేలకు పైగా వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ క్రమంలో ఖరీదైన ద్విచక్ర వాహనాలు, కార్లతోపాటు సాధారణ వాహనాలకు కూడా వేలకు వేలు చెల్లించి ఫ్యాన్సీ నంబర్లు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో కార్ల యజమానులు అధికంగా రూ. 50 వేల కేటగిరీలో ఉన్న 9999, 5555, 7777 లాంటి నంబర్ల కొనుగోలుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అలాగే రూ. 10 వేల కేటగిరీలో ఉన్న 3, 111, 6336 లాంటి నంబర్లు అత్యధికంగా ద్విచక్ర వాహనదారులు కొనుగోలు చేస్తున్నారు. విజయవాడ రాజధాని అయిన క్రమంలో భూముల ధరలు కోట్లకు చేరాయి. దీంతో రియల్టర్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆదాయం బాగా వస్తుండడంతో ఎంత ఖరీదైనా వెనుకాడకుండా ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకుంటున్నారు. 9999 నంబర్ కోసం ప్రతి పర్యాయం 10 నుంచి 15 మంది పోటీపడుతుంటారు. అంతా ఆన్లైన్లోనే.. నంబర్ల రిజిస్ట్రేషన్ల ప్రకియ అంతా ఆన్లైన్లోనే సాగుతుంది. నిత్యం ప్రతి జిల్లాకు 1000 నంబర్లు కేటాయిస్తారు. వాటిలో ఫ్యాన్సీ నంబర్లను రిజర్వ్ చేస్తారు. ఫ్యాన్సీ నంబర్ కోసం అయితే ఉదయం ముందుగా రిజిస్ట్రేషన్ కోసం నిర్దేశించిన ఫీజును చెల్లించి ఆ తర్వాత వేలంలో పాల్గొనడానికి సదరు కేటగిరీ ధరను ముందుగా చెల్లించి మధ్నాహ్నం ఒంటిగంట నుంచి 3 గంటల వరకు టెండర్ స్వీకరణ సమయంలో ధరను కోడ్ చేసి టెండర్ దాఖలు చేయాలి. అత్యధిక ధర కోడ్ చేసిన వ్యక్తికి నంబర్‌ను కేటాయించి మిగిలిన వారికి ముందుగా చెల్లించిన నగదును తిరిగి ఇచ్చేస్తారు. ప్రస్తుతం ఏపీ 16 సీడబ్ల్యూ సిరీస్ నడుస్తోంది. రూ .30 వేల కేటగిరిలో 99, 333, 555, 666, 777, 888, 2222, 3333, 4444, 5555, 6666, 7777, 8888 లాంటి నంబర్లు ఉన్నాయి. అలాగే రూ. 20 వేల కేటగిరీలో 123, 222, 369, 444, 567,786 లాంటి నంబర్లు ఉన్నాయి. -
రియల్ఎస్టేట్ వ్యాపారి వెంకట్‌రెడ్డి అదృశ్యం
హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య గొడవలు ఎక్కువైపోయాయి. దానికి తోడు వారికి కొందరు పోలీసులు కూడా సహకరించడంతో వివాదాలు తీవ్రస్థాయికి దారి తీస్తున్నాయి. ఈ వివాదాలు, వేధింపులతో విసిగిపోయి నగరంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అదృశ్యమైయ్యాడు. ఆ వ్యాపారి కుటుంబ సభ్యులు మానవ హక్కుల సంఘం(హెచ్ఆర్సి)ను ఆశ్రయించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వెంకట్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని తోటి వ్యాపారులు చారి, గణేష్ రెడ్డి వేధిస్తున్నారు. వనస్థలిపురం సీఐ వారికి తోడై వెంకట్ రెడ్డిని ఎక్కువగా వేధించడం మొదలుపెట్టారు. దాంతో వెంకట్‌రెడ్డి సూసైడ్‌నోట్ రాసి అదృశ్యమయ్యాడు. ఈ మేరకు కుటుంబసభ్యులు హెచ్ఆర్సికి ఫిర్యాదు చేశారు. -
పోలీసుల వేధింపుల వల్లే కౌశిక్ కుటుంబం బలవన్మరణం!
సస్పెండైన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల హస్తం హైదరాబాద్: బెంగళూరులో గత నెల 27న రియల్ ఎస్టేట్ వ్యాపారి కౌశిక్ పునీత్‌శర్మ భార్య, ఇద్దరు పిల్లలు సహా ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కేసు కొత్త మలుపు తిరిగింది. ఓ భూమి వివాదంలో పోలీసుల వేధింపుల వల్లే వారు బలవన్మరణానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. నెల్లూరుకు చెందిన హవాలా వ్యాపారి సతీష్‌రెడ్డే కౌశిక్ పునీత్‌శర్మ అని బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. సతీష్‌రెడ్డి పేరుతో ఉన్న పాస్‌పోర్టు కౌశిక్ ఇంట్లో లభించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో హవాలా వ్యాపారంలో పెద్ద మొత్తంలో నష్టాలు రావడంతో బడా వ్యాపారులు తనను వేధిస్తారన్న ఉద్దేశంతోనే తాను చనిపోయినట్లుగా సతీష్‌రెడ్డి నాటకమాడినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. తర్వాత అక్కడి నుంచి పారిపోయి బెంగళూరుకు వచ్చిన సతీష్‌రెడ్డి... తన పేరును కౌశిక్ పునీత్శర్మగా మార్చుకున్నాడు. అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నా... తనకు పెళ్లి కాలేదని నమ్మించి శ్రీలత అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికీ కూతురు శ్రీరక్ష, కుమారుడు కౌస్తుబ్ సం తానం. హవాలా వ్యాపారం వదిలేసి రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించిన కౌశిక్ కోట్ల రూపాయల ఆస్తికి పడగలెత్తాడు. ఈ క్రమంలోనే ఓ భూ వివాదంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఇటీవల సస్పెన్షన్‌కు గురైన ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు వేధించడం వల్లే కౌశిక్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని బెంగళూరు పోలీసుల విచారణలో తేలింది. -
రియల్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం
= యాజమాని అక్కడికక్కడే మృతి = భార్య పరిస్థితి విషమం =నిలకడగా చిన్నారుల ఆరోగ్యం సంజీవరెడ్డినగర్, న్యూస్‌లైన్ : రియల్ ఎస్టేట్ వ్యాపారి కుటుంబ సభ్యులతో కలిసి లాడ్జిలో ఆత్మహత్యాయత్నం చేశాడు. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నిద్ర మాత్రలు మింగాడు. ఆయన మృతి చెందగా, భార్య పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. పిల్లల ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉంది. సంజీవరెడ్డినగర్ నగర్‌పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం ఈ ఘటన వెలుగుచూసింది. ఎస్సై సుదర్శణ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్ కాలనీలో నివసించే అనిల్‌కుమార్(45)భార్య లావణ్య దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. అలేఖ్య,అకిల, ఆకాశలు. స్థానికంగా ఉన్న ప్రైవేటు సంస్థల్లో చదువుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అనిల్‌కుమార్‌కు స్థానికంగా సొంత ఇల్లు ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం భాగా నడిచిన సమయంలో తెలిసిన వ్యక్తుల వద్ద డబ్బులు తీసుకుని చాలావరకు పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది .ఇటీవల ఈ రం గం నిలకడగా సాగడంతో పెట్టిన పెట్టుబడు లు అలాగే ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అంతేకాకుండా డబ్బులు ఇచ్చిన వ్యక్తులు డబ్బులు తిరిగి ఇవ్వాలని వెంటపడుతున్నారు. ఈ క్రమంలో అనిల్ కొద్దిరోజులనుండి ఇబ్బందులు పడ్డాడు. ఇక భరించలేక జీవితంపై విరక్తిచెంది ఉండవచ్చు. ఈ క్రమంలో నవంబరు 25న కుటుంబ సభ్యులతో కలిసి యూసుఫ్‌గూడలో ఉన్న హోటల్ మార్గిలో దిగాడు. రూం నంబర్ 308లో ఉంటున్న అనిల్ కుటుంబం 28 తేదీ ఉదయం టిఫిన్ తెప్పించుకుని తిన్నారు. మధ్యాహ్నం రూంబాయ్ ప్రసాద్‌తో వాటర్ బాటిల్ తెప్పించుకున్న అనిల్ ఆ తరువాత ఎలాంటి ఆడర్ చేయలేదు. మధ్యాహ్న భోజనం కూడాచేయకపోవడంతో అనుమానం వచ్చిన రూంబాయ్ సాయంత్రం 6 గంటలకు గది వద్దకు వచ్చాడు. బెల్‌కొట్టినా లోపలినుంచి ఎలాంటి సమాధానం రాలేదు. డోరు తట్టిచూడగా లోపలి నుంచి గడియ పెట్టకపోవడంతో తలుపులు తెరుచుకున్నాయి. గదిలో అందరూ ఎక్కడికక్కడ అపస్మారక స్థితిలో పడిఉండటాన్ని గమనించిన ప్రసాద్ హోటల్ యజమానులకు సమాచారం అందించాడు. పోలీసులకు సమాచారం అందించగా లాడ్జీకి వచ్చిన పోలీసులు లోపలికి వెళ్లి చూడగా అనిల్ అప్పటికే మృతిచెంది ఉన్నట్లు గుర్తించారు. ప్రాణాలతో ఉన్న భార్య, ముగ్గురు పిల్లలను చికిత్సనిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎస్ఆర్నగర్ యాక్సన్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న భార్య లావణ్య ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉండగా, పిల్లలు వికేర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. పరిస్థితి బాగానేఉందని పోలీసులు తెలిపారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. హోటల్లో లభించిన స్లీపింగ్ ట్యాబ్లెట్ డబ్బాను, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.