రియల్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం
= యాజమాని అక్కడికక్కడే మృతి
= భార్య పరిస్థితి విషమం
=నిలకడగా చిన్నారుల ఆరోగ్యం
సంజీవరెడ్డినగర్, న్యూస్‌లైన్ : రియల్ ఎస్టేట్ వ్యాపారి కుటుంబ సభ్యులతో కలిసి లాడ్జిలో ఆత్మహత్యాయత్నం చేశాడు. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నిద్ర మాత్రలు మింగాడు. ఆయన మృతి చెందగా, భార్య పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. పిల్లల ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉంది. సంజీవరెడ్డినగర్ నగర్‌పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం ఈ ఘటన వెలుగుచూసింది. ఎస్సై సుదర్శణ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్ కాలనీలో నివసించే అనిల్‌కుమార్(45)భార్య లావణ్య దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. అలేఖ్య,అకిల, ఆకాశలు. స్థానికంగా ఉన్న ప్రైవేటు సంస్థల్లో చదువుకుంటున్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అనిల్‌కుమార్‌కు స్థానికంగా సొంత ఇల్లు ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం భాగా నడిచిన సమయంలో తెలిసిన వ్యక్తుల వద్ద డబ్బులు తీసుకుని చాలావరకు పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది .ఇటీవల ఈ రం గం నిలకడగా సాగడంతో పెట్టిన పెట్టుబడు లు అలాగే ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అంతేకాకుండా డబ్బులు ఇచ్చిన వ్యక్తులు డబ్బులు తిరిగి ఇవ్వాలని వెంటపడుతున్నారు. ఈ క్రమంలో అనిల్ కొద్దిరోజులనుండి ఇబ్బందులు పడ్డాడు. ఇక భరించలేక జీవితంపై విరక్తిచెంది ఉండవచ్చు.
ఈ క్రమంలో నవంబరు 25న కుటుంబ సభ్యులతో కలిసి యూసుఫ్‌గూడలో ఉన్న హోటల్ మార్గిలో దిగాడు. రూం నంబర్ 308లో ఉంటున్న అనిల్ కుటుంబం 28 తేదీ ఉదయం టిఫిన్ తెప్పించుకుని తిన్నారు. మధ్యాహ్నం రూంబాయ్ ప్రసాద్‌తో వాటర్ బాటిల్ తెప్పించుకున్న అనిల్ ఆ తరువాత ఎలాంటి ఆడర్ చేయలేదు. మధ్యాహ్న భోజనం కూడాచేయకపోవడంతో అనుమానం వచ్చిన రూంబాయ్ సాయంత్రం 6 గంటలకు గది వద్దకు వచ్చాడు.
బెల్‌కొట్టినా లోపలినుంచి ఎలాంటి సమాధానం రాలేదు. డోరు తట్టిచూడగా లోపలి నుంచి గడియ పెట్టకపోవడంతో తలుపులు తెరుచుకున్నాయి. గదిలో అందరూ ఎక్కడికక్కడ అపస్మారక స్థితిలో పడిఉండటాన్ని గమనించిన ప్రసాద్ హోటల్ యజమానులకు సమాచారం అందించాడు. పోలీసులకు సమాచారం అందించగా లాడ్జీకి వచ్చిన పోలీసులు లోపలికి వెళ్లి చూడగా అనిల్ అప్పటికే మృతిచెంది ఉన్నట్లు గుర్తించారు. ప్రాణాలతో ఉన్న భార్య, ముగ్గురు పిల్లలను చికిత్సనిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఎస్‌ఆర్‌నగర్ యాక్సన్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న భార్య లావణ్య ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉండగా, పిల్లలు వికేర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. పరిస్థితి బాగానేఉందని పోలీసులు తెలిపారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. హోటల్‌లో లభించిన స్లీపింగ్ ట్యాబ్‌లెట్ డబ్బాను, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.