రిజిస్ట్రేషన్ల బాదుడుకు ఏపీ సర్కార్ రెడీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఆస్తులు, భూముల ప్రభుత్వ విలువలు పెంచి రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఆదాయాన్ని రాబట్టేందుకు రాష్ట్ర సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. ప్రైవేటు మార్కెట్ విలువలో సగానికి పైగా పెంచేందుకు ప్రణాళిక సిద్ధమైంది. పెంచిన విలువలను ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ క్రమంలో భూములు, ప్లాట్ల మార్కెట్ విలువలు పెంచి ఆపై రిజిస్ట్రేషన్ల స్టాంప్ డ్యూటీ ద్వారా జనాన్ని అడ్డంగా బాదేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది.
కొద్ది రోజులుగా రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో భూములు, స్థలాల విలువలు పెంచేందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించి నివేదికలు రూపొందించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ నాలుగు జోన్లలోని 13 జిల్లాల్లో ఏడాదికి రూ. 4,085 కోట్ల ఆదాయం సాధించాలని గత నెలలో లక్ష్యం విధించారు.
ఈ ఆదాయాన్ని మరో రెండు వేల కోట్లు పెంచేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రణాళిక ఇచ్చినట్లు సమాచారం. కొత్త రాజధాని, పలు విద్యాసంస్థల ఏర్పాటు నేపథ్యంలో గుంటూరు, విజయవాడతో పాటు రాజమండ్రి, విశాఖపట్నం తదితర చోట్ల ప్రైవేట్ మార్కెట్ విలువలు ఎంత ఉన్నాయనే విషయమై వీఆర్‌ఓల ద్వారా సమాచారం సేకరించారు. బహిరంగ మార్కెట్ విలువలతో పాటు ప్రభుత్వ మార్కెట్ విలువలుండే విధంగా అధికారులు నివేదికలు ఇచ్చినట్లు సమాచారం.
ఈ నివేదికల ప్రకారం విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, వైజాగ్ తదితర నగరాలతో పాటు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం ముమ్మరంగా జరిగే పట్టణాలు, గ్రామాలను గుర్తించి దాదాపు ఇప్పుడున్న ప్రభుత్వ మార్కెట్ విలువలకు నూటికి నూరు శాతం పెంచేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ తుది కసరత్తు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ నివేదికపై ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో ఆమోదముద్ర వేయనున్నట్లు తెలిసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని 267 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఆయా ఏరియాల్లో ఉన్న బహిరంగ మార్కెట్ విలువల ప్రకారం ప్రభుత్వ మార్కెట్ విలువలు పెంచనున్నారు.
కొత్త జంటనగరాలపై గురి..
జంటనగరాలుగా గుంటూరు, విజయవాడను అభివృద్ధి చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఈ రెండు నగరాల మధ్య కొత్త రాజధాని ఏర్పడుతుందన్న ప్రచారంతో భూముల విలువలు అమాంతం పెరిగాయి. ప్రభుత్వం కూడా ఈ రెండు జిల్లాల్లో భారీగా విలువలు పెంచి తద్వారా అధిక స్టాంపు డ్యూటీ సాధించి ఖజానా నింపుకోవటానికి రంగం సిద్ధం చేసిందని చెప్తున్నారు. ఇప్పటికే విజయవాడతో కలుపుకొని కృష్ణా జిల్లాకు రూ. 615 కోట్లు, గుంటూరు జిల్లాకు రూ. 433 కోట్ల టార్గెట్‌ను అధికారులు విధించారు.