తాత్కాలిక కార్యాలయాలు
అరండల్‌పేట(గుంటూరు) : రాజధాని నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలను విజయవాడ, గుంటూరుల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే విద్యాశాఖకు సంబంధించి ఆర్జేడీ కార్యాలయాన్ని గుంటూరులో ఏర్పాటు చేశారు.
ఆ తరువాత గుంటూరు నగరంలో వ్యవసాయ, అనుబంధ శాఖలు, పురపాలక శాఖ తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసం మంగళవారం రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే మిర్చియార్డులో భవనాలను పరిశీలించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఈ రెండు కార్యాలయాలు ఏర్పాటుకు సంబంధించి జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, ఎస్పీ రాజేష్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. మంత్రి ప్రత్తిపాటి ఈ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ఆయన ఇక్కడే ఉంటున్నారు.
ఇక రాష్ట్రపురపాలక శాఖా మంత్రి పి.నారాయణ రాజధాని భూ సమీకరణ పనులు పర్యవేక్షిస్తూ గుంటూరులోనే ఉంటున్నారు. ఇక్కడి నుంచే రాష్ట్రపురపాలకశాఖ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో పురపాలక, వ్యవసాయ శాఖల తాత్కాలిక కార్యాలయాలు ఇక్కడే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
దీన్ని దృష్టిలో పెట్టుకొని మార్కెట్‌యార్డులోని నూతన భవనాన్ని ఇందుకోసం ఎంపిక చేశారు. ఈ భవనం 30వేల అడుగుల విస్తీర్ణంలో ఉండటంతో రెండు శాఖల అధికారులకు ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆరునెలల పాటు తాత్కాలిక పద్ధతిలో ఈ కార్యాలయాలు ఉంటాయి. అయితే వీటికి ముఖ్యమంత్రి ఆమోదం లభించాల్సివుంది.