వీధివీధిలో ‘బాబ్బాబులే’
► రాష్ట్రమంతా గణనీయంగా పెరిగిన యాచకులు
► పొరుగు రాష్ట్రాల నుంచి ప్రధాన పట్టణాలకు వలస
► భిక్షాటనను జీవనోపాధిగా ఎంచుకుంటున్న యువత
► టిఫిన్ సెంటర్లకు కమీషన్ పద్ధతిలో చిల్లర సరఫరా
విజయవాడ: రాష్ట్రంలో ఎక్కడ చూసినా బాబ్బాబు.. అంటూ యాచకులు కనిపిస్తున్నారు. రోజురోజుకీ వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రెండేళ్ల కిందటి గణాంకాలతో పోలిస్తే అన్ని ప్రధాన పట్టణాల్లోనూ వీరి సంఖ్య 30 నుంచి 40 శాతం పెరిగింది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో వీరి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఒకప్పుడు కడుపు నింపుకోవడానికి మొదలైన భిక్షాటన మారుతున్న కాలంలో ఆదాయ వనరుగా మారింది. శరీరంలో శక్తి సన్నగిల్లి ఏ పనీ చేయలేక పొట్టకూటి కోసం యాచన చేసే వృద్ధులు, వికలాంగుల జాబితాలో కొత్తగా యువతీయువకులు కూడా చేరిపోతున్నారు. రకరకాల కారణాలు, కొత్తకొత్త వేషాలతో భిక్షాటనకు దిగుతున్నారు.
తాగుడు, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసలైన యువకులు భిక్షాటన చేస్తున్నారు. ఓ సర్వే ప్రకారం రెండేళ్ల కిందట రాష్ట్రంలో వీరి సంఖ్య 3.50 లక్షలు కాగా ఇప్పుడు 5 లక్షలు దాటింది. తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పోలీసుల వేధింపులు ఎక్కువ కావడంతో ఏడాది కాలం నుంచి వేలాది మంది యాచకులు రాష్ట్రానికి వలస వచ్చారు. ప్రధాన నగర శివారుల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని భిక్షాటన చేస్తున్నారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో వీరి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. సుమారు 90 వేల మందికి పైగా రోజూ ట్రాఫిక్ సిగ్నళ్లు, ఆలయాలు, ఇతరత్రా రద్దీ ప్రదేశాల్లో చిల్లర యాచన చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒక్కొక్కరి ఆదాయం రోజుకు రూ. 500 నుంచి రూ.800 ఉంటోంది.
విజయవాడలోనే ఎక్కువ...
యాచకుల సంఖ్య బెజవాడలోనే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. నిత్యం రద్దీగా ఉండే బెంజిసర్కిల్, లబ్బీపేట, బీసెంట్‌రోడ్, లెనిన్ సెంటర్, రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాలతో పాటు ఇంద్రకీలాద్రి దిగువన కూడా వీరు ప్రతి పదినిమిషాలకొకరు సంచరిస్తున్నారు. గుంటూరులో సుమారు 3 వేల మందికిపైగా బిచ్చగాళ్లు ఉన్నట్లు అంచనా. తిరుపతిలోని కపిలతీర్థం, నాలుగుకాళ్లమండపం, రైల్వేస్టేషన్‌లో చిల్లర వేస్తే తప్ప భక్తులను వదిలి పెట్టడంలేదు. విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాల్లో సీనియర్ యాచకులందరూ గ్రూపుగా ఏర్పడి కొత్తగా వచ్చే యాచకులపై బెదిరింపులకు దిగుతున్నారు. గుంటూరు, విజయవాడల్లో ఆటో డ్రైవర్లతో యాచకులు చిల్లర కమీషన్ వ్యాపారం చేస్తున్నారు. ఈ రెండు నగరాల్లోనూ పాతిక మందికి పైగా లక్షాధికారులైన బిచ్చగాళ్లు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే మరి.