commission business
-
Google: దిగొచ్చిన గూగుల్.. సగానికి సగం తగ్గింపు
Google Play Business Lower Fees: యాప్ డెవలపర్స్‌కు గూగుల్ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్లే స్టోర్ సబ్ స్క్రిప్షన్ కమిషన్‌ను భారీగా తగ్గించుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఇది 30 శాతం ఉండగా.. సగానికి సగం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది గూగుల్. ఆండ్రాయిడ్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించడంతో పాటు థర్డ్ పార్టీగా ఉంటూ యాప్ డెవలపర్స్‌ను సైతం ఇబ్బంది పెడుతోందన్న ఆరోపణలు గూగుల్ ఎదుర్కొంటోంది. సబ్ స్క్రిప్షన్ బేస్డ్ బిజినెస్ ద్వారా అడ్డగోలు ఛార్జీలు వసూలు చేస్తూ వేధిస్తోందని భారత్ సహా చాలా దేశాల్లో గూగుల్ విచారణ, దర్యాప్తులను ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో కమిషన్‌ను భారీగా తగ్గించుకుంటున్నట్లు ప్రకటించింది. సబ్ స్క్రిప్షన్ కమిషన్ ఫీజును ఏకంగా 30 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది గూగుల్. అయితే మొదటి 1 మిలియన్ డాలర్ల మీద మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుందని డెవలపర్స్‌కు సూచించింది. తద్వారా యాప్ మేకర్స్‌కు భారీ ఊరట లభించినట్లయ్యింది. గూగుల్ గణాంకాల ప్రకారం.. ఈ బంపరాఫర్ సుమారు 99 శాతం డెవలపర్స్‌కు వర్తించనుందట. తగ్గించిన కమిషన్ ఫీజును.. జనవరి 1, 2022 నుంచి అమలు చేయనుంది. ఈ తగ్గింపుతో పాటు మీడియా యాప్స్ మీద సర్వీస్ ఫీజును 10 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్లే మీడియా ఎక్స్‌పీరియెన్స్ ప్రోగ్రామ్ కింద.. ఈ-బుక్స్, ఆన్ డిమాండ్ మ్యూజిక్, వీడియో సర్వీసులకు ఈ ఆఫర్ వర్తించనుంది. మీడియా బేస్డ్ యాప్స్ గూగుల్‌తో చేసే బిజినెస్ ఇది. ఉదాహరణకు.. యూట్యూబ్ మ్యూజిక్, స్పోటిఫైతో కలిసి చేస్తున్న ఒప్పందం లాగా అన్నమాట. క్లౌడ్ మార్కెట్‌ప్లేస్ నుంచి సాఫ్ట్‌వేర్‌ను ఇతరుల నుంచి కొన్నప్పుడు కూడా గూగుల్ కొంత పర్సంటేజ్ తీసుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కమిషన్ కూడా విమర్శలు వెల్లువెత్తగా.. ఆ కమిషన్‌ను 20 నుంచి 3 శాతానికి తగ్గించుకున్నట్లు ఈ మధ్యే ప్రకటించింది కూడా. చదవండి: గూగుల్ కమిషన్ కక్కుర్తికి దెబ్బేసిన సౌత్ కొరియా ఇదీ చదవండి: భారత్ యాక్షన్.. గూగుల్ కౌంటర్ రియాక్షన్ -
చిల్లర నాణేలకు డిమాండ్
-కమీషన్లపై కొంటున్న వ్యాపారులు - కృత్రిమ కొరతను సృష్టిస్తున్న బడా వ్యాపారులు - నగరంలో నిత్యం రూ. 5 కోట్ల వరకు వ్యాపారం నల్లకుంట ఏంటీ చిల్లర నాణేలే కదా అని ఈజీగా తీసుకుంటున్నారా? ఆ చిల్లర నాణేలతో కమీషన్ వ్యాపారాలు చేస్తున్న కొందరు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అంబర్‌పేట నియోజక వర్గంలో చిల్లర నాణేల వ్యాపారులు కమీషన్ల పేరుతో చిరువ్యాపారులను దోచుకుంటున్నారు. బడా వ్యాపారులు బ్యాంకుల నుంచి చిల్లర నాణేలను తీసుకుంటూ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో నిత్యం రూ.5 కోట్ల వరకు చిల్లర నాణేల వ్యాపారం జరుగుతోందని అంచనా. చిల్లర నాణేల చెలామణి తక్కువగా ఉండడంతో నూటికి రూ.8 నుంచి రూ.10 శాతం కమీషన్ ఇచ్చి వీటిని కొనుగోలు చేస్తున్నట్లు కొందరు వ్యాపారులు చెబుతున్నారు. రూపాయి, రెండు రూపాయల చిల్లరను కొన్ని సందర్భాల్లో ఇటు వినియోగదారులు, అటు వ్యాపారులు వదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దాదాపు 80 శాతం మంది వ్యాపారులు కమీషన్ పద్దతిలోనే చిల్లరను సమకూర్చుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు. దీన్ని అదునుగా చేసుకుంటున్న కొంతమంది వ్యాపారులు చిల్లర కొరత సృష్టించి లక్షలాది రూపాలయను సంపాదిస్తున్నారు. సంతలు, మార్కెట్లలో అవసరం.. అంబర్‌పేట నియోజకవర్గంలోని వారపు సంతలు, మెడికల్ షాపులు, టిఫిన్ సెంటర్లు, మార్కెట్లలో చిల్లర వినియోగం ఎక్కువగా ఉంటోంది. సుమారుగా 25 వేలకు పైగా చిన్న, పెద్ద దుకాణదారులు నిత్యం వ్యాపారం చేస్తుంటారు. వారు నిత్యం రూ.300 నుంచి రూ.800 వరకు చిల్లరను వినియోగిస్తుంటారని అంచనా. కనీసం రూ.200 వరకు చిల్లర నాణేలను సమకూర్చుకోకుంటే వ్యాపారం చేయలేని పరిస్థితి. ఇక బస్సులు, రైళ్ల చార్జీల విషయంలో చిల్లర అవసరం. రేషన్ దుకాణాలు సైతం చిల్లర నాణేలు లేనిదే నడవని పరిస్థితి నెలకొంది. వీటితో పాటు పలు సందర్భాల్లో చిల్లర అవసరం. రూ.15 లక్షల కమీషన్.. చిల్లర వ్యాపారంలో కమీషన్లను పరిశీలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. సుమారు రూ. 15 లక్షలకు పైగానే కమీషన్ సంపాదిస్తున్నారని అంచనా. ఇందు కోసం ప్రతి పట్టణంలో ప్రత్యేకంగా వ్యాపారులుండగా మరి కొన్నిచోట్ల పాన్ షాపులు, జనరల్ స్టోర్ వ్యాపారులు, ఫైనాన్స్, వడ్డీ వ్యాపారులు కూడా ఈ చిల్లర వ్యాపారాన్ని చేస్తున్నట్లు సమాచారం, ఉదయం దుకాణాలు తెరిచిన వెంటనే చిల్లర నాణేల సరఫరా జరిగిపోతుంది. సంతల్లో అక్కడికే చిల్లర తీసుకు వచ్చి కమీషన్ తీసుకుంటున్నారు. ఇలా సేకరిస్తున్నారు.. దేవాలయాల హుండీలను లెక్కించే సమయంలో అక్కడి అధికారులను మచ్చిక చేసుకొని కమీషన్ వ్యాపారులు చిల్లర సేకరిస్తున్నారని తేలింది. దేవాలయాల వద్ద యాచకుల నుంచి కూడా పెద్ద మొత్తంలో చిల్లర సేకరిస్తున్నారు. అలాగే గ్రామాల్లో చిన్న చిన్న దుకాణాల నుంచి రూ. 5 కమీషన్ చొప్పున చిల్లర నాణేలు సేకరించి తిరిగి వాటిని నగరాల్లో రూ. 8 నుంచి రూ.10 లకు సరఫరా చేస్తున్నారు. ఈ చిల్లర దోపిడి వ్యాపారులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పలువురు అంటున్నారు. -
వీధివీధిలో ‘బాబ్బాబులే’
► రాష్ట్రమంతా గణనీయంగా పెరిగిన యాచకులు ► పొరుగు రాష్ట్రాల నుంచి ప్రధాన పట్టణాలకు వలస ► భిక్షాటనను జీవనోపాధిగా ఎంచుకుంటున్న యువత ► టిఫిన్ సెంటర్లకు కమీషన్ పద్ధతిలో చిల్లర సరఫరా విజయవాడ: రాష్ట్రంలో ఎక్కడ చూసినా బాబ్బాబు.. అంటూ యాచకులు కనిపిస్తున్నారు. రోజురోజుకీ వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రెండేళ్ల కిందటి గణాంకాలతో పోలిస్తే అన్ని ప్రధాన పట్టణాల్లోనూ వీరి సంఖ్య 30 నుంచి 40 శాతం పెరిగింది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో వీరి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఒకప్పుడు కడుపు నింపుకోవడానికి మొదలైన భిక్షాటన మారుతున్న కాలంలో ఆదాయ వనరుగా మారింది. శరీరంలో శక్తి సన్నగిల్లి ఏ పనీ చేయలేక పొట్టకూటి కోసం యాచన చేసే వృద్ధులు, వికలాంగుల జాబితాలో కొత్తగా యువతీయువకులు కూడా చేరిపోతున్నారు. రకరకాల కారణాలు, కొత్తకొత్త వేషాలతో భిక్షాటనకు దిగుతున్నారు. తాగుడు, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసలైన యువకులు భిక్షాటన చేస్తున్నారు. ఓ సర్వే ప్రకారం రెండేళ్ల కిందట రాష్ట్రంలో వీరి సంఖ్య 3.50 లక్షలు కాగా ఇప్పుడు 5 లక్షలు దాటింది. తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పోలీసుల వేధింపులు ఎక్కువ కావడంతో ఏడాది కాలం నుంచి వేలాది మంది యాచకులు రాష్ట్రానికి వలస వచ్చారు. ప్రధాన నగర శివారుల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని భిక్షాటన చేస్తున్నారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో వీరి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. సుమారు 90 వేల మందికి పైగా రోజూ ట్రాఫిక్ సిగ్నళ్లు, ఆలయాలు, ఇతరత్రా రద్దీ ప్రదేశాల్లో చిల్లర యాచన చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒక్కొక్కరి ఆదాయం రోజుకు రూ. 500 నుంచి రూ.800 ఉంటోంది. విజయవాడలోనే ఎక్కువ... యాచకుల సంఖ్య బెజవాడలోనే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. నిత్యం రద్దీగా ఉండే బెంజిసర్కిల్, లబ్బీపేట, బీసెంట్‌రోడ్, లెనిన్ సెంటర్, రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాలతో పాటు ఇంద్రకీలాద్రి దిగువన కూడా వీరు ప్రతి పదినిమిషాలకొకరు సంచరిస్తున్నారు. గుంటూరులో సుమారు 3 వేల మందికిపైగా బిచ్చగాళ్లు ఉన్నట్లు అంచనా. తిరుపతిలోని కపిలతీర్థం, నాలుగుకాళ్లమండపం, రైల్వేస్టేషన్లో చిల్లర వేస్తే తప్ప భక్తులను వదిలి పెట్టడంలేదు. విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాల్లో సీనియర్ యాచకులందరూ గ్రూపుగా ఏర్పడి కొత్తగా వచ్చే యాచకులపై బెదిరింపులకు దిగుతున్నారు. గుంటూరు, విజయవాడల్లో ఆటో డ్రైవర్లతో యాచకులు చిల్లర కమీషన్ వ్యాపారం చేస్తున్నారు. ఈ రెండు నగరాల్లోనూ పాతిక మందికి పైగా లక్షాధికారులైన బిచ్చగాళ్లు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే మరి.