-కమీషన్లపై కొంటున్న వ్యాపారులు
- కృత్రిమ కొరతను సృష్టిస్తున్న బడా వ్యాపారులు
- నగరంలో నిత్యం రూ. 5 కోట్ల వరకు వ్యాపారం
నల్లకుంట
ఏంటీ చిల్లర నాణేలే కదా అని ఈజీగా తీసుకుంటున్నారా? ఆ చిల్లర నాణేలతో కమీషన్ వ్యాపారాలు చేస్తున్న కొందరు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అంబర్‌పేట నియోజక వర్గంలో చిల్లర నాణేల వ్యాపారులు కమీషన్ల పేరుతో చిరువ్యాపారులను దోచుకుంటున్నారు. బడా వ్యాపారులు బ్యాంకుల నుంచి చిల్లర నాణేలను తీసుకుంటూ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో నిత్యం రూ.5 కోట్ల వరకు చిల్లర నాణేల వ్యాపారం జరుగుతోందని అంచనా. చిల్లర నాణేల చెలామణి తక్కువగా ఉండడంతో నూటికి రూ.8 నుంచి రూ.10 శాతం కమీషన్ ఇచ్చి వీటిని కొనుగోలు చేస్తున్నట్లు కొందరు వ్యాపారులు చెబుతున్నారు.
రూపాయి, రెండు రూపాయల చిల్లరను కొన్ని సందర్భాల్లో ఇటు వినియోగదారులు, అటు వ్యాపారులు వదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దాదాపు 80 శాతం మంది వ్యాపారులు కమీషన్ పద్దతిలోనే చిల్లరను సమకూర్చుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు. దీన్ని అదునుగా చేసుకుంటున్న కొంతమంది వ్యాపారులు చిల్లర కొరత సృష్టించి లక్షలాది రూపాలయను సంపాదిస్తున్నారు. సంతలు, మార్కెట్లలో అవసరం.. అంబర్‌పేట నియోజకవర్గంలోని వారపు సంతలు, మెడికల్ షాపులు, టిఫిన్ సెంటర్లు, మార్కెట్లలో చిల్లర వినియోగం ఎక్కువగా ఉంటోంది. సుమారుగా 25 వేలకు పైగా చిన్న, పెద్ద దుకాణదారులు నిత్యం వ్యాపారం చేస్తుంటారు. వారు నిత్యం రూ.300 నుంచి రూ.800 వరకు చిల్లరను వినియోగిస్తుంటారని అంచనా.
కనీసం రూ.200 వరకు చిల్లర నాణేలను సమకూర్చుకోకుంటే వ్యాపారం చేయలేని పరిస్థితి. ఇక బస్సులు, రైళ్ల చార్జీల విషయంలో చిల్లర అవసరం. రేషన్ దుకాణాలు సైతం చిల్లర నాణేలు లేనిదే నడవని పరిస్థితి నెలకొంది. వీటితో పాటు పలు సందర్భాల్లో చిల్లర అవసరం. రూ.15 లక్షల కమీషన్.. చిల్లర వ్యాపారంలో కమీషన్లను పరిశీలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. సుమారు రూ. 15 లక్షలకు పైగానే కమీషన్ సంపాదిస్తున్నారని అంచనా. ఇందు కోసం ప్రతి పట్టణంలో ప్రత్యేకంగా వ్యాపారులుండగా మరి కొన్నిచోట్ల పాన్ షాపులు, జనరల్ స్టోర్ వ్యాపారులు, ఫైనాన్స్, వడ్డీ వ్యాపారులు కూడా ఈ చిల్లర వ్యాపారాన్ని చేస్తున్నట్లు సమాచారం, ఉదయం దుకాణాలు తెరిచిన వెంటనే చిల్లర నాణేల సరఫరా జరిగిపోతుంది. సంతల్లో అక్కడికే చిల్లర తీసుకు వచ్చి కమీషన్ తీసుకుంటున్నారు.
ఇలా సేకరిస్తున్నారు.. దేవాలయాల హుండీలను లెక్కించే సమయంలో అక్కడి అధికారులను మచ్చిక చేసుకొని కమీషన్ వ్యాపారులు చిల్లర సేకరిస్తున్నారని తేలింది. దేవాలయాల వద్ద యాచకుల నుంచి కూడా పెద్ద మొత్తంలో చిల్లర సేకరిస్తున్నారు. అలాగే గ్రామాల్లో చిన్న చిన్న దుకాణాల నుంచి రూ. 5 కమీషన్ చొప్పున చిల్లర నాణేలు సేకరించి తిరిగి వాటిని నగరాల్లో రూ. 8 నుంచి రూ.10 లకు సరఫరా చేస్తున్నారు. ఈ చిల్లర దోపిడి వ్యాపారులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పలువురు అంటున్నారు.