రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు ఇప్పట్లో తొలగేటట్లు కన్పించడంలేదు.
తుళ్ళూరు రూరల్: రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు ఇప్పట్లో తొలగేటట్లు కన్పించడంలేదు. తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలను రాజధాని ప్రాంతాలుగా ప్రకటన వెలువడడంతో ట్రాఫిక్ సమస్య తెరపైకి వచ్చింది. రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పెరగడం, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రముఖుల రాకపోకల తాకిడి అధికం కావడంతో రద్దీ ఎక్కువైంది. తుళ్ళూరులోని లైబ్రరీ సెంటర్, మందడం, తాడేపల్లిలోని ఉండవల్లి సెంటర్లలో రోడ్డు దాటాలంటే పడే అవస్థ అంతాఇంతా కాదు. ఈ నేపథ్యంలో అక్టోబరు 22న జరిగిన రాజధాని శంకుస్థాపన సందర్భంగా రోడ్ల విస్తరణ పనులు ప్రభుత్వం చేపట్టింది.
ట్రాఫిక్ కష్టాల నివారించేందుకు కొత్తగా రోడ్ల నిర్మాణం జరిపింది. ఇందులో భాగంగా రాయపూడి-తుళ్ళూరు మధ్య వడ్డగిరి దగ్గరి నుంచి అమరావతి వైపుకు వెళ్ళేందుకు వీలుగా కొత్తగా ైబె పాస్ రోడ్డు నిర్మించారు. దీంతో వాహనాల మళ్ళింపుతో తుళ్ళూరులో ట్రాఫిక్ కష్టాలు తొలుగుతాయని అందరూ భావించారు. కానీ అలా జరగక పోగా, తీవ్రతరమయ్యాయని ప్రయాణికులతో పాటు స్థానికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ,అమరావతి వైపు నుంచి రాకపోకలు సాగించే లారీలను, వాహనాలను తుళ్ళూరు వద్ద నుంచి దారి మళ్లీంచాలని స్థానికులు కోరుతున్నారు.