చావనైనా చస్తాం.. | Castam positively .. | Sakshi
Sakshi News home page

చావనైనా చస్తాం..

Published Sat, Nov 8 2014 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM

చావనైనా చస్తాం..

చావనైనా చస్తాం..

సాక్షిప్రతినిధి, గుంటూరు
 చావనైనా చస్తాం కాని రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సెంటు భూమి కూడా కోల్పోయేందుకు సిద్ధంగా లేం. ఇదీ రాజధాని ప్రతిపాదిత తుళ్లూరు మండలంలోని గ్రామాల రైతుల ఆవేదన.. నూతన రాజధాని నిర్మాణానికి ప్రతిపాదించిన 18 గ్రామాల్లో  30వేల ఎకరాల భూములు సమీకరించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

తొలిదశలో తుళ్లూరు మండలంలో 15 గ్రామాలు(వెంకటపాలెంతో కలిపి), మంగళగిరి రూరల్ మండలంలో 3 గ్రామాల్లో భూముల సమీకరణకు ప్రభుత్వం ఇప్పటికే రంగం సిద్ధం చేయడంతో రెతులంతా సంఘటితమవుతున్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్నారు.

     పచ్చని పొలాల్లో రాజధాని నిర్మాణం ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతుల భూములతో రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తారా అంటూ విరుచుకుపడుతున్నారు.

      మూడు పంటలు పండే భూములను ఇచ్చి తామేం చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ భూములపై రైతులు, రైతుకూలీలు ఆధారపడి ఉన్నారని, వారికి జీవనోపాధి ఎలా కల్పిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 ల్యాండ్ పూలింగ్‌కు చట్టబద్ధత ఏదీ...?
      ఇదిలా ఉంటే మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్‌పూలింగ్ విధానానికి చట్టబద్ధత లేదు. పంటలు పండే  భూమూలను సమీకరించకూడదని సుప్రీంకోర్టు  జారీ చేసిన ఆదేశాలను రైతు నాయకులు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.

      భూ సమీకరణపై ప్రభుత్వం ఎలాంటి జీవోలు జారీ చేయలేదు. కేవలం ఎకరా భూమి ఇస్తే వెయ్యిగజాల స్థలాన్ని అభివృద్ధి చేసి ఇస్తామని మాత్రమే ప్రభుత్వం ప్రకటించింది. ఆ భూమి ఎక్కడ ఇస్తారు, ఎలా ఇస్తారు వంటి ప్రశ్నలకు అధికారుల వద్ద కూడా స్పష్టత లేదు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

 చంద్రబాబును నమ్మేదెలా..?
      రైతు, డ్వాక్రా,చేనేత రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీలిచ్చి ఓ ట్లు దండుకున్న చంద్రబాబు అధికారం చేపట్టి ఐదునెలలైంది. ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకూ రుణ మాఫీ చేయలేకపోయారు.ఇలాంటి వ్యక్తిని ఎలా నమ్మాలని రాజధాని ప్రతిపాదిత గ్రామాల రైతులు ప్రశ్నిస్తున్నారు.

      భూ సమీకరణపై రైతులు అడిగే ప్రశ్నలకు తెలుగుదేశం ప్రజాప్రతినిధులు సైతం సమాధానం చెప్పలేకపోతున్నారు.

      రాజధాని కమిటీ సభ్యులకు సైతం పూర్తిస్థాయిలో ఇందులో అవగాహన లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అంతా గోప్యంగా ఉంచి కేవలం ల్యాండ్ పూలింగ్ అన్న ఒక్క విధానాన్ని మాత్రమే ప్రభుత్వం ప్రకటించిందని ఆరోపిస్తున్నారు. భూములు ఇచ్చేస్తే భవిష్యత్‌లో ఎలా బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 ఇదీ ‘దేశం' నేతల బెదిరింపు
      రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రానిపక్షంలో ఆయా గ్రామాలను గ్రీన్‌బెల్ట్ కిందకు తెస్తామ ని తెలుగుదేశం నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ఇలాంటి బెదిరిం పులకు భయపడేది లేదని ఆ గ్రామా ల  రైతులు తేల్చిచెబుతున్నారు.
 
 ఈ ప్రశ్నలకు బదులేది?
 1.     తుళ్లూరు, మంగళగిరి రూరల్ మండలాల పరిధిలో 17 గ్రామాల్లో రాజధాని నిర్మాణానికి తొలివిడతలో భాగంగా 30 వేల ఎకరాలు సమీకరించాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఏఏ అంశాల ఆధారంగా సమీకరిస్తారు? దీనికి ప్రాతిపదిక ఏమిటి? ఈ మండలాలనే ఎందుకు ఎంపిక చేశారు?
 2.     సమీకరణ నిర్ణయానికి ముందు రైతులను ప్రభుత్వం ఎం దుకు సంప్రదించ లేదు? వారితో ఎందుకు చర్చించలేదు?
 3.     వీటిన్నిటికంటే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులను ప్రభుత్వం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను ఎందుకు విస్మరించింది?
 4.     అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశంలో ప్రభుత్వం ఎటు పయనిస్తోంది?
 5.     రైతుల భూములను పూర్తిగా లాగేసుకున్నాక భిక్షమేసినట్టు వెయ్యి గజాలు ఇవ్వడం మేంటి ? లాక్కున్న భూములను అభివృద్ధి నిమిత్తం రియల్టర్లకు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఎలా వచ్చింది? దీనికి ముందు సమీకరణ పేరిట లాక్కునే హక్కు ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు?
 6.     సారవంతమైన భూముల్లో భవనాలు కట్టి పంటలు ఎక్కడ పండిస్తారు? ఎలా పండిస్తారు? నాణ్యమైన వ్యవసాయ భూములను ఎందుకు నాశనం చేస్తున్నట్టు?
 7.     భూములు లాక్కున్నాక అక్కడి రైతుల మానసిక పరిస్థితి ఏమిటి?  ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఆ భూములపై ఆధారపడి బతుకుతున్న కూలీల పరిస్థితి ఏమిటి? వారికి తిండిపెట్టేదెవరు?
 8.     భూములనే నమ్ముకుని చదువుతున్న ఆయా గ్రామాల విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి? వ్యవసాయాన్నే నమ్ముకుని కాయకష్టం చేస్తున్న యువత పరిస్థితి ఏమిటి?
 9.     వ్యవసాయంలో భాగమైన పాడిపశువులు, యంత్రపరికరాల మాటేమిటి?
 10.     వెయ్యి రూపాయల పింఛన్ ఇచ్చేందుకు సవాలక్ష ఆంక్షలు పెట్టిన తెలుగు దేశం ప్రభుత్వం కోట్లాదిరూపాయల విలువైన భూములను కాయకష్టం చేసి సంపాదించుకున్న రైతుల నుంచిలాక్కోమని
 ఏ ధర్మశాస్త్రం చెబుతోంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement