ఇదేంటి కేశవా..?!
♦ రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోలును ఒప్పుకున్న ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్
♦ కొంటే తప్పేంటంటూ అడ్డగోలు వాదన
♦‘ల్యాండ్ పూలింగ్’లో పోకుండా ఎత్తులు
♦ సన్నకారు రైతుల భూములను మాత్రం యథేచ్ఛగా లాక్కున్న ప్రభుత్వం
(సాక్షిప్రతినిధి, అనంతపురం) : పయ్యావుల కేశవ్.. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ. ఎప్పుడూ రాష్ట్ర స్థాయి వేదికలపై ‘న్యాయ-అన్యాయాల’ గురించి ప్రసంగాలు ఊదరగొడుతుంటారు. ఇలాంటి నేత కూడా రాజధాని భూముల మాయాజాలానికి పాల్పడిన ‘పచ్చదండు’లో భాగమయ్యారు. గుంటూరు జిల్లాలో కోర్‌క్యాపిటల్ ప్రాంతమైన తుళ్లూరు మండలం అయనవోలు గ్రామంలో రెండు సర్వే నంబర్లలో 4.09 ఎకరాలు కొనుగోలు చేశారు. సర్వే నంబర్ 48/3లో 2.13 ఎకరాలు, 49/3లో 1.96 ఎకరాలు తన పెద్ద కుమారుడు పయ్యావుల విక్రమసింహ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాజధాని ప్రాంతంగా గుంటూరు జిల్లాలోని ప్రాంతాన్నే ఎంపిక చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లుంది. అందుకే ఎన్నికలకు ముందే పయ్యావుల కేశవ్ 4.09 ఎకరాలకు అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 అక్టోబర్, సెప్టెంబరులో రెండు దఫాలు రిజిస్ట్రేషన్ చేయించారు. దీనిపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కాగానే కేశవ్ హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి గగ్గోలు పెట్టారు. రాజధాని ప్రాంతంలో భూములు కొంటే తప్పేంటని, తాను బినామీల పేర్లతో కొనుగోలు చేయలేదని, కుమారుని పేరుతో రిజిస్ట్రేషన్ చేయించానని చెప్పుకొచ్చారు.
ఇది తప్పు కాదా?
రాజధాని ప్రాంతంలో కాదు..ప్రపంచంలో ఎవరు ఎక్కడైనా భూములు, స్థలాలు కొనుగోలు చేయవచ్చు. ఇది తప్పు కాదు. అయితే.. ప్రభుత్వం రాజధాని పేరిట తుళ్లూరు ప్రాంతంలో ఏడాదికి మూడు పంటలు పండే భూములను ‘ల్యాండ్‌పూలింగ్’ విధానంలో రైతుల నుంచి బలవంతంగా లాక్కుంది. ఎకరా, అరెకరా ఉన్న రైతులను కూడా వదల్లేదు. అందరి భూములను తీసుకుని వారిని వీధిన పడేసింది.
కొన్ని గ్రామాల్లో ఇళ్లను కూడా సేకరించింది. ఊళ్లను ఖాళీ చేయించింది. మంత్రులు రోజూ రాజధాని ప్రాంతంలో తిరగడం, భూములు ఇవ్వకుంటే ప్రభుత్వం బలవంతంగా సేకరిస్తుందని.. అప్పుడు పరిహారం కూడా అందదని భయపెట్టారు. దీంతో భయపడి కొందరు, తోటివారిని చూసి ఇంకొందరు ఇలా అందరూ గందరగోళంలో పడి ఇష్టం లేకపోయినా ల్యాండ్ పూలింగ్‌లో భూములను త్యాగం చేశారు. అయనవోలులో కూడా రైతులందరి భూములు ల్యాండ్ పూలింగ్‌లో వెళ్లాయి. ఇదే క్రమంలో పయ్యావుల కేశవ్ కొన్న 4.09 ఎకరాలు ఎందుకు పోలేదనేదానికి ఆయన సమాధానం చెప్పాల్సివుంది.
కేశవ్ భూములను కమర్షియల్ జోన్‌లో ఉన్నట్లు గుర్తించి వదిలేశారు. అంటే పక్కా ప్రణాళిక ప్రకారమే రైతుల నోళ్లు కొట్టి, నాయకులు పాగా వేశారు. ఇలా చేయడం తప్పని ‘సాక్షి’లో రాస్తే...ల్యాండ్‌పూలింగ్ గురించి మాట్లాడకుండా తాను భూములను కొనుగోలు చేయడం తప్పేంటని కేశవ్ అడ్డగోలుగా వాదిస్తున్నారు. కేశవ్ వ్యాఖ్యలపై జిల్లాలో కూడా తీవ్ర విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.
ప్రజా కోర్టులో నిలవక తప్పదు
- వి.రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి
టీడీపీ నేతలు భూ కుంభకోణంపై బుకాయింపులు మాని నిజాలు అంగీకరించాలి. కోర్ క్యాపిటల్ పరిధిలోకి వచ్చే ప్రాంతంలో పేదలకు చెందిన భూములను బలవంతంగా లాక్కున్నారు. మరి అదే ప్రాంతంలో జిల్లా ప్రజాప్రతినిధికి చెందిన నాలుగు ఎకరాల భూమిని ఎందుకు తీసుకోలేదు? కోర్ క్యాపిటల్‌కు భూములను తీసుకునే విషయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మినహాయింపు ఏమైనా ఉందా? పేద రైతుల నుంచి కారు చౌకగా కొన్న భూములను వారికి తిరిగిచ్చేయాలి. లేదంటే ప్రజా కోర్టులో నిలవక తప్పదు.
టీడీపీ భూ కుంభకోణం
- డి.జగదీశ్, సీపీఐ జిల్లా కార్యదర్శి
రాజధాని భూముల విషయంలో జరిగింది ముమ్మాటికీ తెలుగుదేశం పార్టీ భూ కుంభకోణమే. ఆ పార్టీ నేతలు స్వలాభం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కోర్ క్యాపిటల్ పరిధిలో ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల పొట్టకొట్టారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత భూమిని మాత్రం తీసుకోలేదు. ఇలా ప్రతి విషయంలో అధికార దుర్వినియోగం జరిగింది. ఇందుకు ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలి. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు సీఎంగా అనర్హుడు. ఈ కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. బాధ్యులైన వారిని శిక్షించాలి. బినామీల పేరున ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి.