అక్కడ భూములు కొన్నది నిజమే: పయ్యావుల
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భూములు కొన్నది వాస్తవమేనని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అంగీకరించారు. 'సాక్షి' కథనంపై స్పందించిన ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ బినామీ పేరుతో కాదని, తన కొడుకు పేరుతోనే భూములు కొన్నానని తెలిపారు. కాగా కోర్ కేపిటల్లోని తుళ్లూరుకు అతి దగ్గరగా ఉండే అయినవోలు గ్రామంలో పయ్యావుల 4.09 ఎకరాలు కొనుగోలు చేశారు. సర్వే నెంబరు 48/3లో 2.13ఎకరాలు, సర్వే నెంబరు 49/3లో 1.96 ఎకరాలు కలిపి మొత్తం 4.09 ఎకరాల భూమిని 2014 అక్టోబరు 13న కేశవ్ పెద్దకుమారుడు పయ్యావుల విక్రమసింహ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ఎకరం 3.7 లక్షల చొప్పున 4.09 ఎకరాలను 12.27లక్షల రూపాయలకే కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కానీ అయినవోలులో ప్రస్తుతం మార్కెట్ విలువ ఎకరా రూ.2కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఏడాది వ్యవధిలో పయ్యావుల భూములకు 50 రెట్లకు పైగా ధర పలుకుతోంది.
మరోవైపు రైతుల వద్ద భూములు కొంటే తప్పేంటని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర అన్నారు. రాజధానిలో ఎంతోకొంత భూమి ఉండాలని ఎవరైనా కోరుకుంటారని, 2,3 ఎకరాలు కొనుక్కోలేని పరిస్థితిలో తాము ఉన్నామా అని ఎదురు ప్రశ్నించారు. కాగా నంబూరులో సర్వే నెంబరు 274లోని 3.89 ఎకరాల వాగు పోరంబోకు భూమిని తన సమీప బంధువు దేవర పుల్లయ్య పేరుతో సొంతం చేసుకోవడానికి ధూళిపాళ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. రెవిన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చి రెండుమూడు చేతులు మార్చినట్లుగా చూపి డాక్యుమెంట్ నెంబర్లు 2638, 2639, 2640లలో 3.89 ఎకరాల భూమిని తమ బినామీదారుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు.