ఆదర్శప్రాయులు ‘ఆంధ్రకేసరి’
విజయవాడ : తాను నమ్మిన సిద్ధాంతాలను అమలు చేయడంలో రాజీపడని ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అన్నారు. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం జరిగిన టంగుటూరి ప్రకాశం పంతులు 142వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆంధ్రకేసరి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం ఆయనకిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ఆంధ్ర రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. నగర పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వ్యక్తిత్వంలో హిమాలయ పర్వతం అంత ఎత్తు ఎదిగిన ప్రకాశం పంతులు ధైర్యం, తెగువ, సాహసం యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఉడా వీసీ పి.ఉషాకుమారి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరికిరణ్ మాట్లాడుతూ ఆంధ్రకేసరి జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా జరుపుకోవడం హర్షణీయమన్నారు.
సీనియర్ పాత్రికేయులు, ప్రకాశం పంతులు వద్ద కార్యదర్శిగా పని చేసిన తుర్లపాటి కుటుంబరావు మాట్లాడుతూ ‘సైమన్ గో బ్యాక్’ ఉద్యమంలో బ్రిటిష్‌వారి తుపాకి గుళ్లకు ఎదురొడ్డి నిలిచిన ప్రకాశం పంతులుకు ఆంధ్రకేసరి బిరుదు లభించిందని వివరించారు. సీనియర్ పాత్రికేయులు సి.రాఘవాచారి మాట్లాడారు. సబ్ కలెక్టర్ డి.హరి చందన అధ్యక్షత వహించిన ఈ సభలో స్వాతంత్య్ర సమరయోధులు వేములపల్లి వామనరావు, సి.రాఘవాచారి, తుర్లపాటి కుటుంబరావులను సత్కరించారు.
ఆంధ్రకేసరి జయంతిని పురస్కరించుకుని పాఠశాల, కళాశాల స్థాయిల్లో నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. తుర్లపాటి కుటుంబరావు రచించిన ‘ఆంధ్రకేసరి జీవితంలో అద్భుత ఘట్టాలు’ పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. విద్యార్థులు ప్రదర్శిం చిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. తొలుత ప్రకాశం బ్యారేజి వద్ద ఉన్న టంగుటూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఎస్పీ కార్యాలయంలో..
కోనేరుసెంటర్(మచిలీపట్నం) : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రకాశం పంతులు చిత్రపటానికి ఎస్పీ జి.విజయ్‌కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అడిషనల్ ఎస్పీ బీడీవీ సాగర్, కార్యాలయ ఏవో ప్రసాద్, ఓఎస్‌డీ వృషికేశవరెడ్డి, బందరు డీఎస్పీ డాక్టర్ కేవీ శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, స్పెషల్ బ్రాంచ్ సీఐ పి.మురళీధర్, డీసీఆర్‌బీ సీఐ బాలరాజు, ఆర్‌ఐ కృష్ణంరాజు, ఆర్‌ఎస్‌ఐలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక
ఈడేపల్లి(మచిలీపట్నం) : తెలుగువాడి ఆత్మగౌరం, పౌరుషాలకు ప్రకాశం పంతులు ప్రతీక అని పలువురు వక్తలు కొనియాడారు. జిల్లా రెవెన్యూ శాఖ ఆధ్వర్యాన శనివారం మచిలీపట్నం హిందూ కళాశాల ఆడిటోరియంలో టంగుటూరి ప్రకాశం జయంతి వేడుకలు నిర్వహించారు. కృష్ణా యూనివర్సిటీ వీసీ ఆచార్య వెంకయ్య మాట్లాడుతూ ఆవేశం, స్వతంత్ర వ్యక్తిత్వం, ఆత్మగౌరవం విషయంలో ప్రకాశం పంతులుకు సాటిలేరని కొనియాడారు.
అడిషనల్ జాయింట్ కలెక్టర్ బీఎల్ చెన్నకేశవరావు, డీఎస్పీ డాక్టరు కేవీ శ్రీనివాసరావు ప్రసంగించారు. అనంతరం ప్రకాశం పంతులు జీవిత ఘట్టాలను వివరిస్తూ విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ‘టంగుటూరి ప్రకాశం జీవిత చరిత్ర’పై నిర్వహించిన వక్తృత్వ, క్విజ్ పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు.
తొలుత ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. డీఆర్వో ఆలపాటి ప్రభావతి, జెడ్పీ సీఈవో డి.సుదర్శనం, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ ఎ.మారుతీదివాకర్, ఆర్డీవో పి.సాయిబాబు, తహశీల్దార్ నారదముని, అంగలూరు డైట్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ ఎంవీజీ ఆంజనేయులు, హిందూ కళాశాల ప్రిన్సిపాల్ వి.ఉషారాణి, చరిత్ర అధ్యాపకుడు ఎస్. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.