రాజధాని రైతుకు భరోసా | Ensuring that the capital of the farmer | Sakshi
Sakshi News home page

రాజధాని రైతుకు భరోసా

Published Fri, Nov 14 2014 1:12 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

రాజధాని  రైతుకు భరోసా - Sakshi

రాజధాని రైతుకు భరోసా

{పతిప్రాదిత గ్రామాల్లో పర్యటనకు శ్రీకారం చుట్టిన వైఎస్సార్ సీపీ కమిటీ
తొలి రోజు ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామాల రైతులతో ముఖాముఖీ
ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా సహించబోమని వైఎస్సార్ సీపీ నేతల స్పష్టీకరణ
ముఖ్యమంత్రి, టీడీపీ నేతల వైఖరికి అడ్డుకట్ట వేయాలని కోరిన ఆయా గ్రామాల రైతులు
{పాణాలైనా ఇస్తాం గానీ భూములు ఇచ్చేదిలేదని తెగేసి చెప్పిన అన్నదాతలు

 
గుంటూరు సిటీ  ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించ తలపెట్టిన గ్రామాల్లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన రాజధాని రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ గురువారం జరిపిన పర్యటన బాధిత రైతుల్లో భరోసా నింపింది. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీడీపీ నేతల వైఖరితో ఆందోళన చెందుతున్న ఆయా గ్రామాల రైతుల్లో నమ్మకాన్ని కలగజేసింది. నాయకులంతా మూకుమ్మడిగా తమ గ్రామాలకు తరలి రావడం, జోరు వానలో కూడా బురదలో నడుస్తూ సారవంతమైన తమ పొలాల్లో పర్యటించడం వారిలో నూతనోత్తేజాన్ని రేకెత్తించింది. రైతులు, రైతు కూలీలు, కౌలుదారుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా సహించబోమని వైఎస్సార్ సీపీ  నేతలు సంఘటితంగా స్పష్టం చేయడంతో వారికి తమ భూముల పట్ల, భవితపై నమ్మకం కుదిరింది. ఉదయం ఉండవల్లి నుంచి ప్రారంభమైన కమిటీ పర్యటన పెనుమాక, నిడమర్రు గ్రామాల్లో సాగింది.

► మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో మాజీ మంత్రి పార్ధసారథి, వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), కోన రఘుపతి, కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, ముస్తఫా, గొట్టిపాటి రవికుమార్, రైతు నేత ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులు గ్రామాల్లో పర్యటించారు.
►  అక్కడి రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. స్వయంగా పొలాల్లోకి వెళ్లి పంటలను పరిశీలించి రైతుల స్థితిగతులను అంచనా వేశారు. రైతుల ఆవేదనను ఆలకించారు.

  తొలుత రాజధాని నిర్మాణానికి పొలాలిచ్చే అంశంపై ఉండవల్లి ఉగ్రరూపం దాల్చింది. ఊరు ఊరంతా ఉవ్వెత్తున విరుచుకుపడింది. ప్రాణాలైనా ఇస్తాం కానీ పొలాలిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. మా సమాధులపై సింగపూర్ కడతారా? అని ప్రశ్నించింది.పెనుమాక పెనుకేక పెట్టింది. లాఠీలు, తూటాలకు బెదరనంది. ప్రభుత్వ ప్యాకేజీలకు లొంగనంది. ప్రభుత్వం తమ పొలా ల జోలికొస్తే తరిమి తరిమి కొడతానంది.

 నిడమర్రు చిర్రు బుర్రులాడింది. ఎకరం కూడా ఇచ్చేది లేదని ఏకగ్రీవంగా తీర్మానించింది. కావాలంటే ఎకరానికో రూ. లక్ష చొప్పున రాజధాని నిర్మాణానికి చందా ఇస్తానంది. సారవంతమైన తమ పొలాలు వదిలేసి వేరే ఎక్కడైనా నిర్మించుకోవాలని హితవు పలికింది.కమిటీ  నేతల ఎదుట రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. పసిడి రాశులు పండించే భూములను చిన్నాభిన్నం చేసే చంద్రబాబునాయుడు ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని మనవి చేసుకున్నారు.

 ఈ సమయంలో తాము రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదనీ, రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి మాత్రమే తామీ పర్యటనకు వచ్చామనీ, ఇందులో రాజకీయానికి తావు లేదనీ చెప్పిన వైఎస్సార్ సీపీ నేతల మాటలకు స్థానిక రైతుల్లో అనూహ్య స్పందన కనిపించింది.

ఇంతటితో ఆగమని, దఫదఫాలుగా పర్యటిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదనీ పదే పదే చెప్పడంతో ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు ప్రజలు,రైతులు తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా హక్కుల కమిటీ ముందుంచా రు. ఆయా గ్రామాల రైతుల అభిప్రాయాలు వారి మాటల్లోనే......
 
తిరుగుబాటు చేస్తాం..

మావి సారవంతమైన భూములు. తరతరాలుగా పొలాలు నమ్ముకుని బతుకుతున్నాం. అమ్ముకుని కాదు. ఎట్టి పరిస్థితుల్లో గజం భూమి కూడా ఇచ్చేది లేదు. మాకే ప్యాకేజీలు అక్కర్లేదు. కాదూ కూడదని లాక్కునే ప్రయత్నం చేస్తే తిరుగుబాటు చేస్తాం. అప్పుడు మమ్మల్ని చంపి మా సమాధులపై సింగపూర్ తరహా రాజధాని కట్టుకోమనండి.
  - పి.శంకర్‌రెడ్డి, రైతు, ఉండవల్లి
 
మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె...

రైతులకు సాగునీరు ఇవ్వడం చేతకాదు కానీ చంద్రబాబుకు వారి పొలాలు మాత్రం కావాల్సి వచ్చాయా? రాజధాని విషయంలో ఆయన వ్యవహారం చూస్తుంటే మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అన్న చందంగా ఉంది. ఇటు రైతులు, అటు ప్రజలు ఎవరితో చర్చించకుండా ఏకపక్షంగా ఆయన నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము ఆమోదించాలా? ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇవ్వం.
 - శివశంకరరావు, ఉండవల్లి
 
రుణమాఫీకి పనికిరావు కానీ...
 
మీ పొలాల్లో సాగవుతుంది ఉద్యాన పంటలు కాబట్టి మీకు రుణమాఫీ వర్తించదన్నారు. సరే బాగానే ఉంది. రుణమాఫీకి పనికిరాని పొలాలిప్పుడు రాజధాని నిర్మాణానికి మాత్రం ఎలా పనికొస్తాయి. సారవంతమైన భూములు కాబట్టే రుణమాఫీ వర్తింపజేయ లేదు. అలాంటి మా సస్యశ్యామల భూముల్ని వదిలి పనికి రాని పొలాలుంటే చూసుకుని అక్కడ రాజధాని నిర్మాణం చేపట్టండి.
 - విశ్వనాథం, మాజీ ఆదర్శ రైతు, పెనుమాక
 
ఏకగ్రీవంగా తీర్మానించాం...

రాజధాని నిర్మాణ విషయమై గత కొద్ది రోజులుగా రకరకాల వార్తలు విని తీవ్ర ఆందోళనకు లోనయ్యాం. చివరకు మేమంతా కలసి కట్టుగా ఆలోచించుకుని రాజధాని నిర్మాణానికి మాగ్రామం నుండి ఒక్క ఎకరం కూడా ఇవ్వకూడదని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నాం. చాలా కష్టపడి పొలాలు సాగుచేసుకుని చివరికి వైఎస్సార్ పుణ్యమాని వచ్చిన ఎత్తిపోతల పథకం వల్ల ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం. ఈ తరుణంలో రాజధాని పేరిట చంద్రబాబు మాకు టోకరా వేయాలని చూస్తే నమ్మేంత వెర్రి బాగుల వాళ్ళం కాదు.
 - గాదె వీరాంజనేయరెడ్డి, ఎత్తిపోతల పథకం గౌరవ అధ్యక్షుడు, నిడమర్రు.
 
మా పొట్ట కొట్టొద్దు..

పొలాల్లో పని చేయడమొక్కటే మాకు తెలుసు. ఏళ్ల తరబడి రైతు కూలీలుగానే జీవనాధారాన్ని కొనసాగిస్తున్నాం. ఇప్పుడొచ్చి రాజధాని పేరిట ఈ పొలాలు లాక్కుంటామని అంటున్నారు. అదే గనక జరిగితే, ఈ పొలాలే లేకుంటే మేమెక్కడికి పోయి బతకాలి. రాజధాని అవసరమే. కాదనడం లేదు. అయితే దయచేసి మా ఊరును మాత్రం వదిలిపెట్టండి. మా పొట్ట కొట్టకండి.
 - చిట్టెమ్మ, రైతు కూలీ, నిడమర్రు
 
రాజధాని నిర్మాణానికి చందాలిస్తాం,

రాజధాని నిర్మాణానికి అవసరమైతే మా గ్రామంలో ఎకరానికి లక్ష రూపాయల చొప్పున చందా ఇస్తాం కానీ  సారవంతమైన మా చేల జోలికి మాత్రం రావద్దు. ఏడాదికి ఎకరానికి లక్షా 40వేల రూపాయలు కౌలు రూపంలోనే మాకు ఆదాయం వస్తుంది. అంత ఆదాయాన్నిచ్చే పొలాన్ని మీ మాటలు నమ్మి మీకిచ్చేందుకు మేము సిద్ధంగా లేము. మేమిచ్చే చందాలు తీసుకుని వేరే ఎక్కడైనా రాజధాని నిర్మించండి.
 - శ్రీనివాసరెడ్డి, నిడమర్రు
 
 
పొలాలిచ్చేందుకు సిద్ధంగా లేం....

తాడేపల్లి మండలంలోని ఏ గ్రామం కూడా పొలాలిచ్చేందుకు సిద్ధంగా లేదు. ఇటు అధికారులు, అటు పాలకులు ఈ విషయమై చెబుతున్నవన్నీ అవాస్తవాలే. ఆ గ్రామం సిద్ధంగా ఉంది. ఈ గ్రామం సిద్ధంగా ఉంది. అంటూ పాలకులు చెబుతున్నవన్నీ నిజం కాదు. వాస్తవానికి ఒక్కరంటే ఒక్క రైతు కూడా వీసమెత్తు స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. మేం అన్ని గ్రామాల్లో తిరిగి రైతుల అభిప్రాయాలను సేకరిస్తున్నాం. రైతులకు అన్యాయం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోం.
 -దొంతిరెడ్డి వేమారెడ్డి, మాజీ ఎంపీపీ, తాడేపల్లి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement