సీమ రాజధాని కోసం ఉద్యమం
కర్నూలు రూరల్: ఆంధ్రప్రదేశ్ రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయకుంటే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేపడతామని రాజధాని సాధన కమిటీ చైర్మన్ చెన్నయ్య హెచ్చరించారు. స్థానిక జలమండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు జాతంతా ఐక్యంగా ఉండాలనే ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఉన్న కర్నూలును అప్పట్లో వదులుకున్నామన్నారు. రాజకీయ పార్టీలు గత చరిత్రను, పెద్ద మనుషుల ఒప్పందం గురించి తెలుసుకొని రాజధానిని సీమలో ఏర్పాటు చేయాలని కోరారు.
రాష్ట్ర విభజన సమయంలో రాజధాని ఏర్పాటు కోసం కమిటీ ఏర్పాటు చేసిన సమయంలో సీమలో తిరుపతి, కర్నూలలో కూడా పర్యటిస్తామని చె ప్పారన్నారు. ఆ కమిటీ ఇక్కడకి రాక మనుపే రాజధాని గుంటూరు-విజయవాడ మధ్యలో ఉంటుందని లీకులు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు వారి స్వార్థం కోసం కాకుండా ప్రజా సంక్షేమానికి ప్రయోజనకరంగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కర్నూలు జిల్లాలో ప్రభుత్వ భూములు, వనరులు, నీటి సదుపాయం, జాతీయ రహదారులు, రైల్వే రవాణ వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు.
ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ విలీనమైన తర్వాత సీమ ప్రజలు అధిక శాతం నష్టం పోయారని, తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో మళ్లీ సీమకే నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేలు ఇప్పటికైనా స్పందించి ఈ నెల 19 నుంచి 24వ తేది వరకు జరిగే అసెంబ్లీ సమావేశాలలో రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని గళమెత్తాలని కోరారు. లేని పక్షంలో అన్ని ఉద్యోగ, ప్రజా సంఘాల జేఏసీలను కలుపుకొని ప్రత్యేక రాయల సీమ రాష్ట్ర సాధనకు ఉద్యమం చేపడతామని చెన్నయ్య హెచ్చరించారు. సమావేశంలో రాయలసీమ రాజధాని సాధన కమిటీ చైర్మన్ సోమశేఖర శర్మ, సభ్యులు విజయ్‌కుమార్, నాగరాజు, రాజధాని సాధన కమిటీ సభ్యులు సుబ్బరాయుడు, ప్రసాద్‌రావు, నెహేమియా, శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.