
సమన్వయంతో సమున్నత రాజధాని
సాక్షి ప్రతినిధి, గుంటూరు : దేశం గర్వించదగిన రాజధాని రూపకల్పనకు ప్రభుత్వం, అధికారులు, ప్రజల మధ్య సమన్వయం అవసరం. ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నవ్యాంధ్ర రాజధానిలో సింగపూర్ అనుసరిస్తున్న సిటీ, అర్బన్ ప్లానింగ్, సర్వే విధానాలతో పాటు పోలీసింగ్‌పై ఓ నివేదికను రూపొందించనున్నాం. వీటి అమలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ వెల్లడించారు.
ఈ నెల 19వ తేదీ నుంచి 24 వరకు సింగపూర్‌లో పర్యటించిన అధికారుల బృందంలో ఒకరైన శ్రీధర్ అక్కడి విధానాలు, ప్రభుత్వ శా ఖల మధ్య సమన్వయాన్ని ‘సాక్షి ప్రతినిధి’కి వివరించారు. అర్బన్, సిటీ ప్లానింగ్‌కు సంబంధించిన విధి విధానాలు నవ్యాంధ్ర రాజధానిలో వినియోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఆ వివరాలు..
770 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన సింగపూర్‌లో సహజ సిద్ధమైన ప్రకృతి వనరులు లేవు. ట్రేడింగ్ హబ్‌గా ఖ్యాతిగాంచడంతో వాణిజ్యం, ఓడరేవులు, సేవారంగాల నుంచి అధిక ఆదాయం వస్తోంది. అక్కడ ఒక రహదారి నిర్మించాల్సి వస్తే అనుబంధ శాఖల అధికారులతో కలసి నిర్ణయం తీసుకుంటారు. దీని వల్ల భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు.
ప్రభుత్వ నిధులు వృథా కావు. మనవద్ద అలాంటి విధానమేదీ లేదు. ఎవరికి ఆటంకం కలిగితే వారు కొత్తగా నిర్మించిన రహదారినైనా సరే పగలగొడతారు. విద్యుత్ సరఫరాకు ఆటంకం అని భావిస్తే చెట్లను నరికేస్తారు. ఇలాంటివి నవ్యాంధ్ర రాజధానిలో జరగకుండా ఉండాలంటే ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం అవసరం.
ఇక అక్కడి ప్రజలు ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును వినియోగిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా సింగపూర్ ప్రభుత్వం సేవా రంగాన్ని అభివృద్ధి చేసింది. రవాణాకు సంబంధించి ప్రజలు నేరుగా ఇంట్లోకి, ప్రభుత్వ కార్యాలయాల్లోకి అడుగుపెట్టే విధంగా మెట్రోట్రైన్‌ను రూపొందించారు. ఆర్థిక సౌలభ్యం ఉన్నప్పటికీ 90 శాతం ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టునే వినియోగించుకుంటారు. నడక, సైక్లింగ్‌ను ఎక్కువగా ఇష్టపడతారు.
30 శాతం భూమిని భవనాలు, కట్టడాలకు కేటాయించి, మిగిలిన ప్రాంతంలో విశాలమైన రహదారులు, గ్రీనరీ ఏర్పాటు చేశా రు. గృహనిర్మాణానికి సంబంధించి 90 శాతం భవనాలను ప్రభుత్వమే నిర్మించి ప్రజలకు విక్రయిస్తోంది. లేకుంటే అద్దెకు ఇస్తోంది.
సింగపూర్ మొత్తానికి రెండు డంపింగ్ యార్డులు ఏర్పాటు చేశారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. అక్కడి సర్వే విధానాన్ని ఇక్కడ అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంత సాంకేతిక నైపుణ్యతతో ఆ విధానాన్ని అమలులోకి తీసుకురావచ్చు. ఇక్కడ భూ ఆధారిత సర్వే మాత్రమే జరుగుతోంది. దీనికి సింగపూర్ విధానాన్ని అనుసంధానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
అక్కడి ప్రజల్లో చైతన్యం, క్రమశిక్షణ ఎక్కువ. అందువల్లే తక్కువ సంఖ్యలో పోలీసులు ఉన్నప్పటికీ శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి. షాపింగ్ కాంప్లెక్సులు, బహుళ అంతస్తుల భవనాలకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పోలీస్ శాఖ పరిశీలనలోనే ఉంటాయి. రహదారులపై పోలీసులు కనిపించకపోయినప్పటికీ, కెమెరాల పరిశీలనతో శాంతిభద్రతలను పరిరక్షించగలుగుతున్నారు.
ఇక్కడి నుంచి వివిధ శాఖలకు చెందిన అధికారులు సింగపూర్ అధ్యయన టూర్‌లో పొల్గొన్నారు. ఆ శాఖలకు చెందిన అధికారులు వాటిపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపుతారు. వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.