ప్రత్యేక హోదా బాధ్యత కేంద్రానిదే
– ఉద్యమాలతో హోదా రాదు సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి
మార్కాపురం టౌన్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, ఉద్యమాల ద్వారా సాధించలేమని సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ప్రకాశం జిల్లా మార్కాపురం పీఆర్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరగడంతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పొందు పరచలేదని, రాజ్యసభలో వెంకయ్య నాయుడు, నాటి బీజేపీ ఎంపీలు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్‌కు 5 నుంచి 10 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని కోరాయని, నేడు 14వ ఆర్థిక సంఘం సాకుతో ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదని చెప్పటం వారికే చెల్లుతుందన్నారు. కేంద్రంతో ఘర్షణతో కాకుండా సామరస్యంగా ప్రత్యేక హోదా సాధించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నార ని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలకు, వెనుకబడిన ప్రాంతాలు, రాజధాని, పోలవరం ప్రాజెక్టు, విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్ తదితరాలకు కేంద్రం తగిన నిధులు సమకూరుస్తుందన్నారు. మంత్రి వెంట ఆర్డీవో చంద్రశేఖరరావు, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.