ఆవేశంలో కొట్టిన తండ్రి.. విగతజీవిగా కుమార్తె | Young Woman Suspicious Death In Prakasam | Sakshi
Sakshi News home page

పరువు హత్యా.. ఆత్మహత్యా..?

Published Tue, Oct 30 2018 1:03 PM | Last Updated on Tue, Oct 30 2018 1:03 PM

Young Woman Suspicious Death In Prakasam - Sakshi

విషన్నవదనంతో ఇంద్రజ తల్లి అంజనమ్మ మృతి చెందిన ఇంద్రజ చిన్ననాటి చిత్రం

వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన యువతీ యువకుడు ప్రేమించుకున్నారు.ఈ వ్యవహారం నచ్చని యువతి తల్లిదండ్రులు తమ కుమార్తెకు మరో వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇది తెలిసిన ఆమె ప్రేమించిన యువకుడితో ఇంటి నుంచి వెళ్లిపోయింది. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో వారిద్దనీ పట్టుకొచ్చిన పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. ఇంటికి తిరిగి వచ్చాక కూడా ప్రేమించినవాడినే పెళ్లి చేసుకుంటానని మంకు పట్టుపట్టి తిండి మానేయడంతో ఆగ్రహించిన తండ్రి కుమార్తెపై చేయి చేసుకున్నాడు. ఆ రాత్రి ఏం జరిగిదో.. తెల్లవారేసరికి ఆ యువతి చనిపోయిందంటూ హడావుడిగా మృతదేహాన్ని దహనం చేశారు.  కొమరోలు మండలం నాగిరెడ్డిపల్లె గ్రామంలో సోమవారం వెలుగు చూసినఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. తన కుమార్తె ఉరివేసుకుని చనిపోయిందని మృతురాలి తల్లి చెబుతున్నప్పటికీ ఈ ఘటనపై భిన్న వాదనలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇష్టంలేని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతోపాటు, తనపై చేయిచేసుకున్నాడని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందా..? లేక తల్లిదండ్రులే పరువు హత్య చేశారా.. అనే అనుమానాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.  

ప్రకాశం, కొమరోలు(గిద్దలూరు):  మండలంలోని నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన పందనబోయిన ఆవులయ్య, అంజనమ్మ దంపతుల కుమార్తె ఇంద్రజ (20) ఇంద్రజ ఇంటర్‌ వరకు చదువుకుని ఖాళీగా ఉంటోంది. గ్రామానికి చెందిన దళిత యువకుడు చైతన్య డిగ్రీ చదువుతూ మధ్యలో చదువు ఆపేసి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. వీరిద్దరి మధ్య మూడేళ్ల కిందట ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇంద్రజ తండ్రి సీఆర్‌పీఎఫ్‌ జవానుగా పదవీ విరమణ చేసి హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇంద్రజ హైదరాబాద్‌లోనే ఉంటోంది. గతేడాది ఇంద్రజను సమీప బంధువుకు ఇచ్చి వివాహం చేసేందుకు తల్లిదండ్రులు నిశ్చితార్థం చేసుకున్నారు. ఇది తెలిసిన చైతన్య హైదరాబాద్‌ వెళ్లి ఇంద్రజను ఇంటి నుంచి తనతో తీసుకెళ్లాడు. ఆమె కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదుతో రాజేంద్రనగర్‌ పోలీసులు ఇద్దరినీ గుర్తించి తీసుకొచ్చారు.

వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. తాను చైతన్యనే వివాహం చేసుకుంటానని ఇంద్రజ అన్నం కూడా తినకుండా ఉందని గ్రహించిన ఆవులయ్య 10 రోజుల క్రితం ఆమెను స్వగ్రామం నాగిరెడ్డిపల్లెకు తీసుకొచ్చాడు. చైతన్యపై గిద్దలూరులోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో అతడు తాను ఇంద్రజను పెళ్లిచేసుకోనని, ఆమె జోలికి రానని చెబుతూ పెద్దల సమక్షంలో అంగీకరించాడు.

స్థానికుల సమాచారంతో వెలుగులోకి..
పోలీసులు, పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగిన తర్వాత కూడా ఇంద్రజ తన పట్టు వీడకుండా కడుపు మాడ్చుకుని ఉండటంతో ఆగ్రహించిన తండ్రి ఆదివారం రాత్రి ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో సోమవారం ఉదయం యువతి మృతి చెందిందంటూ తండ్రి ఆవులయ్య దగ్గర్లోని శ్మశానంలో హడావుడిగా దహనం చేస్తుండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న గిద్దలూరు ఎస్సై కె.మల్లికార్జున మృతురాలి ఇంటిని, దహన సంస్కారాలు చేసిన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. వీఆర్వో ఖాదర్‌ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని కాల్చివేయడంతో ఎలాంటి ఆధారాలు లభ్యం కావడం లేదు.

ఘటనపై అనుమానాలెన్నో..
ఇంద్రజ మృతి సంఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. ఇతర సామాజిక వర్గానికి చెందిన యువకున్ని ప్రేమించడం వలన కొట్టడంతో చనిపోయిందా, మనస్థాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందా అనేది గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. తమ కుమార్తె వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందని పరువు కోసం కొట్టి హత్య చేశారన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆమె ప్రేమ వ్యవహారంలో గత 15 రోజులుగా జరుగుతున్న సంఘటనల వలన ఆదివారం రాత్రి ఇంద్రజకు, ఆమె తండ్రికి మధ్య మరోసారి గొడవ జరిగినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఆమెను తన తండ్రి కొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెంది ఉండొచ్చని కొందరు, ప్రేమికునితో కాకుండా తన బంధువుతో వివాహం చేస్తారేమోనన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తన కుమార్తె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని, కేసు అవుతుందని భయంతోనే కాల్చేశారని మృతురాలి తల్లి అంజనమ్మ చెబుతోంది. దీనిపై ఎస్సై మల్లిఖార్జున వివరణ ఇస్తూ ప్రేమ వ్యవహారం వాస్తవమేనన్నారు. ఇంద్రజకు ఆమె బావతో నిశ్చితార్థం అయిందని, అతనినే వివాహం చేసుకోవాలని తండ్రి ఒత్తిడి తేవడం వలన ఆత్మహత్య చేసుకుందా, లేక కొట్టడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందా అనేది విచారిస్తున్నామన్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement