ప్రాణాలు తీసిన కోడి పందెం | Man Died Due To Hen Betting In Prakasam | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీసిన కోడి పందెం

Published Thu, Oct 31 2019 9:35 AM | Last Updated on Thu, Oct 31 2019 9:39 AM

Man Died Due To Hen Betting In Prakasam - Sakshi

సాక్షి, చీరాల(ప్రకాశం) : కోడి పందెం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. సరదా కోసమో ఆట విడుపు కోసమో కోడి పందేలకు వెళ్లి ఇద్దరి ప్రాణాలు నీటిలో కలసి పోగా మరొకరు ఆచూకీ కనిపించలేదు. కోడి పందేలు ఆడుతుండగా ఒక్కసారిగా పోలీసులు దాడులు మొదలు పెట్టారు. సుమారు 200 మందికి పైగా కోడి పందేల పాల్గొన్నారు. వారిలో కొందరు పారిపోగా మరికొందరు పోలీసులకు చిక్కారు. ఎలాగైనా పోలీసుల నుంచి తప్పించుకోవాలని నిశ్ఛయించుకుని నిండుగా ప్రవహిస్తూ ప్రమాదంగా ఉన్న ఈపురుపాలెం స్ట్రయిట్‌ కట్‌ కాలువలో దూకేశారు. కాలువలో అధికంగా బురద ఉండడంతో దూకిన వారు దూకినట్లే బురదలో చిక్కుకుని ప్రాణాలొదిలారు. అయితే ఇప్పటికే ఇద్దరు మృత దేహాలు లభ్యం కాగా మరొక వ్యక్తి ఆచూకీ గల్లంతయ్యింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాలలో చోటుచేసుకుంది. వివరాలు..

చీరాల మండల పరిధిలోని విజయనగర్‌ కాలనీ శివారు ప్రాంతమైన ఈపురుపాలెం స్ట్రయిట్‌ కట్‌ కాలువ సమీపంలో నిర్వహిస్తున్న కోడి పందేల స్థావరంపై మంగళవారం ఈపురుపాలెం పోలీసులు దాడి చేశారు. ఎస్సై సుధాకర్‌ తన సిబ్బందితో ఆకస్మికంగా దాడి చేస్తున్నారనే సమాచారం అందుకున్న కోడి పందెగాళ్లు పోలీసులు కొద్ది దూరంలో ఉండడం చూసి తలో దిక్కుకు పారిపోయారు. వారిలో కొందరు పొలాల్లోకి పారిపోగా మరి కొందరు సమీపంలోని స్ట్రయిట్‌ కట్‌ కాలువలోకి దూకి తప్పించుకున్నారు. సుమారుగా 30 మంది కోడి పందెం ఆడుతున్న వారు కాలువలోకి దూకగా వారిలో చీరాల ఐఎల్‌టిడి రామ్‌ నగర్‌కు చెందిన మేనపాటి శ్రీనివాసన్‌ (35) అనే వ్యక్తితో పాటు గుంటూరు జిల్లా వెదుళ్లపల్లికి చెందిన చౌట ఇర్మియా అలియాస్‌ మధు కృష్ణ (37), మరోవ్యక్తి గల్లంతయినట్టు గుర్తించారు. మధు కృష్ణ మృతదేహాన్ని ముంగళవారం రాత్రి 10 గంటల సమయంలో వెలికి తీయగా చీకటి పడడంతో గాలిపుం చర్యలు నిలిపివేశారు. బుధవారం ఉదయం శ్రీనివాసన్‌ మృత దేహాన్ని వెలికి తీశారు. శ్రీనివాసన్‌కు భార్య శ్రావణి, పదేళ్ల వయస్సు గల రషీష్, ఐదేళ్ల వయస్సు గల ప్రణీత్‌లు ఉన్నారు. అలానే మృతి చెందిన మధు కృష్ణ ఆటో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తు కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి భార్య మాధవి ఉన్నారు. ఇతనికి పిల్లలు లేరు. 

విచారణకు ఆదేశించిన ఎస్పీ 
కోడి పందేలు వేస్తుండగా పోలీసులు చేసిన దాడిలో ఇద్దరు ప్రమాద వశాత్తు కాలువలో పడి మరణించడంతో వెంటనే జిల్లా ఎస్పీ సిద్థార్డ్‌ కౌశల్‌ విచారణకు ఆదేశించారు. ఎస్పీ దర్శి డీఎస్పీ కె. ప్రకాశ్‌ రావులను చీరాలకు పంపించారు. అసలు తప్పిదం ఎవరిది దాడులు చేసే సమయంలో పోలీసులు తీసుకునే జాగ్రత్తలు పాటించారా లేదా అనే విషయాలపై ఆరా తీయించారు. పోలీసులు దాడిచేసే సమయంలో సమయ స్ఫూర్తిగా వ్యవహరించారా లేదా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. కేసు విచారణ అధికారిగా దర్శి డిఎస్పీ ప్రకాష్‌ రావుతో పాటు టూ టౌన్‌ సీఐ ఎండి.ఫిరోజ్‌ను నియమించారు. 

శోక సంద్రంలో మృతుల కుటుంబాలు 
ఆస్పత్రిలో ఉన్న మృత దేహాలను కడ సారిగా చూసుకునేందుకు మృతుల భార్యలు పిల్లలతో పాటు వారి బంధువులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు తరలి వచ్చారు. మృత దేహాలను చూసిన వారు శోక సంద్రంలో మునిగిపోయారు. సరదాగా ఆడేందుకు వెళుతుంటారని ఇలా విగత జీవులుగా తిరిగి వస్తారని అనుకోలేదని, ఇక తమకు దిక్కెవరంటూ రోధిస్తున్నారు. తమ కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరారు. 

పోలీసుల వైఫల్యమే: ప్రజా సంఘాలు
రెండు నిండు ప్రాణాలను పోలీసులు బలి తీసుకున్నారని మృతుల బంధువులతో పాటు ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. ఆస్పత్రి వద్ద ఆరోపిస్తు నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల బారినుండి తప్పించునేందుకు కాలువలోకి దూకిన వారిని పోలీసులు రక్షించాల్సింది పోయి కనికరం లేకుండా వదిలివేయడంతోనే వారు మృతి చెందారని వారు పేర్కొన్నారు. ఎస్సై సుధాకర్‌తో పాటు పోలీసులు కోడి పందెగాళ్ల వెంట పడడంతో గత్యంతరం లేని పరిస్థితిలోనే వారంతా కాలువలో దూకి నిండు ప్రాణాలను బలి తీసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి పోలీసుల వైఫల్యంగానే భావిస్తున్నామని వారు పేర్కొన్నారు. çపోలీసులే ఈ సంఘటనకు బాధ్యత వహించాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement