నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం
ఒంగోలు: బెట్టింగ్ పేరుతో ఓ విద్యార్థిని భయపెట్టి అతని నుంచి రూ.30 లక్షల సొత్తును చోరీ చేసిన యేమిరెడ్డి నరేంద్రరెడ్డిని అరెస్టు చేసినట్లు ఎస్పీ భూసారపు సత్యఏసుబాబు తెలిపారు. సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలోని గెలాక్సీ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుడి వివరాలను ఆయన వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. బాధిత బీటెక్ విద్యార్థికి నరేంద్రరెడ్డి పరిచయం అయ్యాడు. క్రికెట్, ప్రోకబడ్డీ, షటిల్ బ్యాడ్మింటన్ గేమ్స్ వంటి ఆడటం ద్వారా డబ్బులు బాగా వస్తున్నాయని, నీవు కూడా బెట్టింగ్ పెడితే బాగా లాభాలు సంపాదించవచ్చంటూ బీటెక్ విద్యార్థిని నమ్మించాడన్నారు. తండ్రి మరణంతో వచ్చిన బీమా సొమ్ము మొత్తం బ్యాంకులో ఉండగా వ్యాపారం పేరుతో ఆ నగదును బీటెక్ విద్యార్థి బయటకు తీసి విడతల వారీగా నరేంద్రరెడ్డికి ఇచ్చాడు.
చివరకు 300 గ్రాముల తూకం ఉండే మూడు బంగారు బిస్కెట్లను కూడా హస్తగతం చేసుకోవడంతో పాటు ఇంకా పది లక్షల రూపాయలు ఇవ్వాలంటూ బెదిరిస్తున్న నేపథ్యంలో చేసేదిలేక బీటెక్ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అరెస్టు చేశారు. అతని నుంచి 300 గ్రాముల తూకం ఉండే మూడు బంగారు బిస్కెట్లు, రూ.12.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారించగా బెట్టింగ్ ఆడటమే ఒక నేరమైతే, బెట్టింగ్ పేరుతో డబ్బులు తీసుకొని బెట్టింగ్‌లో డబ్బులు పెట్టకుండానే చీట్ చేసిన నేరం మరొకటి వెలుగు చూసింది. డబ్బులతో బెట్టింగ్ ఆడవచ్చంటూ నిందితుడు యేమిరెడ్డి నరేంద్రరెడ్డిని ప్రోత్సహించిన మహేష్ అనే మరొకడు పరారీలో ఉన్నాడు. అతడికి బెట్టింగ్ కోసం రూ.6.30 లక్షలు ఇచ్చినట్లు నరేంద్రరెడ్డి పోలీసులతో చెప్పాడు. మహేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసిన డీఎస్పీ రాధేష్ మురళి, ఒంగోలు టూటౌన్ సీఐ రాంబాబుతో పాటు సిబ్బంది రఘు తదితరులను ఎస్పీ అభినందించారు.
కాలేజీ విద్యార్థులూ..తస్మాత్ జాగ్రత్త!
బెట్టింగ్ వైపు దృష్టి సారించి విద్యార్థులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. బెట్టింగ్‌ను రూపుమాపేందుకు పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. అందులో భాగంగా అన్ని కాలేజీల్లో బెట్టింగ్ వంటి వాటితో విద్యార్థుల జీవితాలు ఎలా నాశనం అవుతాయనే దానిపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. బెట్టింగ్ కేసుల్లో అరెస్టయిన వారికి భవిష్యత్తులో పాస్‌పోర్టులు మంజూరు కావని, నేడు ప్రైవేటు సెక్యూరిటీ గార్డు పోస్టుకు సైతం ఎంక్వయిరీ తప్పనిసరైనందున ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు సైతం అనర్హులుగా మిగిలిపోతారని ఎస్పీ హెచ్చరించారు.
బెట్టింగ్ బ్యాచ్‌ని గుర్తించేందుకు చర్యలు
ఇదిలా ఉంటే క్రికెట్ ఆటలు ఆడే విద్యార్థులు, యువకుల వద్దకు వెళ్లి యువతను ప్రలోభ పెట్టే బ్యాచ్‌ను గుర్తించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని ఎస్పీ సత్యఏసుబాబు తెలిపారు. బీటెక్ విద్యార్థిని మోసం చేసిన కేసులో రెండో నిందితుడైన మహేష్‌ను అరెస్టు చేసి విచారిస్తే బెట్టింగ్ యాప్ గురించిన వివరాలు కూడా వెలుగులోకి వస్తాయని భావిస్తున్నామన్నారు. త్వరగా డబ్బు సంపాదించాలనే కోరిక ఇందుకు కారణంగా ఉంటుందని, బెట్టింగ్ రాయుళ్ల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇవే కాకుండా వన్‌టైం పాస్‌వర్డు పేరుతో ప్రలోభపెట్టి డబ్బును ఆన్‌లైన్ ద్వారా కాజేసే ఆర్థిక నేరగాళ్లు పెరిగిపోయారని, ఇందులో బాధితులు ఉన్నత విద్యావంతులు కావడం బాధకలిగిస్తోందన్నారు. తాజాగా ఆన్‌లైన్ ద్వారా రుణం ఇప్పిస్తామంటూ కూడా మోసం చేసే బ్యాచ్‌లు రంగంలోకి వచ్చాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. మోసాలు అరికట్టాలంటే ప్రజలు బ్యాంకింగ్‌కు సంబంధించి రహస్య సమాచారాన్ని ఇతరులకు తెలియజేయవద్దని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment