జైన్ కౌశిక్..
అమలాపురం టౌన్: పట్టణంలో అదృశ్యమైన విజయవాడకు చెందిన బంగారు నగల వ్యాపారి జైన్ కౌశిక్ ఆచూకీ మిస్టరీగా మారింది. నగల ఆర్డర్ల కోసం నాలుగు రోజుల క్రితం అమలాపురం వచ్చిన జైన్ కౌశిక్ ఆ రాత్రి ఓ లాడ్డిలో బస చేశాడు. ఆ మర్నాడు విజయవాడలోని తన కుటుంబీకులకు అమలాపురం నుంచి బయలుదేరుతున్నట్టు ఫోన్‌లో చెప్పినప్పటికీ అతను ఇంటికి చేరుకోలేదు. ఆ మర్నాడు కూడా అతడి జాడ తెలియకపోవడంతో చివరకు జైన్ కౌశిక్ కుటుంబీకులు అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్‌లో మ్యాన్ మిస్సింగ్ కేసు పెట్టారు. పట్టణ సీఐ బాజీలాల్ కేసు దర్యాప్తు ప్రారంభించారు. అమలాపురం డీఎస్పీ షేక్ మాసూమ్ బాషా ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయించారు. ఈ దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూశాయి.
మలుపు తిరిగిన కేసు దర్యాప్తు:
ముప్పై ఏళ్ల యువకుడైన జైన్ కౌశిక్ నగల వ్యాపారిగా అమలాపురం వచ్చి, అదృశ్యం కావడంపై డీఎస్పీ షేక్ మాసూమ్ బాషా దృష్టి పెట్టారు. ఆయన విజయవాడ పోలీసులతో మాట్లాడి అక్కడ జైన్ కౌశిక్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో కౌశిక్ 2016లో అరెస్టయినట్టు తేలింది. ఇప్పటి అతడి అదృశ్యానికి... నాటి క్రికెట్ బెట్టింగులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేశారు. కౌశిక్ ఫోన్ కాల్స్ డేటాను సేకరించి అదృశ్యానికి ముందు అతడు ఎవరెవరిని కాంటాక్ట్ చేశాడో వంటి వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు డీఎస్పీ బాషా నాలుగు పోలీసు బృందాలను ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ముఖ్య నగరాలకు పంపించారు. కౌశిక్ బస చేసిన లాడ్జిలో పోలీసులు ఆరా తీయగా ఆ రోజు ఉదయమే అతడు లాడ్జి రూమ్ ఖాళీ చేసి వెళ్లినట్టు సమాచారం వచ్చింది. లాడ్జిలో రూమ్ ఖాళీ చేసిన తర్వాత నగల వ్యాపారి ఉదయం నుంచి రాత్రి వరకూ అమలాపురంలోనే ఉన్నాడా...? అతడిని బయట నుంచి వచ్చిన అపరిచితులు ఎవరైనా కలిశారా తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment