నాగరిక ఎంత అభివృద్ధి చెందినా... సాంకేతికంగా ఎంత పురోగమిస్తున్నా ఈ లోకంలో ఆడ జన్మకు కష్టాలు మాత్రం తప్పడం లేదు. నవ మాసాలు కడుపులో మోసి బిడ్డను కనటానికి తల్లి నరక బాధను అనుభవిస్తుంది. తన ప్రాణాలను పణంగా పెట్టి బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో.. అప్పుడే ఈ లోకంలోకి అడుగుపెట్టిన శిశువును నడిరోడ్డుపైనే వదిలేసి వెళ్లింది. రోడ్డుపై మాంసం ముద్దలా విగత జీవిగా పడి ఉన్న ఆ శిశువును చూసి స్థానికుల కళ్లు చెమర్చాయి. చందాలు వేసుకుని మరీ ఆ శిశువుకు దహన సంస్కారాలు చేశారు. ఈ హృదయ విదారక ఘటన గురువారం చీరాలలో చోటుచేసుకుంది.
సాక్షి, చీరాల రూరల్(ప్రకాశం) : అది చీరాల పట్టణంలోని విఠల్ నగర్ ప్రాంతం. ఊరు పేరు తెలియని నిండు గర్భిణి... ఎవరి చేతిలోనైనా మోసానికి గురైందో లేక ఆ తల్లికి ఏ కష్ట మొచ్చిందో తెలియదు బుధవారం రాత్రి స్థానిక రెడ్డిగారి స్కూలు వద్దకు చేరుకుంది. నా అనేవారు ఎవరూలేని ఆ అభాగ్యురాలు స్కూలు సమీపంలోని రహదారిపై ఏ సమయంలో పురుడు పోసుకుందో ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. శిశువును అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. ఉదయాన్నే మృత శిశువును చూసిన స్థానికులు తీవ్ర కలత చెందారు. పేగు కూడా కత్తిరించని స్థితిలో మాతృమూర్తి కడుపులోని అవయవాలు కూడా రోడ్డుపైనే పడివున్నాయి.
అప్పటికే ఆ ఆడ శిశువు అచేతనంగా రోడ్డుపై పడి ఉంది. ఈ దృశ్యన్ని చూసిన స్థానికులు తీవ్ర మనో వేదనకు గురయ్యారు. కొందరు మహిళలు కంటతడి పెట్టారు. తలో కొంత డబ్బులు చందాలు రూపంలో వసూలు చేసుకుని గురువారం ఆ శిశువుకు దహన సంస్కారాలు నిర్వహించారు. ఆడపిల్ల పుడితే కుటుంబానికి భారం కాకూడదని ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశ పెడుతున్నా మానవత్వాన్ని మరచిన కొందరు కఠిన హృదయులు ఇటువంటి దురాగతాలకు పాల్పడటం శోచనీయం.
Comments
Please login to add a commentAdd a comment