
మృతదేహాన్ని బయటకు తీయిస్తున్న ఎస్‌ఐ వలి
ప్రకాశం ,గిద్దలూరు రూరల్: ఇంటర్ మొదటి సంవత్సరం సప్లమెంటరీ పరీక్ష రాయాల్సి ఉన్న విద్యార్థిని దుండగులు దారుణంగా హత్య చేసి పూడ్చి పెట్టారు. ఈ సంఘటన మండలంలోని కొంగలవీడు సమీపం అంకాలమ్మ గుడికి కూతవేటు దూరంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. కొంగలవీడు ఎస్టీ కాలనీకి చెందిన రోశయ్య కుమారుడు, ఇంటర్ విద్యార్థి రమణయ్య (19)ను మంగళవారం రాత్రి సమయంలో అంకాలమ్మ గుడి నుంచి రాజానగర్ మీదుగా వెళ్లే కొండ రోడ్డు ప్రాంతంలో కొందరు అతి దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. మృతదేహాన్ని అక్కడే పూడ్చి పెట్టి అనంతరం అక్కడ ఉన్న పాత సిమెంట్ రేకులను పైన కప్పి వెళ్లిపోయారు. పూడ్చి పెట్టిన మట్టి కుప్ప వద్ద చిల్లర డబ్బులు పడి ఉన్నాయి.
హత్య జరిగిన ప్రదేశంలో రక్తపు మరకలతో పాటు ఈడ్చుకెళ్లిన గుర్తులు ఉన్నాయి. కత్తికి ఉండాల్సిన కర్ర పిడి ముక్కను సైతం అక్కడే వదిలేశారు. రోడ్డుపై ఉన్న రక్తపు మరకలను గమనించిన కొంగలవీడుకు చెందిన పొలం యజమాని వెంకటేశ్వర్లు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ వలి సంఘటన స్థలానికి చేరుకుని రక్తపు మరకల ఆధారంగా పూడ్చి పెట్టిన రమణయ్య మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని చూసిన కొంగలవీడు గ్రామస్తులు మృతుడు ఎస్టీ కాలనీకి చెందిన రోశయ్య కుమారుడు రమణయ్యగా గుర్తించారు. అనంతరం మృతుడి తల్లిందడ్రులకు సమాచారం అందించారు. తల, మెడపై బలమైన కత్తి గాయాలు ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పట్టణంలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. హత్యకు కారణాలు పోలీసుల విచారణలో బయట పడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment