నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, బంగారు ఆభరణాలను పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, ఇతర అధికారులు
ఒంగోలు: దర్శికి చెందిన బంగారు నగల వ్యాపారి ఒగ్గు ఆదినారాయణ హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం నలుగురిని నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. మరో రెండు కేసుల్లోనూ వీరి పాత్ర ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. వీరి నుంచి రూ.20 లక్షల విలువైన చోరీ సొత్తను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబు వెల్లడించారు.
జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ బి.సత్య ఏసుబాబు మాట్లాడుతూ దర్శికి చెందిన బంగారు వ్యాపారి ఒగ్గు ఆదినారాయణరెడ్డి కేసులో నిందితులను అదుపులోకి తీసుకొని విచారించామని తెలిపారు. విచారణలో వారు మరో రెండు కేసుల్లో కూడా నిందితులుగా స్పష్టమైందన్నారు. మొత్తం మూడు కేసులకు సంబంధించి నలుగురిని అరెస్టు చేసి రూ.20లక్షల సొత్తు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
డబ్బు కోసం అడ్డదారులు..
దర్శి మండలం పోతవరం గ్రామానికి చెందిన గోపిశెట్టి నాగమల్లేశ్వరరావు ఆరో తరగతి వరకు చదువుకున్నాడు. కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఇతడి భార్య మరణించడంతో కృష్ణవేణి అనే 22 ఏళ్ల యువతితో సహజీవనం ప్రారంభించాడు. డబ్బుకోసం అడ్డదారులు తొక్కి నరసరావుపేట, అద్దంకి, దర్శి ప్రాంతలలో ఆమెతో వ్యభిచార గృహాలు నిర్వహించడం మొదలుపెట్టాడు. 2015లో దర్శి పోలీసులు వ్యభిచార నేరం కింద నాగమల్లేశ్వరరావును అరెస్టు కూడా చేశారు. ఈ క్రమంలో వ్యభిచార గృహాల ద్వారా పెద్ద పెద్ద మనుషులకు గాలం వేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ముండ్లమూరు మండలం చింతలపూడి గ్రామానికి చెందిన గుండాల రాజశేఖరరెడ్డిని, అద్దంకి మండలం చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన మన్నెం కోటేశ్వరరావు, గర్నెపూడి సురేష్‌లను తన ముఠాలో సభ్యులుగా చేర్చుకున్నాడు. రాజశేఖరరెడ్డి గతంలో అద్దంకిలో ఒక హోటల్‌లో క్యాషియర్‌గా పనిచేసేవాడు. తరువాత హైదరాబాద్‌లోవీడిన హత్య కేసు మిస్టరీఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. ఒంగోలు సమీపంలోని ఒక ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతుండగా ప్రేమ వ్యవహారంలో ఇంటివద్ద గొడవ జరిగింది. ఈ కారణంగా హైదరాబాద్‌లో తన బంధువుల ఇంటి వద్ద ఉంటున్నాడు. ఇక గర్నెపూడి సురేష్ ఐఐటీ పూర్తి చేసిన తరువాత కొద్దికాలంపాటు అద్దంకిలో హాల్టింగ్ డ్రైవర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం అనంతపురంలో విప్రో కంపెనీలో క్వాలిటీ టెస్టింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.
నిందితులు అంగీకరించిన నేరాలు..
ఆర్థిక కారణాలతో వ్యసనాలకు బానిసైన నాగమల్లేశ్వరరావు మరో మహిళతో సహజీవనం చేస్తూ , ఆమెతో వ్యభిచార గృహాలు నిడిపించడం ద్వారా ధనవంతులతో పరిచయాలు ఏర్పాటు చేసుకున్నాడు. తన అవసరాలకు సరిపడ డబ్బులు అందకపోవడంతో నేరప్రవృత్తిని ఎంచుకొని అద్దంకి ప్రాంతంలో వ్యభిచార గృహం నిర్వహిస్తూ మిగిలిన ముగ్గురిని కూడగట్టి ముఠా నాయకుడిగా మారాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో నరసరావుపేట పట్టణం బరంపేటలో దిర్శ డీఎస్పీ నాగేశ్వరరావు స్వీయ పర్యవేక్షణలో అద్దంకి సీఐ ఎం.హైమారావు తన సిబ్బంది సాయంతో అరెస్టు చేశారని ఎస్పీ తెలిపారు. అనంతరం వారిని విచారించగా మూడు నేరాలను అంగీకరించారన్నారు. ఈ ఏడాది జనవరిలో మార్కాపురంలో ప్రధాన నిందితుడైన నాగమల్లేశ్వరరావు ప్లాటినా మోటారు బైకు దొంగతనం చేశాడన్నారు. అదే సమయంలో అద్దంకికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి నకిలీ కరెన్సీ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి రూ.1.30 లక్షలు ఒంగోలు కర్నూల్‌రోడ్డులో తీసుకున్నాడని, ఒంగోలు తాలూకా పోలీస్టేషన్లో కేసు కూడా నమోదై ఉందని ఎస్పీ తెలిపారు.
మే నెలలో నాగమల్లేశ్వరరావు, గుండాల రాజశేఖరరెడ్డి ఇరువురు గిద్దలూరులో కేశవులు అనే కారు డ్రైవర్‌ను కురిచేడులో వివాహానికి వెళ్లాలని బాడుగకు మాట్లాడుకొని బయలుదేరారు. మార్గంమధ్యలో కేశవులను చున్నీతో గొంతు బిగించి చంపివేశారు. అదే కారులో శవాన్ని నాదెండ్ల మండలం గురపనాయుడు పాలెంకు తీసుకెళ్లి శివారులో పెట్రోలుతో కాల్చి చంపారు. కారుతో ఉడాయిస్తుండగా యాక్సిడెంట్ కావడంతో శావల్యాపురంలో దానిని వదిలేసి డ్రైవర్ మొబైల్‌తో ఉడాయించారు. ఈ మూడు కేసులతోపాటు చివరగా ఈ ఏడాది ఆగస్టు 14న దర్శి నగల వ్యాపారి ఆదినారాయణను పథకం ప్రకారం అద్దంకిలోని ఒక రూముకు పిలిపించారు. చంపుతామని బెదిరించి రూ.20లక్షలు డిమాండ్ చేశారు. రూ.5 లక్షలు తెప్పిస్తామని చెప్పగా అంగీకరించి, ఆదినారాయణ తన స్నేహితుడి ద్వారా తెప్పించిన రూ.5లక్షలు తీసుకున్నారు. ముఠా సమాచారం బయటకు పొక్కరాదనే ఉద్దేశంతో అతని గొంతుకు గుడ్డ బిగించి చంపేశారు. అతని వద్ద ఉన్న బంగారు చైను, రెండు బంగారు ఉంగరాలు, పర్సు, సెల్‌ఫోను, ఏటీఎం కార్డు తీసుకొని శవాన్ని కారులో ఎక్కించుకొని ఆదినారాయణ మృతదేహాన్ని త్రిపురాంతకం సమీపంలో పడవేసి పెట్రోలుతో కాల్చివేశారు. కారును పామూడు బస్టాండు వద్ద వదిలిపెట్టారు. పోలీసుల దృష్టి మార్చేందుకు ఆదినారాయణ సెల్‌ను తమిళనాడు రాష్ట్రానికి చెందిన లారీలో పడేసినట్లు నిందితులు తమ దర్యాప్తులో అంగీకరించారని ఎస్పీ ప్రకటించారు.
కేసు ఛేదించిన సిబ్బందికి అభినందన..
గిద్దలూరు పోలీసుస్టేషన్ కేసుకు సంబంధించి మృతుడి వివో మొబైల్, అతని ఆధార్‌కార్డు, దర్శి కేసుకు సంబంధించి మృతని సెల్‌ఫోన్, బంగారు చైన్, రెండు బంగారు ఉంగరాలు, నాలుగు ఏటీఎం కార్డులు, స్విఫ్ట్‌కారు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, అతని బార్య ఆధార్ కార్డు. మార్కాపురంలో నాగమల్లేశ్వరరావు చోరీ చేసిన ప్లాటినా బైకు, ఈ నేరాలను చేసేందుకు నాగమల్లేశ్వరరావు ముఠా వినియోగించిన స్విఫ్ట్ డిజైర్ కారు ఒక కత్తి, ముద్దాయిలు వాడిన 9 మొబైల్స్, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. వీటి మొత్తం విలువ రూ.20 లక్షలుగా తెలిపా రు. నిందితులు నలుగురిపై రౌడీషీట్లు కూడా తెరుస్తున్నామని ఎస్పీ తెలిపారు. గత 8 నెలలుగా జిల్లాలో పలు నేరాలకు పాల్ప డుతూ తప్పించుకు తిరుగుతున్న కిడ్నాపర్ల ముఠాను అరెస్టు చేసిన దర్శి డీఎస్పీ కె.నాగేశ్వరరావుతోపాటు అద్దంకి సర్కిల్ పోలీసులను జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ కె.లావణ్యలక్ష్మి, స్పెషల్ బ్రాంచి సీఐ వై.శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment