వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ, స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు
ఒంగోలు: నమ్మకం నటిస్తూ వీలు చూసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న మాయ లేడి పన్నిబోయిన శ్రీదేవిని అరెస్టు చేసినట్లు ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితురాలు గతంలో పలు నేరాలకు పాల్పడిందన్నారు. బాపట్ల పోలీసులు ఆమెను మూడు కేసుల్లో అరెస్టు చేసి రిమాండ్‌కు కూడా పంపారని తెలిపారు. రిమాండ్ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన ఆమె తర్వాత గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకరోడ్డులోని టి.నగర్ నుంచి కొత్తపట్నం మండలానికి మకాం మార్చిందన్నారు.
ఇక్కడ మొక్కలు అమ్మడం ప్రారంభించి ప్రజలను నమ్మిస్తూ వారు ఇంటి తాళాలను ఎక్కడ పెడుతున్నారనేది గమనించేదన్నారు. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్‌లో గమళ్లపాలెంలో బలగాని వెంకటేశ్వర్లు ఇంట్లో 12 సవర్లు, ఈ ఏడాది జనవరి 25న కె.పల్లెపాలెంలో నాయుడు అంకమ్మ ఇంట్లో 4 సవర్లు, జనవరి 27న కె.పల్లెపాలెం బీచ్‌లో కె.రాజేష్ అనే వ్యక్తికి చెందిన 4 సవర్ల బంగారపు ఆభరణాలను చోరీ చేసిందన్నారు. వరుసగా జరుగుతున్న నేరాల్లో నిందితుల కోసం ఒంగోలు టూటౌన్ సీఐ రాజేష్, కొత్తపట్నం ఎస్సై ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించగా కొత్తపట్నం పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న జియోలు సాయి, బాలులు కీలక సమాచారాన్ని తీసుకువచ్చారన్నారు. ఈ క్రమంలో తమ సిబ్బంది కె.పల్లెపాలెం బీచ్‌వద్ద అనుమానాస్పదంగా కనిపించిన శ్రీదేవిని అదుపులోకి తీసుకుని విచారించగా మూడు నేరాలను ఒప్పుకోవడంతో పాటు మూడు కేసుల్లో 18 సవర్ల బంగారు ఆభరణాలు ఆమె వద్ద లభ్యమయ్యాయన్నారు. ఈ సందర్భంగా కేసు చేధించేందుకు కృషిచేసిన వారందరినీ డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment